యువోత్సాహం
నల్లజర్ల రూరల్, న్యూస్‌లైన్ : పరిషత్ పోరు తొలి విడతలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటు హక్కు నియోగించుకున్నారు. ముఖ్యంగా తొలిసారిగా ఓటు హక్కు లభించిన వారు ఓటు వేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. తమ తల్లిదండ్రులు, మిత్రులతో కలసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసిన తర్వాత వేలిపై వేసిన సిరాను చూసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారి ఓటేసినందుకు చాలా ఆనందంగా ఉందని నల్లజర్లకు చెందిన హారిక చెప్పింది. ఇప్పటివరకు ఓటు విలువ గురించి తరగతి గదుల్లో, అవగాహన సదస్సుల్లో తెలుసుకున్నాను. ఇప్పుడు నేరుగా ఓటేయడం ఎంతో ఆనందంగా ఉందని కావ్యమాధురి అనే విద్యార్థిని తెలిపింది. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోవడం మధురానుభూతిని కలిగించిందని పావని చెప్పింది.
మండే ఎండ.. అసౌకర్యాల నడుమ..
ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ స్థానిక పాలకుల ఎంపికలో తమ ప్రాధాన్యాన్ని గుర్తుంచుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు వేశారు. దూబచర్లలో మహిళలు మండుటెండలో గంటల తరబడి నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగన్నాథపురంలో పోలింగ్ ఏజెంట్లుగా బైండోవర్ కేసులున్న వారిని నియమించడంతో కొద్దిసేపు వివాదం చోటు చేసుకుంది. పోతవరం, చాదరాశిగుంటలో కూడా కనీస సౌకర్యాలు కరువయ్యాయి దీంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు.