విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : మే 7న జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఐదు రోజులు మాత్రమే జరుగుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కాంతిలాల్ దండే బుధవారం తెలిపారు. ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదలవుతుందని అదే రోజు నుంచి 19వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ నెల 13, 14, 18 తేదీలు సెలవు రోజులైనందున నామినేషన్లు స్వీకరించబోమని స్పష్టం చేశారు. మిగిలిన ఐదు రోజులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వర కు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు ఫారం 2ఏ, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులు ఫారం బీని దాఖలు చేయూల్సి ఉం టుందని పేర్కొన్నా రు. పార్లమెంటు స్థానానికి పోటీ చేసే వారు ధరావత్తు కింద రూ.25 వేలు, శాసనసభలకు పోటీ చేసే వారు రూ.10 వేలు నామినేషన్ పత్రంతో పాటు చెల్లించాల్సి ఉంటుందని తెలి పారు. ఎస్సీ, ఎస్టీలు ఎంపీ స్థానానికి రూ. 12,500, శాసనసభ స్థానానికి రూ. 5 వేలు చెల్లించాలని పేర్కొన్నారు. నామినేషన్ పత్రం తో పాటు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిం చాలని సూచించారు.