దౌర్జన్యం, బెదిరింపులు: విశ్వరూపం చూపుతున్న టిడిపి నేతలు
హైదరాబాద్: టిడిపి నేతలు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల వద్ద విశ్వరూపం చూపుతున్నారు. దౌర్జన్యానికి దిగుతున్నారు. వైఎస్ఆర్ సిపి ఏజెంట్లను, ఓటర్లను బెదిరిస్తున్నారు. కొన్ని చోట్ల డబ్బులు కూడా పంచుతున్నారు. టిడిపి అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు పలుచోట్ల నిబంధనలు అతిక్రమించి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారు. అనేక గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గొడుగుపేటలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారు. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో వల్లభనేని వంశీ అనుచురులు వైఎస్‌ఆర్ సీపీ ఏజెంట్లను బెదిరించారు.
నెల్లూరు జిల్లా బోగోలు పాతపాలెంలో టీడీపీ ఏజెంట్లు వైఎస్ఆర్ సిపి ఏజెంట్‌ను బయటకు నెట్టివేశారు. తమకు చూపించి ఓటు వేయాలంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాలెం నరసింహపురంలో వైఎస్‌ఆర్‌సీపీ ఏజెంట్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. తమకు ఓటు వేయాలంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. పోలీసులు పట్టించుకోవడంలేదు. దాంతో ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. పోలింగ్ నిలిచిపోయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కర్నూలు జిల్లా నంద్యాల పోలింగ్ పోలింగ్ కేంద్ర వద్ద టీడీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. పోలింగ్ బూత్‌ల వద్ద శిల్పామోహన్‌రెడ్డికి ఓటేయాలంటూ బ్యానర్లు కట్టడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మంత్రాలయం పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. స్థానికేతర్లను ఏజెంట్లుగా పెట్టాలని అధికారులపై టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి చిందులు వేశారు.
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు 25వ వార్డులో టీడీపీ, వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
అనంతపురం జిల్లా కదిరి వీవర్స్ కాలనీలో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీకి చెందిన రౌడీషీటర్ రెడ్డప్ప ఓటర్లను బెదిరిస్తున్నాడు. అనంతపురంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మహాలక్ష్మి శ్రీనివాస్, సాలార్‌బాషాలను హౌస్ అరెస్ట్ చేశారు.
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెంలో వైఎస్ఆర్ సిపి ఏజెంట్‌ను టిడిపి కార్యకర్తలు బయటకు నెట్టివేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.