రివర్.. పోల్ ఫీవర్
వారణాసి: రేపు దేశ వ్యాప్తంగా తుది విడత పోలింగ్ అంకానికి తెరలేస్తున్నా ఇప్పుడు ప్రధాన పార్టీల దృష్టి వారణాసిపై పడింది. గంగానది సాక్షిగా వీచే గాలిలో పోల్ ఫీవర్ ముందుగానే మొదలైంది. అతిపురాతనమైన హోదా ఉన్న నగరంగా గుర్తింపు ఉన్న వారణాసి.. మనకు కాశీగా బాగా పరిచయం. వారణాసికి మరో విశేషం కూడా ఉంది. ఈ ప్రాంతంలో నేత కార్మికులే అధికం. ఇవన్నీ ప్రక్కకు పెడితే సోమవారం వారణాసిలో జరిగే పోరులో మూడ ప్రధాన పార్టీల హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది.
'గంగమ్మ నన్ను ఇక్కడకు ఆహ్వానించిదంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ నియోజకవర్గ ప్రజల్ని ఆకట్టుకుని యత్నం చేశారు. దీనికి గాను రెండు భారీ ఎన్నికల రోడ్ షోలను కూడా నిర్వహించారు. ఈ ర్యాలీలకు అశేష ప్రజానీకం హాజరు కావడంతో బీజేపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. వారణాసిలో మోడీ గెలుపును ఎవరూ ఆపలేరంటూ కూడా జోస్యం చెప్పింది. కాగా, ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా నేను సైతం అంటూ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మోడీని ఓడించడమే లక్ష్యంగా పోటీకి దిగిన ఆప్ అధ్యక్షుడు.. సామాన్యుడిలా అందరికీ అందుబాటులో ఉండే నేను కావాలా? హెలికాప్టర్ లో వచ్చి వెళ్లి పోయే మోడీ కావాలా? అంటూ' ఆయన తనదైన శైలిలో ఆకట్టుకునే యత్నం చేశారు. ఇక్కడి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేజ్రీవాల్.. అక్కడి ప్రజలతో వీధి సమావేశాలు కూడా నిర్వహించి ప్రజలకు దగ్గరైందుకు యత్నించారు.
ఇదిలా ఉండగా, తొలుత వారణాసి పోరులో వెనుకబడ్డ కాంగ్రెస్.. రాహుల్ గాంధీ భారీ ర్యాలీతో ఆకస్మాత్తుగా ముందుకు దూసుకు వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ ను బరిలోకి దింపారు. దీంతో వివిధ పార్టీలకు చెందిన వారు ముందుగాను హోటల్ రూమ్ లను, అతిథి గృహాలను ముందుగానే బుక్ చేసుకోవడంతో ప్రస్తుతం వారణాసిలో మరింత సందడిగా మారిపోయింది.ప్రస్తుతం ఇక్కడ చాలా చోట్ల నో వేకెంట్(ఖాళీ లేదు) బోర్డులు దర్శనమిస్తున్నాయి. గంగానది తీరంలో ఎప్పుడూ భక్తుల చేసే సందడి కాస్తా ఈ వారణాసి సమరంలో మనకు దర్శనమివ్వనుంది.