లోకల్ అలయెన్స్! | some parties are tie up | Sakshi
Sakshi News home page

లోకల్ అలయెన్స్!

Published Tue, Apr 1 2014 2:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

some parties are tie up

సాక్షి ప్రతినిధి, వరంగల్: స్థానిక ఎన్నికల్లో కొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. ఉప్పునిప్పులా ఉంటున్న పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి. రాష్ట్రస్థాయిలో పొత్తులు ఉంటాయో... లేదో... ఇంకా స్పష్టత రాలేదు. కానీ... స్థానిక సమరంలో ఇప్పటికే కలిసి నడుస్తున్నాయి. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఆవిష్కృతమయ్యాయి.
 
రాష్ట్ర స్థాయిలో రోజూ తిట్టుకుంటున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు జిల్లాలోని జెడ్పీటీసీ ఎన్నికల్లో కలిసి నడుస్తున్నాయి. సీట్ల పంపకం విషయంలో పేచీ వచ్చిందంటూ.... ఒకరోజు దూరంగా, మరొక రోజు దగ్గరగా ఉంటున్న టీడీపీ, బీజేపీలు కొన్ని మండలాల్లో కలిసిపోయాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు లోకల్ అలయెన్స్!ఉన్నాయి. అన్నింటిలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చే స్తున్నారు. టీఆర్‌ఎస్ 49 స్థానాల్లో పోటీ చేస్తోంది. టీడీపీ 47 స్థానాల్లోనే బరిలో ఉంది. తమ అభ్యర్థులు లేని స్థానా ల్లో ఈ రెండు పార్టీలు మిగిలిన పార్టీలతో కలిసి నడుస్తుండడం గమనార్హం.
 
 టీఆర్‌ఎస్.. కాంగ్రెస్
కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం ఉంటుందని రెండు పార్టీల శ్రేణులు భావించాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు న విలీనం పూర్తవుతుందని ఆ రెండు పార్టీల నేతలు అంచ నా వేశారు. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయూరుు. విలీనం లేదు కదా... కనీసం పొత్తు కూడా కుదిరే పరిస్థితి కనబడడం లేదు.
 
ఇప్పుడు తెలంగాణలో ఎక్కువగా విమర్శలు చేసుకునేది కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలే. ఇలా ప్రధాన ప్రత్యర్థులుగా మారిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ జెడ్పీటీసీ ఎన్నికల్లో పొత్తు కుదిరింది. ఇక్కడ టీఆర్‌ఎస్ ఎవరినీ పోటీలో దింపలేదు. కాంగ్రెస్ అభ్యర్థికి టీఆర్‌ఎస్ పూర్తిగా సహకరిస్తోంది. నామినేషన్ల ప్రక్రియకు ముందే ఇక్కడ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్, టీడీపీ మధ్యే కీలక పోరు కొనసాగనుంది.  
 
టీడీపీ... బీజేపీ
తెలంగాణ ఉద్యమంతో జిల్లాలో టీడీపీ పూర్తి దెబ్బతిన్నది. మూడు స్థానాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉంది. జనగామ, రేగొండ, హసన్‌పర్తి మండలాల్లో జెడ్పీటీసీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు. జిల్లాలో వరుసగా రెండుసార్లు జిల్లాపరిషత్ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీకి... ఇప్పుడు అభ్యర్థులు దొరకకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తోంది. అభ్యర్థులు లేకపోవడంతో టీడీపీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర పార్టీలకు మద్దతు ఇస్తోంది.  
 
రాష్ట్ర స్థాయిలో పొత్తు ఉంటుందని ఒక రోజు, ఉండకపోవచ్చని మరొక రోజు వార్తలు వస్తున్నా... జిల్లాలో మాత్రం రెండు మండలాల్లో బీజేపీకి మద్దతు ఇస్తోంది. గెలిచే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సూత్రంగా పని చేసే తెలుగుదేశం... ఇప్పుడు నరేంద్రమోడీ హవాను సొమ్ము చేసుకునే ఉద్దేశంతో వెళ్తోంది. అభ్యర్థులు లేని జనగామ, రేగొండ మండలాల్లో బీజేపీ అభ్యర్థులకు టీడీపీ సహకరిస్తోంది.టీడీపీకి అభ్యర్థి లేని హసన్‌పర్తిలో దేశం శ్రేణులు చెరోదారిగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీలోని రెండు వర్గాల్లో ఒక వర్గం కాంగ్రెస్‌కు, మరొక వర్గం టీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement