ఖమ్మం జడ్పీసెంటర్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచించారు. ఈ విషయంపై అధికారులకు ఆదేశాలు రావడంతో ఎంపీటీసీ అభ్యర్థుల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. గ్రామాలు, మండలాల వారీగా ఎస్టీ, బీసీ, ఎస్సీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేసి ఈ నెల 6న గెజిట్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 46 మండలాలకు 46 జడ్పీటీసీ, 640 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ పూర్తైది.
మండల అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారులు ఆయా గ్రామాల వారీగా జనాభా, రొటేషన్ పద్ధతిపై రిజర్వేషన్లు ఖరారు చేసి కలెక్టర్‌కు పంపనున్నారు. ఈనెల 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్ల జాబితాను ప్రకటించనున్నారు. పబ్లికేషన్ అనంతరం ఎన్నికల ఏర్పాట్లు చేయాలని మండల పరిషత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని 46 మండలాల ఎంపీడీఓలతో జిల్లా పరిషత్ ఏఓ వింజం అప్పారావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా రిజర్వేషన్‌ను 6లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
జడ్పీటీసీల కసరత్తు....
మండలాల వారీగా ఎంపీటీసీల రిజర్వేషన్ జాబితాను పూర్తి చేసిన జిల్లా పరిషత్ అధికారులు జడ్పీటీసీ (జిల్లా ప్రాదేశిక నియోజక వర్గం )ల రిజర్వేషన్ పై కసరత్తు ప్రారంభించారు.
గురువారానికి రిజర్వేషన్ల వ్యవహారం పూర్తి కానుందని జిల్లా పరిషత్ అధికారులు పేర్కొన్నారు. రిజర్వేషన్ల ప్రకటన కోసం ఆయా రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఆయా మండలాల్లో తమ రాజకీయ భవిష్యత్ నిర్ణయించుకునేందుకు తహతహలాడుతున్నారు.
గ్రామాల్లో సందడి...
ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావాహులంతా బరిలో నిలిచేందుకు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రిజర్వేషన్‌ను తమకు అనుకూలంగా వస్తే తమకే టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లుగా మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు లేకపోవడంతో ప్రత్యేక పాలనతో కొనసాగుతున్నాయి. దీంతో గ్రామాలు, మండలాల్లో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వచ్చి వాయిదా వేసింది. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే క్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది.
‘స్థానిక’ ఎన్నికలకు కసరత్తు
Published Wed, Mar 5 2014 2:16 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement