పంజాబ్‌లో అవసానదశలో పడిన అకాలీదళ్‌కు కాయకల్ప చికిత్స చేసి రక్షించటానికి చేసిన ప్రయత్నం కాస్తా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రాణానికి ముప్పు తెచ్చింది. బుధవారం ఆయనపై కాల్పులు జరపబోయిన ఖలిస్తానీ మిలిటెంట్ నారాయణ్ సింగ్ చౌరాను అక్కడున్నవారు సకాలంలో నిరోధించకపోయివుంటే పంజాబ్‌లో మరో నెత్తుటి అధ్యాయం మొదలయ్యేది.
గత తప్పిదాలకు బాదల్‌నూ, ఇతర నేతలనూ సిక్కు అత్యున్నత పీఠం అకల్‌తఖ్త్ మతద్రోహులుగా ప్రకటించి విధించిన శిక్షలు అమలవుతుండగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. పంజాబ్ స్థితిగతులు ప్రత్యేకమైనవి. మతమూ, రాజకీయాలూ కలగలిసి పోవటాన్ని వ్యతిరేకించేవారు సైతం ఈ ప్రత్యేకతను గమనించబట్టే అక్కడ అకాలీదళ్ వంటి మధ్యేవాద పక్షం అవసరమని భావిస్తారు.
లేనట్టయితే మతాన్ని తలకెక్కించుకున్న అతివాదులది అక్కడ పైచేయి అవుతుందని వారి వాదన. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అకాలీదళ్‌ను బలహీనపరచటానికి భింద్రన్‌వాలే వంటి మిలిటెంట్లకు మొదట్లో అందించిన పరోక్ష ప్రోత్సాహం పంజాబ్‌కు శాపంగా మారింది. పరిస్థితి చేయిదాటాక అమృత్‌సర్ స్వర్ణాలయంలో తలదాచుకున్న భింద్రన్‌వాలేను, అతని ముఠాను అదుపు చేయటానికి సైన్యంతో నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కాస్తా వికటించి చివరకు ఇందిర ప్రాణాలనే బలితీసుకుంది.
ఆ హత్యకు ప్రతీకారమన్నట్టు ఢిల్లీతోసహా దేశంలో అనేకచోట్ల కాంగ్రెస్ నేతలు వెనకుండి సిక్కులపై సాగించిన హత్యాకాండ పర్యవసానంగా ఉగ్రవాద గ్రూపులు పుట్టుకొచ్చాయి. దశాబ్దంపాటు పంజాబ్ కనీవినీ ఎరుగని కల్లోలం చవిచూసింది. వేలాదిమంది అమాయక పౌరులు ఆహుతయ్యారు. ఉగ్రవాదాన్ని అదుపుచేయటం కోసమంటూ భద్రతా బలగాలు సాగించిన ఎన్‌కౌంటర్లు, అపహరణలు, అదృశ్యాలు సరేసరి. మన దేశంలో నామరూపాల్లేకుండా పోయిన ఆ ఉద్యమం ప్రస్తుతం కెనడాలో సాగిస్తున్న కార్యకలాపాల పర్యవసానమేమిటో కనబడుతూనే వుంది.
అయిదుగురు సిక్కు మత పూజారుల అత్యున్నత పీఠం అకల్‌తఖ్త్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ను స్వర్ణాలయ ప్రధానద్వారం వద్ద సాధారణ సేవాదార్‌గా పనిచేయాలని తీర్మానించింది. ఆయన తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని తెలిపే పలకను మెడలో ధరించారు. ఇతర అకాలీ నేతలకు స్వర్ణాలయంలో అంట్లు తోమటం నుంచి మరుగుదొడ్లు శుభ్రం చేయటం వరకూ వేర్వేరు శిక్షలు విధించింది.
ఈ శిక్షలకు 2007–17 మధ్య పంజాబ్‌లో ఆ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిన కూటమి సర్కారులోని భాగస్వామ్య పక్షమైన బీజేపీ అత్యుత్సాహం కారణం. పంథ్ కోసం ప్రాణత్యాగాలు చేసిన వ్యక్తులను విస్మరించి, సిక్కులను అనేకవిధాల హింసించి చంపిన రిటైర్డ్ పోలీసు అధికారుల కుటుంబ సభ్యులకు పదవులు పంచిపెట్టడం అకాలీదళ్ నేతలు చేసిన ‘ప్రధాన నేరం’.
వీరిలో చాలామంది బీజేపీవారు కాగా, అకాలీ తరఫున ఎంపికైనవారు కూడా ఉన్నారు. అలాగే మతాన్ని అపవిత్రం చేసిన దేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీంపై ఉన్న కేసుల్ని ఆయన కోరకుండానే రద్దుచేయటం, దాన్ని సమర్థించుకోవటానికి తమకు అనుకూలంగా ప్రకటన ఇవ్వాల్సిందిగా జతేదార్లను పిలిపించి ఒత్తిడి చేయటం వంటివి ఇతర ఆరోపణలు.
అధికారంలో ఉండగా చేసిన పనులకు అకాలీదళ్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. 1920లో ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రైతాంగం దూరమైంది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. దానికితోడు సాగు సంక్షోభం, ఉపాధి లేమివంటì సమస్యలు మధ్యతరగతిని, ఇతర వర్గాలవారినీ అసంతృప్తిలో ముంచెత్తాయి. అందుకే అకాలీలను వరస ఓటములు వెంటాడాయి.
పర్యవసానంగా అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రంగప్రవేశం అకాలీని నిలువునా ముంచింది. ఆ పార్టీ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో అభ్యర్థుల్ని కూడా నిలబెట్టలేకపోయింది. తన భాగస్వామ్య పక్షాన్ని బలహీనపరిచి ఎదగాలని చూసే బీజేపీ ఎత్తుగడలు ఆ రాష్ట్రంలో ఫలించలేదు. అందుకే అకాలీ నేతల ‘తప్పుల’కు తగిన శిక్ష విధించి, వారికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశమీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖడ్ గత నెలలో అకల్‌తఖ్త్‌కు విజ్ఞప్తి చేశారు.
అయితే ఉగ్రవాదం విస్తరిస్తుందన్న సాకుతో రాజకీయాల్లో మత సంస్థల ప్రాబల్యం పెంచటం ఎంతవరకూ సబబన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఆప్ ఆగమనం, అది అధికార పీఠాన్ని కైవసం చేసుకోవటం విశ్లేషిస్తే మత రాజకీయాల ప్రాబల్యం బలహీన పడిందన్న అభిప్రాయం కలుగుతుంది. అకాలీదళ్ 1977 తర్వాత బాదల్ కుటుంబ ప్రాబల్యంలోకొచ్చాక రాష్ట్రంలో సిక్కు–నిరంకారీ ఘర్షణలు పెరిగాయి.
అటూ ఇటూ పదులకొద్దీ మంది మరణించారు. ఇందిర పుణ్యమా అని ఉగ్రవాదం విస్తరించింది. ఈ అయోమయ పరిస్థితుల్లో 1996లో బీజేపీతో కలిసి ప్రయాణించటానికి నిర్ణయించుకుని మోగాలో జరిగిన పార్టీ సమావేశాల్లో సిక్కు మత మూలాలున్న అకాలీదళ్‌ను సెక్యులర్ పార్టీగా మారుస్తూ తీర్మానించటం పంథ్ అనుకూల ఓటర్లను క్రమేపీ పార్టీకి దూరం చేసింది.
బీజేపీ ఆ పని చేయకపోవటాన్ని అందరూ వేలెత్తి చూపారు. అకాలీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ జోషి పార్టీ తిరిగి పంథ్ అనుకూల వైఖరి తీసుకుని శిక్షలకు తలొగ్గటాన్ని నిరసిస్తూ అకాలీదళ్‌కు రాజీనామా చేశారు. ఈ అంతర్మథనం బాదల్‌పై జరిగిన తాజా దాడితో ఏయే మలుపులు తీసుకుంటుందో, అకాలీదళ్ ప్రస్థానం ఎలా కొనసాగుతుందో మున్ముందు చూడాలి.
అకాలీల ప్రస్థానం ఎటువైపు?
Published Thu, Dec 5 2024 4:09 AM | Last Updated on Thu, Dec 5 2024 4:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment