అప్పడాల కర్ర... బొప్పికట్టిన బుర్ర
పంజాబ్ ఎన్నికల్లో ఈ సారి ప్రత్యేక భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. అయితే వారు పోలీసులు కారు. ప్రభుత్వంతో వారికి సంబంధం లేదు. వారంతా బేలన్ బ్రిగేడ్ సభ్యులు. ఇప్పుడీ బేలన్ బ్రిగేడ్ మెంబర్లు పంజాబ్ ఎన్నికల్లో మద్యం, మాదకద్రవ్యాల ప్రభావాన్ని తగ్గించేందుకు కంకణం కట్టుకున్నారు.
బేలన్ అంటే అప్పడాల కర్ర. అప్పడాల కర్రే ఆయుధంగా వీరు కదిలి ముందుకొస్తున్నారు. పోలీసులు లాఠీ వాడటానికి ఒకటికి రెండు సార్లు అలోచిస్తారేమో కానీ, ఈ బేలన్ బ్రిగేడ్ మాత్రం తమ అప్పడాలకర్రను ఇట్టే ఝళిపిస్తారు. మరో మాట మాట్లాడితే బాది పారేస్తారు.
ఈ బేలన్ బ్రిగేడ్ ను లూఢియానాకి చెందిన 42 ఏళ్ల అనితా శర్మ ప్రారంభించారు. ఇప్పుడది పంజాబ్ అంతా విస్తరించింది. ఓటర్లను మభ్యపెట్టేందుకు అభ్యర్థులు, పార్టీలు మద్యాన్ని లేదా మాదక ద్రవ్యాలను ఇచ్చారని తెలిస్తే చాలు అప్పడాల కర్రలు బయలుదేరతాయి. ఆ తరువాత బొప్పికట్టిన బుర్రలు మిగులుతాయి.
మామాలుగానే పంజాబ్ లో 70 శాతం జనాభా మత్తుపదార్థాలను వాడుతుంది. ఎన్నికల సమయంలో ఈ వాడకం మరింత పెరుగుతుంది. ఈ సారి ఎన్నికల్లో అభ్యర్థులు వోటర్లకు స్లిప్పులు ఇస్తున్నారు. వాటిని లిక్కర్ దుకాణాల్లో చూపిస్తే వారికి లిక్కర్ ఇవ్వడం జరుగుతుంది.
అయితే ఎన్నికల తరువాత ఈ అప్పడాల కర్ర ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశంపై బేలన్ బ్రిగేడ్ ఆలోచిస్తోంది. అన్నట్లు ఈ బ్రిగేడ్ లో అంతా ఆదిపరాశక్తులే కాదు. అపర శంకరయ్యలూ ఉంటారు. వారి చేతుల్లో మాత్రం అప్పడాల కర్ర ఉండదు. వారు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచి, ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తారు.