సాక్షి, ఒంగోలు, ‘మీ సంగతి మాకు తెలుసు.. మేమెన్ని చెప్పినా, అక్కడికెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్‌కే ఓటేస్తారు..! మర్యాదగా ఇచ్చేది తీసుకుని, ఇళ్లల్లోనే ఉండాలి. పోలింగ్‌బూత్‌ల్లో కనిపించకూడదు..’ అంటూ ఓ శాసనసభ్యుడి బెదిరింపు సదరు నియోజకవర్గ పల్లెల్ని కలవరపరుస్తోంది. స్వతంత్రపోరుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న మరో నేత కూడా తన నియోజకవర్గంలో ఇదేతీరుగా హూంకరించడం ఓటర్లకు ఇబ్బందిగా మారింది.
టీడీపీకి చెందిన ప్రముఖ నేత సైతం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా.. పక్క నియోజకవర్గాల్లోని మండలాలపై కూడా పెత్తనం చెలాయిస్తూ మంత్రాంగం నెరపడం వివాదాలకు దారితీస్తోంది. గ్రామాల్లో నోరు మెదపని బడుగు, బలహీనవర్గాలు... ఎన్నికలు ముగిసేనాటికి పలుకుబడి గల నేతల కారణంగా ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఈ సమస్యలు జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాల్లోని దళిత, బీసీ కాలనీల్లో ఉన్నాయని పలువురు పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదులు కూడా పంపినట్లు తెలిసింది.
ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు అధికార యంత్రాంగం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ముమ్మరగస్తీ పెట్టింది. గ్రామాల గోడలపై యువతకు సందేశం ఇచ్చేలా పోస్టర్లను సైతం అంటించి శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రచారం చేస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. అధికార కాంగ్రెస్, టీడీపీ నేతలు అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసి బడుగు, బలహీన వర్గాల ఓటర్లను పిలిపించి బెదిరిస్తోన్న వైనంపై నిద్రనటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కనిగిరి మండలంలో కాంగ్రెస్‌కు పనిచేయకుండా.. వైఎస్సార్ సీపీ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారంటూ దళిత కార్యకర్తలపై సిట్టింగ్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఆ సందర్భంలోనే తామంతా జగన్ అభిమానులమంటూ చెప్పగా, అందరికీ డబ్బులిస్తామని.. పోలింగ్ బూత్‌ల్లో మాత్రం కనిపించరాదని శాసించినట్లు బాధితులు చెబుతున్నారు. మరో ఎమ్మెల్యే తమపరిధిలోని బీసీల్ని స్థానికంగా ఓ ఇంటికి పిలిపించి టీడీపీకి పనిచేయకుంటే, కేసులు పెట్టించాల్సి వస్తుందని బెదిరించినట్లు తెలిసింది.
పేదల కాలనీల్లో రాత్రిళ్లు హల్‌చల్
కాంగ్రెస్, టీడీపీ నేతలు మూకుమ్మడిగా ఉదయం పూట ప్రచారంలో ఇటీవల కొత్తపల్లవి అందుకున్నారు. ఓటర్లు అందరి వద్ద డబ్బులు తీసుకోండని.. అయితే, ఓటు మాత్రం వైఎస్సార్ సీపీకి వేయరాదని హుకుం జారీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వేయడం ఇష్టంలేని వారు టీడీపీకైనా ఓటేయాలని.. వినూత్న ప్రచారానికి దిగుతున్నారు. కుమ్మక్కు రాజకీయాల్ని బాహాటంగానే నడుపుతున్న అధికార నేతల అండగా, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలు కూడా పేదల కాలనీలపై ప్రతాపం చూపుతున్నారు. దొనకొండ మండలంలోని ఎస్సీ కాలనీలకు చెందిన కొందరు టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు రెండ్రోజుల కిందట రాత్రి సమయంలో వె ళ్లారు. అక్కడున్న వారికి లిక్కర్ సీసాలు పంపిణీ చేశారు.
మహిళలను పిలిపించి డబ్బులు పంపిణీ చేస్తామని చెప్పి పడిగాపులు పడేలా చేశారు. ఇదేరకమైన వైనం మార్కాపురం మండలంలో చోటుచేసుకుంది. మద్యం తాగిన మత్తులో తెలుగుతమ్ముళ్లు కొందరు ద్విచక్రవాహనాలపై ఆయాగ్రామాల వీధుల్లో చక్కర్లు కొట్టి.. పెద్దగా కేకలేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించినట్లు స్థానికులు చెబుతున్నారు. కందుకూరులో కొందరు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చినందుకు వారిపై పోలీసు కేసులు నమోదు చేయిస్తామని కాంగ్రెస్ నేత బెదిరిస్తున్నట్లు వదంతులు పుట్టించారు. దీంతో బీసీలు, ఎస్సీలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అదనంగా వచ్చిన పోలీసు బలగాలు అన్ని నియోజకవర్గాల్లోని శివారు మండలాల్లోని పేదలకాలనీలపై ప్రత్యేకంగా దృష్టిసారించి, రక్షణ కల్పించాలని కోరుతున్నారు.