‘‘ఏరా మహేశ్....ఆదివారం ఓట్లుండాయి కదా...మీ వీధిలో లెక్క ఎంత పంచుతాండారు..!’
‘ఏమో...అల్తాఫ్...డబ్బులు మేము తీసుకోవడం లేదు. మేం ఎవ్వరికి ఓట్లెయ్యాలో డిసైడైనాం.!
‘ఎవ్వరికేస్తున్నావోయ్...కొత్తపార్టీకా...పాతపార్టీకా...!’
‘కొత్తలేదు...పాత లేదు..మామ...మాకు ఎవరు మంచి చేసినారో...మేము వాళ్లకే ఓట్లేస్తాం...కొట్టినోన్ని పెట్టినోన్ని మర్సిపోకూడదు కదా...ఈ ఎలచ్చన్లలో అందరూ అట్టనే ఉండారు.’
‘ఇంతకి ఎవ్వరు కొట్టినారు...ఎవ్వరు పెట్టినారోయ్..!’
‘ఏం నీకు తెల్దు. మనం కాలేజీకి పోయేటప్పుడు మీ అవ్వకు పింఛన్ కోసం పోతే...మీ వార్డులో 22 మందికి 75 రూపాయలు వచ్చాంది. వాళ్లలో ఎవరైనా సచ్చిపోతే అప్పుడు రాండి అని అధికార్లు సెప్సినారు. మతికి లేదా?’
‘కరెక్టే మామ..సచ్చిపోయినాక కూడా ఇవ్వలే! చంద్రబాబు హయాంలో ...2001లో అనుకుంటా...బుగ్గవంకకు వరదొచ్చి...ఇండ్లన్నీ మునిగిపోయినాయి...సుమారుగా 30మందిదాకా సచ్చిపోయినారు...కడపలో ఇంత కంటే మరొక ఘోరం ఏం లేదనుకో...ఇండ్లంటే మునిగినాయి...కనీసం మనుషుల ప్రాణాలు కూడా కాపాడలేకపోయినారే! నాకు బాగా గుర్తుంది. ఒక చిన్నపిల్ల...నాలుగేళ్లు ఉంటాయి...వాళ్ల అమ్మ...నాన్న ఇద్దరూ కొట్టుకుపోయినారు..ఆ పాపకు ఎవ్వరు లేరు. ఒక్కటీ అమ్మా..నాన్న అని ఏడుస్తాంటే గుండె భగ్గుమనింది మామ....చివరకు ఆ పాప వాళ్ల అవ్వ కనీసం నాకు పింఛన్ అయినా ఇయ్యండయ్యా అని ఎంత మొత్తుకోని ఏడ్సినా ఎవరూ పట్టించుకోల్యా!
‘అవునుమామ వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 ఇచ్చినారు. మన వార్డులో ఎంతమంది ముసలోళ్లు ఉండారో....అందరికీ 200 పింఛన్ ఇచ్చినారు...అదిగుడక ఒకటో తేదీ జీతం మాదిరి!’
‘ పింఛనే కాదురా...బుగ్గవంకకు మళ్లీ వరద రాకుండా మొత్తం రక్షణ గోడ కట్టినారు..’ ఇంక ఎంత వరదొచ్చినా నీళ్లు రావు.’
‘ఇంతకు పెద్దాయప్ప సీఎం అయిన తర్వాత కడప కు శానా మేలు చేసినాడు మామ..కడపను కార్పొరేషన్ సేసినాడు. రిమ్స్ కట్టిచ్చినాడు...యూనివర్శిటీ...రోడ్లు వెడల్పు చేయడం...బుగ్గవంకపైన ఫ్లైఓవర్ బ్రిడ్జిలు..ఒక్కటేంటి శానా చేసినాడు.’
‘కడపకే కాదురా...జిల్లా అంతా బాగా సేసినారు. రాయచోటి, బద్వేలు, రాజంపేట, జమ్మలమడుగు, పులివెందుల ఒక్కటేసారి ఐదు మునిసిపాలిటీలు సేసినాడు. అప్పట్లో రాజీవ్ నగరబాట’ అని వచ్చి...ఏసమస్యలు అధికారులు సెప్పినారో...అన్నిటికి డబ్బులు ఇచ్చినాడు.’
‘ కరెక్టే ప్రొద్దుటూరు వెటర్నరీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ కట్టిచ్చినాడు...తాగునీటి సమస్య తీర్చేందుకు కుందు-పెన్నా వరద కాలువకు డబ్బులు ఇచ్చినాడు.’
‘ఇంతకీ అది పూర్తి అయిందా...కాలేదా..?’
‘కాలేదు... ఆ ఇద్దరు నాయకులు ఒకర్నిమించి ఒకరు దాన్ని అడ్డుకున్య్నారు. ఇప్పుడు ఇద్దరు టీడీపీలో సేరినారు. వాళ్లిద్దరి వల్లనే ఆ నీళ్లు పెన్నాలోకి రాలే! ఈ విషయం పొద్దుటూరోళ్లందరికీ తెలుసు. అయినా 25 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉండి నీళ్ల సమస్య కూడా తీర్చకపోవడం ఏంటి మామ..దేనికి ఓట్లేసేది పన్లాకనా!’
‘కరెక్టేరా..!పక్కనే జమ్మలమడుగు ఎమ్మెల్యే సూ డు మైలవరం నుంచి వాటర్ స్కీం తీసుకొచ్చినాడు.!
‘అదొక్కటే కాదు మామ..ఆస్పత్రికి 2004 నుంచి ఇప్పటి దాకా ప్రతీ నెల 30వేల మందులకు డబ్బులు ఇచ్చాండాడు. ఆయప్ప పుణ్యాన రోగులంతా సంతోషంగా ఉండారు. పైగా అక్కడ ప్రతీ వీధిలో సిమెంట్‌రోడ్లు ఉంటాయి...మొత్తానికి ఆయప్ప బాగా సేసుకున్యాడు.
‘పులివెందుల పరిస్థితి ఏంటి?
‘దాని కథ సెప్పాలేంవోయ్...ఒక్కసారి పోయి సూడుపో...ఎట్టుందో!’
‘మొత్తానికి పెద్దాయప్ప వల్ల అందరూ లబ్ది పొందినారు మామ.’
‘అందరూ అంటే...’
‘అందరూ అంటే అందరూ గ్యాస్ సబ్సిడీ 50 రూపాయలు వైఎస్సే భరించినాడు. దీంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగింది. చివరకు చంద్రబాబు నాయుడు ఇంట్లో గ్యాస్‌కు కూడా వైఎస్ ప్రభుత్వం 50 రూపాయలు సబ్సిడీ భరించింది.’
‘కరెక్ట్‌మామ...ఆయప్ప ఇచ్చిన ఫీజురీయింబర్స్‌మెంట్ వల్ల మా తమ్ముడు సదువుకున్న్యాడు. ఆరోగ్యశ్రీ వల్ల మీ తాత ఆపరేషన్ చేయించుకున్నాడు.’
‘నీకు ఒకమాట సెప్పమంటావా...మా తాత...హెడ్మాస్టర్‌గా రిటైరైనప్పుడు 5వేలు జీతం తీసుకోలేదంటా. ఇప్పుడు పింఛనే 15వేలు పైన వస్తాంది...ఇదంతా వైఎస్ పెంచాడని మాతాత సెబుతాంటాడు.’
‘మరి ఇట్టాంటోళ్లంతా వైఎస్ కుటుంబాన్ని మర్సిపోకూడదు మామ...ఎందుకంటే కొట్టినోన్ని...పెట్టినోన్ని మర్సిపోకూడదు కదా..!’
‘సరే...మామ...మనకు ఎవ్వరు మేలు చేసినారో...సేచ్చారో వాళ్లకే ఓట్లేద్దాం..పద ఓట్లకు టైం అయితాంది....’
‘సరే...ఉండు ఇంట్లో మా అవ్వపడుకోని ఉంది..‘ఫ్యాన్’ స్విచ్ వేసొస్తా..!!
- సాక్షి, కడప
కొట్టినోన్ని..పెట్టినోన్ని మర్సిపోకూడదు..!
Published Sun, Mar 30 2014 4:03 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement