ఓటెత్తారు!
సాక్షి, గుంటూరు: పట్టణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లాలో 12 మునిసిపాలిటీలకు ఆదివారం పోలింగ్ నిర్వహించగా స్వల్ప ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా జరిగింది. సగటు పోలింగ్ శాతం 78.94గా నమోదైంది. మంగళగిరిలో అత్యధికంగా 86.59 శాతం నమోదు కాగా, అత్యల్పంగా తెనాలిలో 73.72 శాతం నమోదైంది. రేపల్లెలో 79.83 శాతం, సత్తెనపల్లిలో 80.08, బాపట్లలో 76.45, మాచర్లలో 75.62, పొన్నూరులో 79.89, తాడేపల్లిలో 83.57, పిడుగురాళ్ళలో 79.05, నరసరావుపేటలో 79.14, వినుకొండలో 80.34, చిలకలూరిపేటలో 81.34 శాతంగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. ఆ వెంటనే మంగళగిరి, పొన్నూరులలో ఈవీఎంలు మొరాయించాయి. కరెంటు కోతలతో పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాడేపల్లిలో కరెంటు కోతతో పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలో పార్టీ గుర్తులు సరిగా కనిపించక ఇబ్బందులు పడ్డారు. ఓటింగ్ మొదలైన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు డబ్బు పంచుతూ పోలీసులకు దొరికిపోయారు.
మాచర్లలో మాజీ ఎమ్మెల్యే వీరంగం
మాచర్ల 29 వార్డులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మద్దతుదారుడు పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఈవీఎంను పగలకొట్టేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంలో ప్రవేశించిన లక్ష్మారెడ్డి ఈవీఎంను నేలకేసి కొట్టగా పోలింగ్ సిబ్బంది ఒక్కసారి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే వైఎస్సార్ సీపీ నాయకులు, టీడీపీ నేతలు భారీగా అక్కడకు చేరుకున్నారు. రేంజ్ ఐజీ సునీల్‌కుమార్ ఆ సమయంలో అక్కడే ఉండటడంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీఛార్జ్ చేసి నేతల్ని, కార్యకర్తల్ని చెదరగొట్టారు. లక్ష్మారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఆయనపై నాన్ బెయిల్‌బుల్ కేసులు నమోదు చేశారు. ఈవీఎంను నేలకేసి కొట్టడంతో వార్డులో పోలింగ్ గంట ఆలస్యం అయింది. దీంతో రిటర్నింగ్ అధికారి మరో గంట సమయం పొడిగించి ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. నరసరావుపేటలో పోలీసులు ఓవరాక్షన్‌తో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. వినుకొండలో పోలీసుల లాఠీఛార్జి కారణంగా ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్ధికి పోలింగ్ సిబ్బందికి సహకరిస్తున్నారని అక్కడ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి రాంబాబు ఎన్నికల సంఘం ఉన్నతాధికారి నవీన్ మిట్టల్‌కు ఫిర్యాదు చేశారు.