మోడీపై జగద్గురువుల కన్నెర్ర
నరేంద్ర మోడీకి కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. హిందుత్వ వాదం పేరుతో ముందుకెళ్తున్న నరేంద్ర మోడీ ఎంతో దూరాలోచనలతో పుణ్య నగరి వారణాసిని తన నియోజకవర్గంగా ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు వారణాసిలో ఇద్దరు శంకరాచార్యులు మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయబోతున్నారు.
బదరి, ద్వారక పీఠాల జగద్గురువు స్వామీ స్వరూపానంద, పూరీ పీఠం శంకరాచార్య అధోక్షజానంద దేవ తీర్థ లు మోడీకి వ్యతిరేకంగా ప్రచారానికి వారణాసి రాబోతున్నారు. మోడీ 'హర్ హర్ మోడీ' అన్న నినాదం ద్వారా హిందూ ధార్మిక భావాలను దెబ్బతీస్తున్నారని ద్వారక, బదరి శంకరాచార్య ఆరోపిస్తే, 2002 లో మైనారిటీలపై దాడులు మానవత్వానికే మచ్చ అని పూరీ శంకరాచార్య అంటున్నారు.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బిజెపి నుంచి హిందుత్వ ఆస్త్రాన్ని లాగేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాము కాశీకి పవిత్ర నగరిగా చేస్తామని, పుణ్యనగరి హోదాను ఇస్తామని ఆప్ తన మానిఫెస్టోలో పేర్కొంది. మొత్తం మీద మోడీ వారణాసిలో కాస్త గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.