ఏపిలో సీటు దక్కించుకోలేకపోయిన వామపక్షాలు
ప్రధాన వామపక్షాలైన సిపిఐ, సిపిఎం పార్టీల పరిస్థితి దేశంలోనూ, రాష్ట్రంలో దయనీయంగా తయారైంది. ఒకప్పుడు జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో కీలక పాత్ర పోషించిన ఈ రెండు పార్టీల స్థానాలు ఈరోజు దిగజారిపోయాయి. దేశం మొత్తం మీద ఈ రెండు పార్టీలు కలిసి కేవలం 10 లోక్సభ స్థానాలను మాత్రమే గెలుచుకున్నాయి. సిపిఎం 9 స్థానాలను గెలుచుకుంటే, సిపిఐ ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2004లో ఒక్క సిపిఎం 44 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. ఈ లోక్సభలో ఆ పార్టీల పరిస్థితి ఈ స్థాయికి దిగజారిపోయింది.
ఇక రాష్ట్రం విషయానికి వస్తే ఒక్క లోక్సభ స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. ఖమ్మం నుంచి పోటీ చేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా ఓడిపోయారు. సిపిఐ తెలంగాణ కోసం పోరాడినా ఫలితంలేకుడా పోయింది. ఈ రెండు పార్టీలు తెలంగాణలో మాత్రమే చెరొక శాసనసభ స్థానాన్ని గెలుచుకోగలిగాయి. దేవరకొండలో సిపిఐ, భద్రాచలంలో సిపిఎం గెలిచాయి. ఆంధ్ర ప్రదేశ్లో ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఏపి కొత్త శాసనసభలో ఈ రెండు పార్టీలకు స్థానం లేకుండా పోయింది. సమైక్యత కోసం నిలబడిన సిపిఎంను కూడా ప్రజలు గెలిపించలేదు.
సిపిఐ, సిపిఎం రెండు పార్టీలు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్లో కలిసే ప్రజాపోరాటాలు చేస్తూ ఉన్నాయి. ఎన్నికల సమయంలో మాత్రం ఎక్కువగా కలిసే పోటీ చేస్తుంటాయి. సిద్దాంత పరంగా, విలువల పరంగా ముందుండే రెండు పార్టీలు ప్రజా పోరాటాలలో కూడా ముందే ఉంటాయి. ఎన్నికలప్పుడు మాత్రం కొన్ని సందర్భాలలో కలిసి పోటీ చేస్తే, కొన్ని సందర్భాలలో ఎవరికి వారుగా పోటీ చేస్తుంటారు. కలిసి పోటీ చేసి ప్రతిసారీ మంచి విజయాలే సాధించారు. గతంలో అనేక ఎన్నికలు ఈ విషయాన్ని రుజువు చేశాయి కూడా. ఈ రెండు పార్టీలు 30కి పైగా స్థానాలు గెలుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వారు కలసి పోటీ చేయడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు మాత్రం తీసుకోరు. ఒకరిపై ఒకరు నిందులు వేసుకుంటుంటారు. టిడిపి ఆవిర్భావించినప్పుడు ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న ఈ రెండు పార్టీలు మెరుగైన ఫలితాలను సాధించాయి. ఈ సారి తెలంగాణలో ఒక విధంగా, ఆంధ్రప్రదేశ్లో మరో విధంగా వ్యవహరించాయి. సిపిఐ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. ఏపిలో లేదు. సిపిఐ తెలంగాణలో వైఎస్ఆర్ సిపితో పొత్తు పెట్టుకుంది. ఏపిలో జైసమైక్యాంధ్రతో పొత్తు పెట్టుకుంది. ఇంత అనుభవం ఉన్న సిపిఎం కూడా జైసమైక్యాంధ్ర వంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం విచిత్రంగా ఉంది.