పార్లమెంట్‌ను ప్రక్షాళన చేస్తా
నేర నేతలను ఏరేస్తా.. బీజేపీ, ఎన్డీయే వాళ్లనూ వదల: మోడీ
ఎన్నికల్లో పోటీకి నిందితులు భయపడాలి
పేదల ఇళ్లకు వెళ్తున్న రాహుల్‌ది
‘పేదరిక పర్యాటకం’
హర్దోయ్(ఉత్తరప్రదేశ్): అధికారంలోకి వస్తే రాజకీయ వ్యవస్థను, పార్లమెంట్‌ను ప్రక్షాళన చేస్తానని, నేరగాళ్లను ఏరివేస్తానని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రకటించారు. కొత్తగా ఎన్నికయ్యే ఎంపీలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులపై విచారణ జరపడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడమే తాను చేపట్టే తొలి చర్యగా పేర్కొన్నారు. కేసుల విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టును కోరుతానని, దోషులను జైలుకు పంపిస్తానని మోడీ స్పష్టం చేశారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరెవరిపై ఏయే కేసులు పెండింగ్‌లో ఉన్నాయో గుర్తించడానికి ప్రత్యేక కమిటీని వేయాలని నిర్ణయించాను.
బీజేపీ, ఎన్డీయే ఎంపీలను కూడా వదిలిపెట్టను. కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును కోరతాను. నేరగాళ్లు జైలుకు వెళ్లాలి. వారి స్థానంలో మంచి నేతలు రావాలి. ఆరోపణలు ఎదుర్కొనే వారెవరూ ఎన్నికల్లో పోటీకి ధైర్యం చేయకూడదు’ అని మోడీ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ వెనుకబాటుతనానికి అధికార క్రీడలో మునిగిన కాం గ్రెస్, ఎస్పీ, బీఎస్పీలే కారణమని ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు.
తల్లీకొడుకులు (సోనియా, రాహుల్) కలిసి దేశాన్ని నాశనం చేస్తే.. మరోవైపు తండ్రీకొడుకులు(సమాజ్‌వాదీ నేతములాయంసింగ్‌యాదవ్, అఖిలేశ్ యాదవ్) కలిసి ఉత్తరప్రదేశ్‌ను నాశనం చేశారని విమర్శించారు. ఇక రాహుల్ గాంధీ పేదల ఇళ్లకు వెళ్లడంపై మోడీ చురకలంటించారు. ఎన్నడూ తాజ్‌మహల్ చూడని వారు ఆగ్రాకు ఎలా వెళతారో.. అలాగే పేదరికం ఎరుగని రాహుల్.. పేదవాడు ఎలా ఉంటాడో అర్థం చేసుకోడానికి వారి ఇళ్లను పర్యాటక కేంద్రాలుగా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. పేదరికమే ఆయనకు పర్యాటక స్థలమని అభివర్ణించారు. ‘నేను పేదరికంలో పుట్టాను. చలి రాత్రులు ఎలాగుంటాయో నాకు తెలుసు. నేను అం దించే చాయ్ చల్లగా ఉంటే చాలా మంది నన్ను కొట్టేవారు. ఆ గుర్తులు ఇంకా ఉన్నాయి’ అని మోడీ పేర్కొన్నారు.
బీజేపీ అభ్యర్థుల్లోనే ఎక్కువ నేరగాళ్లు: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లోనే ఎక్కువ మందికి నేరచరిత్ర ఉంది. రాజకీయాల ప్రక్షాళనపై మోడీ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ ఎంపీ అభ్యర్థుల్లో 48 మందిపై క్రిమినల్ కేసులుండగా.. కాంగ్రెస్ తరఫున 36 మంది, ఆప్ నుంచి 39 మంది నేర నేతలు పోటీలో ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ నివేదిక ద్వారా తెలుస్తోంది.