Mandal Parishad elections
-
నేడు పరిషత్ ఎన్నికల షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. శనివారం ఎన్నికల షెడ్యూల్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా ఏర్పడిన 4 మండలాల్లోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ల ఖరారుపై ఆయా జిల్లాల కలెక్టర్లు శుక్రవారం గెజిట్లు విడుదల చేశారు. శుక్రవారం సెలవు దినం కావడంతో షెడ్యూల్ జారీ చేయలేదు. దీంతో శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జెడ్పీపీ, ఎంపీపీ స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల ఖరారైన విషయం తెలిసిందే. కాగా, ఈ నెల 22 నుంచి మే 14లోగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగించేలా ముసాయిదా షెడ్యూల్‌ను ఎస్ఈసీ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. మూడు విడతల్లో పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. 26 జిల్లాల్లో మూడు విడతల్లో, ఐదు జిల్లాల్లో 2 దశల్లో, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 4 మండలాల్లో రిజర్వేషన్లు ఇలా.. కొత్తగా ఏర్పడిన నాలుగు మండలాల్లో ఎంపీపీ అధ్యక్ష స్థానాలు, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ రిజర్వేషన్లు.. నిజామాబాద్ జిల్లాలోని చండూరు (ఎస్టీ), మోసర (జనరల్), సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట (జనరల్), మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి (జనరల్) కేటగిరీలకు రిజర్వ్ అయ్యాయి. ఎంపీపీ స్థానం రిజర్వేషన్లు.. నిజామాబాద్ జిల్లాలోని చండూరు ఎంపీపీ ఎస్టీలకు, మోసర ఎంపీపీ జనరల్‌కు, సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట ఎంపీపీ జనరల్‌కు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి ఎంపీపీ బీసీ కేటగిరీలకు రిజర్వ్ అయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్లు ఈ నెల 22, 26, 30 తేదీల్లో విడుదల కానున్నాయి. తొలి విడత ఎన్నికలు మే 6, రెండో విడత 10, తుది విడత ఎన్నికలు 14న జరగనున్నాయి. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పరిషత్ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకు జెడ్పీపీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎంపిక ఉంటుంది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీపీ చైర్పర్సన్, ఎంపీపీ అధ్యక్ష స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో అధికారులు పొందుపరిచారు. -
జెడ్పీ చైర్మన్లు... ముందే ఖరారు
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యమే లక్ష్యంగా కసరత్తు చేస్తున్న టీఆర్ఎస్.. జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థులపైనా ముందే స్పష్టత ఇస్తోంది. టీఆర్ఎస్లో సీనియర్లకు పదవుల పంపకంపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ జిల్లా పరిషత్ చైర్మన్లుగా పలువురు ముఖ్య నేతలకు అవకాశం ఇవ్వా లని నిర్ణయించారు. పలు కారణాలతో ఇప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు రాని వారికి, పోటీ చేసి ఓడిన వారిలో కొందరికి జిల్లా పరిషత్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చేందుకు టీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు. ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన జిల్లాల విషయంలోనూ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే వీలైనన్ని ఎక్కువ జెడ్పీలకు చైర్మన్ అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారు. అన్ని జిల్లా పరిషత్‌లు, అత్యధిక ఎంపీపీల్లో గెలుపే లక్ష్యం గా కేసీఆర్ ఇప్పటికే వ్యూహం సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా గెలుపు వ్యూహంపై మంత్రులు, ముఖ్యనేతలతో చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లు, అశావహుల వివరాలను సేకరిస్తున్నారు. శుక్రవారం పలువురు మంత్రులు, ముఖ్యనేతలతో చర్చించారు. ఆశావహులతోపాటు ముఖ్యనేతల పేర్ల ను పరిశీలించి ప్రతి జెడ్పీకి ఇద్దరు చొప్పున నేతలతో సీఎం జాబితా రూపొందిస్తున్నారు. చివరికి ఒక్కరి పేరును ఖరారు చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారు, ప్రస్తుత జెడ్పీ చైర్పర్సన్లు, కార్పొరేషన్ చైర్మన్లకు.. జెడ్పీ పద వులను కేటాయిస్తున్నారు. ఇలా ఎంపిక చేసిన వారికి సీఎం స్వయంగా ఫోన్లు చేసి చెబుతున్నారు. జిల్లా పరిషత్గా అవకాశం ఇస్తున్నామని, సమన్వయంతో పని చేసుకోవాలని సూచిస్తున్నారు. ►ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీకి అవకాశం ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 15న జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. కోవా లక్ష్మీ 2014లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 171 ఓట్ల తేడాతో ఓడిపో యారు. ఆసిఫాబాద్‌లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇటీవల టీఆర్ఎస్లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. దీంతో లక్ష్మీకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవితో అవకాశం కల్పించాలని కేసీఆర్ నిర్ణయించారు. ►పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్‌గా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు అవకాశం ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మంత్రి ఈటల రాజేందర్‌తో సమన్వయం చేసుకుని చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం చేసుకోవాలని సూచించారు. పుట్టా మధు 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉండే మంథని సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. అధికారికంగా టీఆర్ఎస్ ప్రాతినిథ్యం ఈ సెగ్మెంట్లో కీలకమైన నేపథ్యంలో మధుకు జెడ్పీ చైర్మన్‌గా అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఇల్లెందు మాజీ ఎమ్మెలే కోరం కనకయ్య, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక మాజీ ఎమ్మెల్యే పి.వెంకటేశ్వర్లు ఆశిస్తున్న ట్లు తెలిసింది. అధిష్టానం ఈ పేర్లను పరిశీలిస్తోంది. ►ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్పర్సన్ తుల ఉమకు ఈసారి జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్‌గా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు చెబు తున్నాయి. ఉమ సొంత మండలం జెడ్పీటీసీ స్థానం, జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ పదవి రిజర్వేషన్లు ఆమెకు అనుకూలంగా ఉన్నాయి. టీఆర్ఎస్ అధిష్టానం ఉమకు మరోసారి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. ►ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్‌కు రెండోసారి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న పట్నం సునీతామహేందర్‌రెడ్డిని మరోసారి ఇదే పదవి వరించే అవకాశం ఉంది. సునీతకు ఈసారి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ పదవి సైతం ఈసారి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే సిహెచ్.ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యు లు, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనిత పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. ►నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా బండ నరేందర్‌రెడ్డికి అవకాశం ఇస్తున్నట్లు కేసీఆర్ శుక్రవారం ఆయనకు చెప్పినట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో బండ నరేందర్‌రెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా మరో నేత తిప్పన విజయసింహారెడ్డి పేరును సైతం పరిశీలిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ►ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం సీఎం సీనియర్ల పేర్లను పరిశీలిస్తున్నారు. సత్తుపల్లి అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ టికెట్ ఆశించి అధిష్టానం హామీతో పోటీకి దూరంగా ఉన్న మట్టా దయానంద్‌కు చైర్మన్ పదవి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి పోటీ చేసి ఓడిన లింగాల కమల్‌రాజ్ పేరు సైతం పరిశీలనలో ఉంది. -
లోకల్ అలయెన్స్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్థానిక ఎన్నికల్లో కొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. ఉప్పునిప్పులా ఉంటున్న పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి. రాష్ట్రస్థాయిలో పొత్తులు ఉంటాయో... లేదో... ఇంకా స్పష్టత రాలేదు. కానీ... స్థానిక సమరంలో ఇప్పటికే కలిసి నడుస్తున్నాయి. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఆవిష్కృతమయ్యాయి. రాష్ట్ర స్థాయిలో రోజూ తిట్టుకుంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్లు జిల్లాలోని జెడ్పీటీసీ ఎన్నికల్లో కలిసి నడుస్తున్నాయి. సీట్ల పంపకం విషయంలో పేచీ వచ్చిందంటూ.... ఒకరోజు దూరంగా, మరొక రోజు దగ్గరగా ఉంటున్న టీడీపీ, బీజేపీలు కొన్ని మండలాల్లో కలిసిపోయాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు లోకల్ అలయెన్స్!ఉన్నాయి. అన్నింటిలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చే స్తున్నారు. టీఆర్ఎస్ 49 స్థానాల్లో పోటీ చేస్తోంది. టీడీపీ 47 స్థానాల్లోనే బరిలో ఉంది. తమ అభ్యర్థులు లేని స్థానా ల్లో ఈ రెండు పార్టీలు మిగిలిన పార్టీలతో కలిసి నడుస్తుండడం గమనార్హం. టీఆర్ఎస్.. కాంగ్రెస్ కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం ఉంటుందని రెండు పార్టీల శ్రేణులు భావించాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు న విలీనం పూర్తవుతుందని ఆ రెండు పార్టీల నేతలు అంచ నా వేశారు. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయూరుు. విలీనం లేదు కదా... కనీసం పొత్తు కూడా కుదిరే పరిస్థితి కనబడడం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కువగా విమర్శలు చేసుకునేది కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే. ఇలా ప్రధాన ప్రత్యర్థులుగా మారిన టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ జెడ్పీటీసీ ఎన్నికల్లో పొత్తు కుదిరింది. ఇక్కడ టీఆర్ఎస్ ఎవరినీ పోటీలో దింపలేదు. కాంగ్రెస్ అభ్యర్థికి టీఆర్ఎస్ పూర్తిగా సహకరిస్తోంది. నామినేషన్ల ప్రక్రియకు ముందే ఇక్కడ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్, టీడీపీ మధ్యే కీలక పోరు కొనసాగనుంది. టీడీపీ... బీజేపీ తెలంగాణ ఉద్యమంతో జిల్లాలో టీడీపీ పూర్తి దెబ్బతిన్నది. మూడు స్థానాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉంది. జనగామ, రేగొండ, హసన్‌పర్తి మండలాల్లో జెడ్పీటీసీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు. జిల్లాలో వరుసగా రెండుసార్లు జిల్లాపరిషత్ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీకి... ఇప్పుడు అభ్యర్థులు దొరకకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తోంది. అభ్యర్థులు లేకపోవడంతో టీడీపీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర పార్టీలకు మద్దతు ఇస్తోంది. రాష్ట్ర స్థాయిలో పొత్తు ఉంటుందని ఒక రోజు, ఉండకపోవచ్చని మరొక రోజు వార్తలు వస్తున్నా... జిల్లాలో మాత్రం రెండు మండలాల్లో బీజేపీకి మద్దతు ఇస్తోంది. గెలిచే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సూత్రంగా పని చేసే తెలుగుదేశం... ఇప్పుడు నరేంద్రమోడీ హవాను సొమ్ము చేసుకునే ఉద్దేశంతో వెళ్తోంది. అభ్యర్థులు లేని జనగామ, రేగొండ మండలాల్లో బీజేపీ అభ్యర్థులకు టీడీపీ సహకరిస్తోంది.టీడీపీకి అభ్యర్థి లేని హసన్‌పర్తిలో దేశం శ్రేణులు చెరోదారిగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీలోని రెండు వర్గాల్లో ఒక వర్గం కాంగ్రెస్‌కు, మరొక వర్గం టీఆర్ఎస్కు సహకరిస్తున్నాయి. -
ఏకమవుతున్న తస్మదీయులు
సాక్షి, ఏలూరు : రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా అధికార, ప్రధాన ప్రతిపక్షాలు కలసి ఎన్నికల వేళ ప్రజలను మరోసారి వంచి స్తున్నారుు. రాష్ట్రాన్ని నిరభ్యంతరంగా ముక్కలు చేసేసుకోవచ్చం టూ తెలుగుదేశం పార్టీ లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అంగీకార పత్రం రాసిస్తే.. ఆఖరి బంతి మిగిలే ఉందంటూ చివరి వరకూ నమ్మబలికి జనానికి మొండిచేయి చూపించారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు ఆ రెండు పార్టీల నాయకులు ఓట్ల కోసం ఏకమవుతున్నారు. ఏమార్చడానికి మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారు. జిల్లాలో సహకార ఎన్నికల నుంచీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు రాజకీయం కొనసాగుతోంది. వ్యవసాయం దండగ అని, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై దుస్తులు ఆరేసుకోవాలని ఎద్దేవా చేసిన టీడీపీతో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. తమకు అనుకూలంగా లేని రైతుల ఓట్లను గల్లంతు చేసింది. అదే పొత్తు పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగింది. గెలవడం కోసం ఎంతటికైనా తెగించే ఆ రెండు పార్టీలు తమ అభ్యర్థులకు మేలు చేసేందుకు అధికార దుర్వినియోగానికి కూడా వెనకాడలేదు. మునిసిపాలిటీల్లో పనులు మంజూరు చేయడం దానిలో భాగంగా జరిగిందే. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలచేశారు. తద్వారా గ్రామీణ నిరుద్యోగులకు గాలమేశారు. తాజాగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుండగా పాత మిత్రులకు ప్రలోభాలు ఎరవేసి టీడీపీ తనవైపు లాక్కొంటోంది. ఇన్నాళ్లూ చీకటి ఒప్పందాలు చేసుకుని తెరవెనుక మద్దతు తెలిపిన వారిని ప్రత్యక్షంగా తమ పార్టీలో చేర్చుకుంటోంది. తద్వారా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. ఇందుకోసం సామాజిక అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. టీడీపీ మినహా మరే ఇతర పార్టీ అధికారంలోకి వచ్చినా ఓ సామాజిక వర్గానికి నష్టం వాటిల్లుతుందనే భయాన్ని సృష్టిస్తోంది. ఇన్నాళ్లూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న నేతలు ఇప్పుడు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టి తామంతా ఒక్కటేనని బహిర్గతం చేస్తున్నారు. పదవే ముఖ్యమని చాటుతున్నారు. -
కొవ్వూరు ‘సాక్షి’ విలేకరిపై ఎమ్మెల్యే రామారావు దాడి
ఏలూరు, న్యూస్‌లైన్ : కొవ్వూరు మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ వివరాలు సేకరించేందుకు సోమవారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన సాక్షి విలేకరి జీవీవీ సత్యనారాయణపై ఎమ్మెల్యే టీవీ రామారావు దాడిచేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఆరికిరేవుల ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏకగ్రీవం చేసుకునేందుకు అంగీకరించారని స్థానిక నాయకులు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువచ్చారు. నిర్ధేశిత గడువు ముగిసినందున నామినేషన్ల ఉపసంహరణకు అనుమతించే అవకాశం లేదని ఎన్నికల అధికారి యు.వసంత్‌కుమార్ నాయకులతో స్పష్టం చేశారు. ఇదిలావుండగా సాయంత్రం 6 గంటల సమయంలో ఎమ్మెల్యే టీవీ రామారావు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ల ఉప సంహరణకు అనుమతించాలని ఎన్నికల అధికారిని కోరారు. ఆ సమయంలో ఎంపీడీవో పి.వసంతమాధురి నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం లేదని చెప్పిన తరువాత కూడా ఏకగ్రీవం చేసుకుంటామని అడగడం సరికాదని ఎమ్మెల్యేకు సూచించారు. ఈ అంశంపై ఏమీ మాట్లాడనవసరం లేదని దయచేసి మా పనులకు ఇబ్బంది కలిగించవద్దని ఎమ్మెల్యేను ఎంపీడీవో కోరారు. ఎన్నికల అధికారిని రహస్యంగా మాట్లాడి ఒప్పించే ప్రయత్నంలో భాగంగా మీతో మాట్లాడాలి పక్క గదిలోకి రమ్మని ఎమ్మెల్యే ఎన్నికల అధికారిని కోరి బయటకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో బయటకు వచ్చిన ఎన్నికల అధికారిని ఫొటో తీసేందుకు సాక్షి విలేకరి ప్రయత్నిస్తుండగా ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే రామారావు విలేకరిపై దాడికి పాల్పడ్డారు. మా పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఫొటోలు తీస్తావా అంటూ దుర్భాషలాడి పిడిగుద్దులు గుద్దారు. నిన్ను, నీ పేపర్‌ను పెట్రోల్ పోసి తగలబెడతానంటూ ఆగ్రహంతో చిందులు వేశారు. తరచూ తనపై వ్యతిరేక వార్తలు రాస్తున్నారంటూ దుర్భాషలాడుతూ రాయడానికి వీల్లేని బూతులను ప్రయోగించారు. కేకలు వేస్తున్న ఎమ్మెల్యేను ఎంపీడీవో, ఎన్నికల అధికారి దయచేసి బయటకు వెళ్లాలని కోరారు. ఎమ్మెల్యేను బయటకు పంపి కార్యాలయం బయట ద్వారం తలుపులు మూసివేశారు. ఆ సమయంలో కోపోద్రేకుడైన ఎమ్మెల్యే నా కొడకా బయటకు రారా నిన్ను చంపేస్తానంటూ సాక్షి విలేకరిపై చిందులు వేశారు. అనంతరం వెనుక గుమ్మం వద్ద నిలబడి ఫోన్ మాట్లాడుతున్న సాక్షి విలేకరి వద్దకు వచ్చి బయటకు రా నా కొడకా చంపుతానంటూ కేకలు వేశారు. దీంతో భయం వేసిన విలేకరి కార్యాలయంలోకి పరుగు పెట్టారు. భయంతో తనపై జరిగిన దాడి విషయాన్ని ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ సీఐ ఎన్.చిరంజీవి సిబ్బందితో ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సుమారు గంట పాటు తలదాచుకున్న సాక్షి విలేకరిని పోలీసులు బయటకు తీసుకువచ్చారు. అధికారుల సమక్షంలోనే ప్రభుత్వ కార్యాలయంలో ఎమ్మెల్యే రామారావు ఓ ప్రత్రిక విలేకరిపై విచక్షణ కోల్పోయి దాడికి తెగబడడంతో అక్కడున్న కార్యాలయ సిబ్బంది, అధికారులు, పలువురు నాయకులు నిర్ఘాంతపోయారు. దీనిపై విలేకరి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవ్వూరు ప్రెస్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా) ప్రతినిధులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని విలేకరిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే రామారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘ అధ్యక్షుడు దుద్దుపూడి రామచంద్రరావు (రాము), ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. విలేకరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే టీవీ రామారావుపై 341, 323, 506 క్లాజ్-2 కింద కేసులు నమోదు చేసినట్టు సీఐ ఎన్.చిరంజీవి తెలిపారు. -
నిలిచిన నిధులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థలకు ఎన్నికలు సకాలంలో జరగకపోవడంతో జిల్లాకు రావాల్సిన బీఆర్జీఎఫ్ నిధులు నిలిచాయి. జి ల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించక పోవడంతో ప్రత్యేక అధికారుల పాలన మూడేళ్లుగా కొనసాగుతోంది. దీంతో స్థానిక పాలన ప్రత్యేకాధికారులతో కొనసాగడం వల్ల అభివృద్ధి పడకేసింది. పారిశుధ్యం, వీధిదీపాలు, తాగునీటి పథకాలు నిలిచాయి. స్థానిక సంస్థలకు కేంద్రం 80 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు బీఆర్జీఎఫ్ కింద జిల్లాలోని స్థానిక సంస్థలకు విడుదల చేసేది. ప్రత్యేకాధికారుల పాలన ఉండటంతో రావాల్సిన అభివృద్ధి నిధులు నిలిచాయి. 2006లో మండల, జెడ్పీ, పంచాయతీ ఎన్నికలు జరగగా, జూలై 2011నాటికి పదవీకాలం ముగిసింది. అయితే మహానేత వైఎస్సార్ మరణంతో రాష్ట్ర రాజకీయంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.అయితే రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. ఎన్నికలు నిర్వహించని ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిలిచిన కేంద్రం నిధులు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం ఏటా స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేస్తోంది. దాదాపు మూడేళ్లలో కేంద్రం నుంచి రావాల్సిన రూ.36.65 కోట్లు నిలిచాయి. ఈ నేపథ్యంలోనే పది నెలల క్రితం సుప్రీంకోర్టు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో 2013 ఆగస్టులో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మిగతా జెడ్పీ, మండల, మున్సిపాలిటీల ఎన్నికలు వాయిదా వేసింది. దీంతో 2011-12 ప్రథమార్థంలో పాలకవర్గాలు ఉన్నప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2012-13 సంవత్సరానికి పంచాయతీ, మండల, జెడ్పీ, మున్సిపాలిటీలకు 1,986 పనుల కింద బీఆర్జీఎఫ్ నిధులు రూ.29.88 కోట్లు మంజూరు చేసింది. అదే ఏడాది ఆఖరులో మొదటి వాయిదాగా రూ.18.57 కోట్లు విడుదల చేసింది. ఇంకా రూ.11.31 కోట్లు విడుదల చేయలేదు. 2013-14 సంవత్సరానికి పంచాయతీ, మండల, జెడ్పీ, మున్సిపాలిటీలకు 1,852 పనులకు రూ.25.34 కోట్లు అక్టోబర్‌లో మంజూరు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న ఇప్పటి వరకు ఈ నిధులు విడుదలకు నోచుకోలేదు. ఫలితంగా చేపట్టాల్సిన పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 2012-13కు రూ.11.31 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, 2013-14కు రూ. 25.34 కోట్లు కలిపి జిల్లాకు మొత్తం రూ.36.65 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. నిధుల వినియోగం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం బీఆర్జీఎఫ్ నిధులు ప్రభుత్వం ఏటా విడుదల చేస్తోంది. ఎస్సీ, ఎ స్టీ జనాభా ప్రతిపాదన ఈ నిధులు విడుదల అవుతా యి. ఇందులో కేంద్రం వాటా 80 శాతం, రాష్ట్ర వాటా 20 శాతంగా ఉంటుంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించాలి. చెడిపోయిన పై ప్లైన్లను సరిచేయడం, రోడ్డు ఉండి కల్వర్టు లేనిచోట కల్వర్టుల నిర్మాణాలు చేపట్టడం, ట్రాన్స్పోర్ట్, తాగునీటి సౌకర్యాలకు, మార్కెట్ యార్డులకు, గ్రామాల్లో విద్యుదీకరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అంగన్వాడీ భవన నిర్మాణాలకు ఈ నిధులు వినియోగిస్తారు. నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి నిలిచింది. -
‘స్థానిక’ ఎన్నికలకు కసరత్తు
ఖమ్మం జడ్పీసెంటర్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచించారు. ఈ విషయంపై అధికారులకు ఆదేశాలు రావడంతో ఎంపీటీసీ అభ్యర్థుల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. గ్రామాలు, మండలాల వారీగా ఎస్టీ, బీసీ, ఎస్సీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేసి ఈ నెల 6న గెజిట్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 46 మండలాలకు 46 జడ్పీటీసీ, 640 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ పూర్తైది. మండల అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారులు ఆయా గ్రామాల వారీగా జనాభా, రొటేషన్ పద్ధతిపై రిజర్వేషన్లు ఖరారు చేసి కలెక్టర్‌కు పంపనున్నారు. ఈనెల 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్ల జాబితాను ప్రకటించనున్నారు. పబ్లికేషన్ అనంతరం ఎన్నికల ఏర్పాట్లు చేయాలని మండల పరిషత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని 46 మండలాల ఎంపీడీఓలతో జిల్లా పరిషత్ ఏఓ వింజం అప్పారావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా రిజర్వేషన్‌ను 6లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జడ్పీటీసీల కసరత్తు.... మండలాల వారీగా ఎంపీటీసీల రిజర్వేషన్ జాబితాను పూర్తి చేసిన జిల్లా పరిషత్ అధికారులు జడ్పీటీసీ (జిల్లా ప్రాదేశిక నియోజక వర్గం )ల రిజర్వేషన్ పై కసరత్తు ప్రారంభించారు. గురువారానికి రిజర్వేషన్ల వ్యవహారం పూర్తి కానుందని జిల్లా పరిషత్ అధికారులు పేర్కొన్నారు. రిజర్వేషన్ల ప్రకటన కోసం ఆయా రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఆయా మండలాల్లో తమ రాజకీయ భవిష్యత్ నిర్ణయించుకునేందుకు తహతహలాడుతున్నారు. గ్రామాల్లో సందడి... ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావాహులంతా బరిలో నిలిచేందుకు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రిజర్వేషన్‌ను తమకు అనుకూలంగా వస్తే తమకే టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లుగా మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు లేకపోవడంతో ప్రత్యేక పాలనతో కొనసాగుతున్నాయి. దీంతో గ్రామాలు, మండలాల్లో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వచ్చి వాయిదా వేసింది. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే క్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. -
మార్చి నాటికి మునిసిపల్, జిల్లా పరిషత్,మండల పరిషత్ ఎన్నికలు
సాక్షి, ఏలూరు : కొత్త సంవత్సరం ఎన్నికలను వెంటబెట్టుకు రాబోతోంది. వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిం చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభిం చింది. ఇందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిం చింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అటు నేతల్లోను, ఇటు అధికారుల్లోను టెన్షన్ మొదలైంది. ప్రజల్లోకి వెళ్లేందుకు రాజకీయ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు పెండింగ్ బిల్లులను రాబట్టుకోవడానికి నివేదికలు పంపిస్తున్నారు. ఇప్పటివరకూ వరుస విపత్తులతో ఏర్పడిన నష్టాలకు సంబంధించి రావాల్సిన బిల్లులను ప్రభుత్వం అడిగిన పద్ధతిలో జిల్లా అధికారులు పంపించారు. ఎన్నికల కోడ్ మూణ్ణెళ్ల ముచ్చట అమలులోకి వస్తే నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడుతుందని, ప్రభుత్వమే మారిపోతే పెండింగ్ బిల్లులు ఎప్పటికి విడుదలవుతాయో చెప్పలేమనే భయంతో హుటాహుటిన నివేదికలు పంపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వారుుదాల మీద వారుుదాలు జిల్లాలో 256 సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం 2010 అక్టోబర్ 21, 25 తేదీలతో ముగియగా, ఆరుసార్లు వీటి కాలపరిమితిని పొడిగించారు. ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో ఎన్నికలు జరిపారు. 2011లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగియడంతో జిల్లాలో 884 పంచాయతీలు అనాథలుగా మిగిలితే వాటికి ఈ ఏడాది జూలైలో ఎన్నికలు నిర్వహించారు. వీటికంటే ముందే జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ, ఎనిమిది పురపాలక సంఘాల పాలకవర్గాలు పదవీ కాలాన్ని ముగించుకున్నాయి. 2010 సెప్టెంబర్‌తోనే వీటి గడువు ముగిసింది. అప్పటినుంచి ప్రత్యేకాధికారులను నియమించి, ప్రతి ఆరునెలలకు వారిని పొడిగిస్తూ పాలన సాగిస్తున్నారు. 2011లోనే 46 జెడ్పీటీసీ, 884 ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసింది. ఏళ్ల తరబడి వీటికి ఎన్నికలు జరపకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పట్లో పురపాల ఎన్నికలు జరపలేమని హైకోర్టుకు చెబుతోంది. అయినప్పటికీ కొత్త సంవత్సరంలో ఎన్నికలు జరపక తప్పదు. దీంతో ఎన్నికల సంఘం బీసీ ఓటర్ల జాబితాలను ఇప్పటికే సేకరించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వచ్చే ఏడాది మార్చిలోపు ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. హడలిపోతున్న కాంగ్రెస్, టీడీపీ రానున్న మూడు ఎన్నికల్లో వచ్చే ఫలితాలు సార్వత్రిక ఎన్నికలలో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి. పంచాయతీ, సహకార ఎన్నికల్లో అడ్డదారులు తొక్కినా, అరాచకాలకు పాల్పడినా ఆశించిన ఫలితాలు సాధించలేకపోరుున అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ రాష్ట్రంలో చేజిక్కుంచుకోవాలంటే ఈ ఎన్నికల్లో సత్తా చాటాల్సిఉంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలను విభజన ద్రోహులుగా చూస్తున్న జనం ఆ పార్టీలకు తమ ఓటుతో బుద్ధిచెప్పే సమయం కోసం ఎదురుచూస్తున్నారు. దీనిని గమనించిన ఆ పార్టీల నేతలు ఎన్నికలంటేనే హడలిపోతున్నారు. మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కూడా కొందరు సాహసం చేయలేకపోతున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర కోసం అవిశ్రాంత పోరాటం చేస్తూనే ప్రజా సమస్యలపైనా ఉద్యమాలు చేస్తూ ప్రజలకు చేరువవుతోంది. ఆ పార్టీ నాయకులు నిత్యం ప్రజలమధ్య ఉంటూ వారికి భరోసా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మధ్యకు వెళ్లలేక కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు హడలెత్తిపోతున్నారుు.