నేడు రెండో విడత ‘స్థానిక’ సమరం
పూర్తికానున్న ఎన్నికలు
29 జెడ్పీటీసీ స్థానాలకు 153 మంది,
470 ఎంపీటీసీ స్థానాలకు 1779 మంది బరిలో
ఎన్నికల విధులకు 8227 మంది సిబ్బంది
317 సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలు శుక్రవారం జరుగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ విడతలో మొత్తం 8,227 సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. దీంతో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగియనున్నాయి. ఈ నెల 6వతేదీన మొదటి విడత ముగిసింది.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సిబ్బంది లాంటి సౌకర్యాలను అధికారులు గురువారం రాత్రి సమకూర్చారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గురు పోలింగ్ క్లర్క్స్ ఉంటారు.
1932 మంది బరిలో...
రెండో విడతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మొత్తం 1932 మంది బరిలో ఉన్నారు. ఇందులో 29 జెడ్పీటీసీ స్థానాలకు 153 మంది, 470 ఎంపీటీసీ స్థానాలకు 1779 మంది బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈనెల 11వ తేదిన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
11,31,903 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు...
రెండో విడతలో 11,31,903 మంది తమ ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. ఇందులో 5,64,080 పురుష ఓటర్లు, 5,67,750 మహిళ ఓటర్లు, 73 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.
పోలింగ్ కేంద్రాల ఎంపిక...
రెండు విడుతలకు మొత్తం 1577 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మొత్తం 173 కేంద్రాల్లో 1577 పీఎస్‌లు ఉంటాయి. జిల్లాలో తొలి, మలి విడతలకు కలిపి 3,020 పీఎస్‌లను ఉన్నాయి. ఇందులో 1577 ప్రిసైడింగ్ ఆఫీసర్లకు తోడుగా ప్రతీ మండలానికి అవసరాన్ని బట్టి 5, 6 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లను అదనంగా నియమించారు. రెండో విడతకు 1577 మంది పీఓలు, 1577 మంది ఏపీఓలు, 4,725 మందిని పోలింగ్ క్లర్క్స్ ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.
కేంద్రాలు ఎంపిక...
ఈ విడతలో మొత్తం 29 మండలాల్లో జరుగుతాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట్ డివిజన్లలో ఎన్నికలు జరుగనున్నాయి. మహబూబ్‌నగర్ డివిజన్‌లోని మండలాలు అడ్డాకుల, ఫరూక్‌నగర్, బాల్‌నగర్, భూత్పూర్, హన్వాడ, జడ్చర్ల, నారాయణపేట మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్‌కాలేజీలో భద్ర పరుస్తారు. కోయిల్‌కొండ, కొందుర్గు, కొత్తూరు, మహబూబ్‌నగర్ మండలాలకు చెందిన బాక్సులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌కాలేజీలో, మిడ్జిల్ మండలానికి చెందిన బాక్సులను సీబీఎం కాలేజి కల్వకుర్తిలో భద్ర పరుస్తారు. నారాయణపేట డివిజన్‌లోని మండలాలు ఆత్మకూరు, బొంరాస్‌పేట్, సీసికుంట, దామరగిద్ద, దేవరకద్ర, ధన్వాడ, దౌల్తాబాద్, కోయిలకొండ,కోసిగి. మద్దూర్, మాగనూర్, మక్తల్, నారాయణపేట, నర్వ, ఊట్కూర్ మండలాల కు చెందిన పెట్టెలను శ్రీదత్త బీఈడీ కాలేజీ నారాయణపేట్‌లో, కొత్తకోటకు చెందిన బాక్సులు వనపర్తి కేడీఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో భద్ర పరుస్తారు.
సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు...
ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికలకు ఆటకం కల్గించే గ్రామాలను ఇప్పటికే గుర్తించారు. ఇలా గుర్తించిన లిస్టును పోలీస్ శాఖకు అందజేశారు. సమస్యాత్మ గ్రామాలతో పాటు పోలింగ్ స్టేషన్లను కూడా గుర్తించారు.జిల్లాలో మొత్తం 317 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఇందులో 217 సమస్యాత్మక గ్రామాల్లో 217 మంది మైక్రో అబ్జర్వర్లు నిరంతం పర్యవేక్షించనున్నారు. వంద పీఎస్‌లలో వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతరం ఇంజనీరింగ్ విద్యార్థులు పర్యవేక్షిస్తారు. రెండో విడుత జరిగే ఎన్నికలల్లో దామరగిద్ద, కేశంపేట మండలాల్లో అత్యధికంగా 20 గ్రామాలను గుర్తించారు. తర్వాత నవాబ్‌పేట్ మండలంలో 18 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. అత్యల్పంగా దౌలతబాద్‌లో 3 గ్రామాలను గుర్తించారు.
బ్యాలెట్ బాక్సులు రెడీ...
ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుండడంతో బ్యాలెట్ బ్యాక్స్‌ల అవసరం పడింది. గత సంవత్సరం సర్పంచ్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించారు. 1577 పీఎస్‌లకు గాను 3154 బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే సరఫరా చేశారు. వీటికి అదనంగా మరో 10 శాతం బాక్సులను అందుబాటులో ఉంచారు.
తాయిలాలతో అభ్యర్థులు...
ఓటింగ్ కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠత నెలకొంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవటానికి అభ్యర్థులు రంగంలోనికి దిగారు. మద్యం బాటిళ్లు, డబ్బు సంచులతో మోహరించారని సమాచారం. ఇప్పటికే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా కుల దేవతల ఆలయాల నిర్మాణాలు, శశ్మాన వాటికలు ఏర్పాటు వంటిపై పలు గ్రామాల్లో ఓటర్లుకు హామీలు ఇవ్వడంతోపాటు ఆయ్యే తాయిలాలు లెక్కించి అడ్వాన్సులు ముట్టచెప్పినట్లు ప్రచారంలో ఉంది. ఓటుకు రూ. 300 వందల నుంచి రూ.అయిదు వందల వరకు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
పోలింగుకు రెడీ
Published Fri, Apr 11 2014 5:45 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement