
ఆదాయ లెక్కలు చెప్పి అవినీతిపై మాట్లాడు
పవన్ కల్యాణ్‌పై ఎంపీ పొన్నం ధ్వజం
కరీంనగర్ , న్యూస్‌లైన్: నటించిన సినిమాలు..తీసుకున్న రెమ్యునరేషన్, ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు..ఈ ఆదాయ లెక్కలు చెప్పిన తర్వాతనే పవన్‌కల్యాణ్ అవినీతి గురించి మాట్లాడాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను పవన్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొదటి భార్యకు కోట్ల రూపాయలు ఇచ్చి విడాకులు తీసుకున్న పవన్ , ఆ డబ్బు వైటా, బ్లాకా చెప్పాలన్నారు. పరిటాల రవి గుండు కొట్టించినప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడెందుకు బయలుదేరాడని ఎద్దేవా చేశారు.
తెలంగాణ కోసం వందలాది యువత ఆత్మహత్యలు చేసుకున్నపుడు ఈ ప్రజాస్వామిక వాది ఎక్కడికి పోయాడని ప్రశ్నించారు. ఓట్లు, సీట్లు లేనపుడు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టావ్..ఎన్ని రోజులు పార్టీని ఉంచుతావ్..ఎంతమంది అభిమానులను ముంచుతావో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రజావేదికలపై నుంచి సమాధానం చెప్పాకనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలన్నారు. వివాహం, కుటుంబ వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి సమాజానికి ఎలా మార్గదర్శకుడవుతాడన్నారు. ప్రజా జీవితంలోకి వచ్చాక వ్యక్తిగత జీవితమంటూ ఉండదని చెప్పారు. అన్ని పార్టీలను మూడుసార్లు సంప్రదించి, అభిప్రాయాలు తీసుకున్నాకనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు. అభిప్రాయాలు మార్చుకున్న పార్టీలదే అడ్డగోలుతనంగాని.. విభజన అడ్డగోలుగా జరగలేదని తెలిపారు. మోడీ హవా ఉన్నపుడు, సినిమా నటులను గుజరాత్‌కు పంపించి మరీ బీజేపీలో ఎందుకు చేర్చుకుంటున్నారని నిలదీశారు.