పీఠం కోసమే పాకులాట
వల్సద్(గుజరాత్): బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధినేత్రి మరోసారి విరుచుకుపడ్డారు. మోడీ చెబుతున్నట్టుగా గుజరాత్ స్వర్గం కాదని, కేవలం పీఠం కోసమే ఆయన పాకులాడుతున్నారని విమర్శించారు. ఆమె గురువారమిక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ విభజన సిద్ధాంతాలు దేశానికి మంచిది కాదని, వాటిని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ‘‘బీజేపీ నాయకుడు తాను అధికారంలోకి వస్తే, దేశాన్ని స్వర్గంలా మారుస్తానని చెబుతున్నారు.
అయితే మీ నిత్యజీవితంలో ఎదుర్కొనే కష్టాల గురించి ఆయన నిజాలు చెప్పడంలేదు’’ అని మోడీ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. గుజరాత్ ప్రభుత్వానికి రూ.1.75 లక్షల అప్పు ఉందని, చాలా గ్రామాలకు మంచినీటి సదుపాయం కూడా లేదని, స్కూల్ డ్రాపౌట్ రేటు గుజరాత్‌లో చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ‘‘అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రోజుకు రూ.11 కంటే ఎక్కువ సంపాదిస్తున్నవారిని గుజరాత్ సర్కారు పేదలుగా పరిగణించడంలేదు. ఇప్పుడు మీరే చెప్పండి.. ఇది స్వర్గమా లేక మరేదైనానా’’ అని సోనియా ప్రజలనుద్దేశించి అడిగారు. ఆయనకు కేవలం కుర్చీపైనే ఆసక్తి అని, పేదల సంక్షేమం ఏమాత్రం పట్టదని ఆరోపించారు.