ఏకమవుతున్న తస్మదీయులు
సాక్షి, ఏలూరు :
రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా అధికార, ప్రధాన ప్రతిపక్షాలు కలసి ఎన్నికల వేళ ప్రజలను మరోసారి వంచి స్తున్నారుు. రాష్ట్రాన్ని నిరభ్యంతరంగా ముక్కలు చేసేసుకోవచ్చం టూ తెలుగుదేశం పార్టీ లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అంగీకార పత్రం రాసిస్తే.. ఆఖరి బంతి మిగిలే ఉందంటూ చివరి వరకూ నమ్మబలికి జనానికి మొండిచేయి చూపించారు కాంగ్రెస్ నేతలు.
ఇప్పుడు ఆ రెండు పార్టీల నాయకులు ఓట్ల కోసం ఏకమవుతున్నారు. ఏమార్చడానికి మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారు. జిల్లాలో సహకార ఎన్నికల నుంచీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు రాజకీయం కొనసాగుతోంది. వ్యవసాయం దండగ అని, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై దుస్తులు ఆరేసుకోవాలని ఎద్దేవా చేసిన టీడీపీతో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. తమకు అనుకూలంగా లేని రైతుల ఓట్లను గల్లంతు చేసింది. అదే పొత్తు పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగింది.
గెలవడం కోసం ఎంతటికైనా తెగించే ఆ రెండు పార్టీలు తమ అభ్యర్థులకు మేలు చేసేందుకు అధికార దుర్వినియోగానికి కూడా వెనకాడలేదు. మునిసిపాలిటీల్లో పనులు మంజూరు చేయడం దానిలో భాగంగా జరిగిందే. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలచేశారు.
తద్వారా గ్రామీణ నిరుద్యోగులకు గాలమేశారు. తాజాగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుండగా పాత మిత్రులకు ప్రలోభాలు ఎరవేసి టీడీపీ తనవైపు లాక్కొంటోంది. ఇన్నాళ్లూ చీకటి ఒప్పందాలు చేసుకుని తెరవెనుక మద్దతు తెలిపిన వారిని ప్రత్యక్షంగా తమ పార్టీలో చేర్చుకుంటోంది. తద్వారా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది.
ఇందుకోసం సామాజిక అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. టీడీపీ మినహా మరే ఇతర పార్టీ అధికారంలోకి వచ్చినా ఓ సామాజిక వర్గానికి నష్టం వాటిల్లుతుందనే భయాన్ని సృష్టిస్తోంది. ఇన్నాళ్లూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న నేతలు ఇప్పుడు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టి తామంతా ఒక్కటేనని బహిర్గతం చేస్తున్నారు. పదవే ముఖ్యమని చాటుతున్నారు.