పొట్లూరి ఆశలపై నీళ్లుచల్లిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్న పీవీపీ గ్రూప్ యజమాని పొట్లూరి వరప్రసాద్ ఆశలపై సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ నీళ్లు చల్లారు. పవన్ మద్దతుతో టీడీపీ టిక్కెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని పొట్లూరి భావించారు. దీని కోసం పవన్ మద్దతు కోసం ఆయనతో ఈరోజు సంప్రదింపులు జరిపారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదని సమాచారం. పవన్ను ఒప్పించేందుకు పొట్లూరి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఆయన ససేమీరా అన్నారని తెలిసింది. పవన్ మద్దతు నిరాకరించడంతో పోటీ చేయడానికి పొట్లూరి వెనకడుగు వేస్తున్నారు.
మరోవైపు తమకు టిక్కెట్ దక్కకుండా చేసిన కేశినేని నానిని ఓడించాలని పొట్లూరి వర్గం వ్యూహాలు పన్నుతోంది. వరప్రసాద్ పోటీ చేసినా, చేయకపోయినా కేశినేనిని ఓడించాలని పొట్లూరి వర్గం పట్టుదలతో ఉంది. నామినేషన్ దాఖలుకు శనివారం వరకు గడువు ఉండడంతో పొట్లూరి ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.