'అద్భుతమైన రాష్ట్రాన్ని ఆగం చేశారు'
అమృత్ సర్: డ్రగ్స్ బానిసలు కావచ్చు.. అక్రమ రవాణాదారులు కావచ్చు.. ఏదో ఒకవిధంగా పంజాబ్ లో మాదకద్రవ్యాల ప్రభావం పడని కుటుంబం లేదని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అన్ని రకాలుగా అద్భుతమైన రాష్ట్రాన్ని అధికార అకాలీదల్- బీజేపీలు ఆగం చేశాయని, పంజాబ్ ను డ్రగ్స్ హబ్ గా మార్చేశాయని విమర్శించారు. తనపై దాఖలైన పరువునష్టం కేసులో విచారణ ఎదుర్కొనేందుకు అమృత్ సర్ వచ్చిన కేజ్రీవాల్ కోర్టులో బెయిల్ మంజూరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అకాలీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు.
'పంజాబ్ లోని ప్రతి ఇల్లు డ్రగ్స్ సమస్యను ఎదుర్కొంటోంది. ఎవరైనా దీనిని ఎదిరిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి నోరుమూయిస్తున్నది' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ అక్రమ సరఫరా ముఠాతో పంజాబ్ రెవెన్యూ మంత్రి బిక్రమ్ జిత్ సింగ్ కు సంబంధాలున్నాయంటూ కేజ్రీవాల్, పంజాబ్ ఆప్ నేత సంజయ్ సింగ్ గతంలో చేసిన ఆరోపణలపై పరువునష్టం కేసు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం తన ముందు హాజరైన కేజ్రీవాల్, సంజయ్ లకు కోర్టు బెయిల్ మంజూరు చేసి, విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.
ఆరు నెలల్లోగా అరెస్టు చేయండి, లేదా..
రెవెన్యూ మంత్రి బిక్రమ్ జిత్ సింగ్ ముమ్మాటికీ డ్రగ్స్ సరఫరాదారుడేనన్న వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటానని, అక్రమ కేసులకు బెదరనని కేజ్రీవాల్ అన్నారు. 'బిక్రమ్ సింగ్.. మీరు మరో ఆరు నెలలు అధికారంలో ఉంటారు. ఈలోగా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయడండి. లేదంటారా.. ఎన్నికలు అయిపోయిన ఆరు నెలల్లోగా అరెస్టుకు సిద్ధంగా ఉండండి'అని పంజాబ్ రెవెన్యూ మంత్రిని ఉద్దేశించి హెచ్చరించారు. 2017లో జరగనున్న ఎన్నికల్లో అకాలీదళ్- బీజేపీ కూటమికి ఓటమి తప్పదని, ఆప్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారిని అరికట్టి కొత్త పంజాబ్(నయా పంజాబ్)ను సృష్టిస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాగా, విచారణ సందర్భంగా కోర్టు వద్దకు ఆప్, అకాలీదళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వారిని అదుపుచేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.