కలెక్టరేట్, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థలకు ఎన్నికలు సకాలంలో జరగకపోవడంతో జిల్లాకు రావాల్సిన బీఆర్‌జీఎఫ్ నిధులు నిలిచాయి. జి ల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించక పోవడంతో ప్రత్యేక అధికారుల పాలన మూడేళ్లుగా కొనసాగుతోంది. దీంతో స్థానిక పాలన ప్రత్యేకాధికారులతో కొనసాగడం వల్ల అభివృద్ధి పడకేసింది. పారిశుధ్యం, వీధిదీపాలు, తాగునీటి పథకాలు నిలిచాయి. స్థానిక సంస్థలకు కేంద్రం 80 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు బీఆర్‌జీఎఫ్ కింద జిల్లాలోని స్థానిక సంస్థలకు విడుదల చేసేది.
ప్రత్యేకాధికారుల పాలన ఉండటంతో రావాల్సిన అభివృద్ధి నిధులు నిలిచాయి. 2006లో మండల, జెడ్పీ, పంచాయతీ ఎన్నికలు జరగగా, జూలై 2011నాటికి పదవీకాలం ముగిసింది. అయితే మహానేత వైఎస్సార్ మరణంతో రాష్ట్ర రాజకీయంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.అయితే రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. ఎన్నికలు నిర్వహించని ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
నిలిచిన కేంద్రం నిధులు
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం ఏటా స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేస్తోంది. దాదాపు మూడేళ్లలో కేంద్రం నుంచి రావాల్సిన రూ.36.65 కోట్లు నిలిచాయి. ఈ నేపథ్యంలోనే పది నెలల క్రితం సుప్రీంకోర్టు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో 2013 ఆగస్టులో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మిగతా జెడ్పీ, మండల, మున్సిపాలిటీల ఎన్నికలు వాయిదా వేసింది. దీంతో 2011-12 ప్రథమార్థంలో పాలకవర్గాలు ఉన్నప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2012-13 సంవత్సరానికి పంచాయతీ, మండల, జెడ్పీ, మున్సిపాలిటీలకు 1,986 పనుల కింద బీఆర్‌జీఎఫ్ నిధులు రూ.29.88 కోట్లు మంజూరు చేసింది.
అదే ఏడాది ఆఖరులో మొదటి వాయిదాగా రూ.18.57 కోట్లు విడుదల చేసింది. ఇంకా రూ.11.31 కోట్లు విడుదల చేయలేదు. 2013-14 సంవత్సరానికి పంచాయతీ, మండల, జెడ్పీ, మున్సిపాలిటీలకు 1,852 పనులకు రూ.25.34 కోట్లు అక్టోబర్‌లో మంజూరు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న ఇప్పటి వరకు ఈ నిధులు విడుదలకు నోచుకోలేదు. ఫలితంగా చేపట్టాల్సిన పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 2012-13కు రూ.11.31 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, 2013-14కు రూ. 25.34 కోట్లు కలిపి జిల్లాకు మొత్తం రూ.36.65 కోట్లు విడుదల చేయాల్సి ఉంది.
నిధుల వినియోగం
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం బీఆర్‌జీఎఫ్ నిధులు ప్రభుత్వం ఏటా విడుదల చేస్తోంది. ఎస్సీ, ఎ స్టీ జనాభా ప్రతిపాదన ఈ నిధులు విడుదల అవుతా యి. ఇందులో కేంద్రం వాటా 80 శాతం, రాష్ట్ర వాటా 20 శాతంగా ఉంటుంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించాలి. చెడిపోయిన పై ప్‌లైన్లను సరిచేయడం, రోడ్డు ఉండి కల్వర్టు లేనిచోట కల్వర్టుల నిర్మాణాలు చేపట్టడం, ట్రాన్స్‌పోర్ట్, తాగునీటి సౌకర్యాలకు, మార్కెట్ యార్డులకు, గ్రామాల్లో విద్యుదీకరణ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు ఈ నిధులు వినియోగిస్తారు. నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి నిలిచింది.
నిలిచిన నిధులు
Published Thu, Mar 13 2014 3:03 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement