ఒకప్పుడు ఆధ్యాత్మిక నగరంగా మాత్రమే తెలసిన వారణాసి... నరేంద్ర మోదీ అభ్యర్థిత్వం కారణంగా 2014 నుంచి తరచూ వార్తల్లో నిలుస్తోంది. రెండోసారి కూడా ఈ స్థానం నుంచే నరేంద్రమోదీ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఆసక్తిని పెంచింది. మే 19న ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి.
వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ విశ్వనాథుడిని దర్శించుకునే భక్తుల్లో 70 శాతం మంది తెలుగువారేనని స్థానికులు చెబుతారు. అందుకేనేమో.. కాశీ అన్నపూర్ణేశ్వరి ఆలయం మొదలుకొని అనేక దేవాలయాల్లో పేర్లు తెలుగులోనూ ఉంటాయి. స్థానిక దుకాణాల సిబ్బంది, ఆటో డ్రైవర్లు కూడా కొంతమేర తెలుగులో మాట్లాడుతూంటారు. తెలుగువారితో ప్రత్యేక అనుబంధం ఉన్న ఈ నగరంలో ఇప్పుడు ఎన్నికల కోలాహలం నెలకొంది. నరేంద్ర మోదీ ప్రధానిగా రెండోసారి ఇక్కడి నుంచి బరిలో దిగడంతో కాశీ క్షేత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ ప్రస్తుతం ప్రధాన మంత్రి కావడం, మరోసారి ప్రధాని అభ్యర్థిగా ఉండడం, ఐదేళ్లలో మోదీ పనితీరు అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి.
బీజేపీ కంచుకోటగా...
ఇప్పటివరకు వారణాసి లోక్‌సభకు 16సార్లు జరిగిన ఎన్నికల్లో ఏడుసార్లు కాంగ్రెస్ విజయం సాధించగా.. ఆరుసార్లు బీజేపీ గెలుపొందింది. సీపీఎం, భారతీయ లోక్‌దళ్, జనతాదళ్ ఒక్కోసారి గెలుపొందాయి. 1991 నుంచి ఈ క్షేత్రం బీజేపీ కంచుకోటగా మారింది. అప్పటి నుంచి ఇప్పటివరకు బీజేపీ ఆరుసార్లు గెలుపొందింది. 2004లో మాత్రం ఒకసారి కాంగ్రెస్ గెలుపొందింది. 2014లో నరేంద్ర మోదీ ఇక్కడి నుంచి, అలాగే గుజరాత్‌లోని వడోదర నుంచి పోటీ చేసి తర్వాత వడోదర నుంచి రాజీనామా చేసి వారణాసి నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
సమీప ప్రత్యర్థి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై 3.71 లక్షల మెజారిటీతో గెలుపొందారు. పోలైన ఓట్లలో 56.37 శాతం ఓట్లు మోదీ సాధించారు. కేజ్రీవాల్‌కు 2.09 లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కు 75,614, బీఎస్పీ అభ్యర్థి జైస్వాల్‌కు 60,579, ఎస్పీ అభ్యర్థి చౌరాసియాకు 45,291 ఓట్లు లభించాయి. ఈసారి కాంగ్రెస్ తరపున తిరిగి అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు. తొలుత ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరకు అజయ్ రాయ్ బరిలో నిలిచారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి నుంచి ఎస్పీ అభ్యర్థిగా షాలినీ యాదవ్ బరిలో నిలిచారు.
మౌలిక వసతులు ఏర్పడ్డాయంటున్న ఓటర్లు
ఈ ఐదేళ్లలో ఏం మారిందని ప్రశ్నిస్తే 28 ఏళ్ల దీపక్ గుప్తా ‘మీరు ఇంతకుముందు వచ్చినప్పటిలా వారణాసి ఉందా?’అని ఎదురు ప్రశ్నతో మాట్లాడడం ప్రారంభించారు. ‘ఇప్పుడు 24 గంటలు విద్యుత్తు సరఫరా ఉంది. విద్యుత్తు తీగలు పైన కనిపించవు. సరఫరా వ్యవస్థను భూగర్భంలోకి మార్చారు. గతంలో వీధుల్లో పైన గజిబిజిగా విద్యుత్తు తీగల అల్లికలు ప్రమాదకరంగా ఉండేవి. దుమ్ము, ధూళితో ఉన్న రహదారులన్నీ ఇప్పుడు తారు రోడ్లుగా మారాయి. వీధి లైట్లు అందుబాటులోకి వచ్చాయి. గంగా నది ప్రక్షాళన జరుగుతోంది. ఘాట్ అంతా పరిశుభ్రంగా మారింది..’అంటూ ఆనందం వ్యక్తంచేశారు.
ఐదేళ్లలో మోదీ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా అని 35 ఏళ్ల సోనూను ప్రశ్నిస్తే ‘వారణాసికి రింగ్ రోడ్డు నిర్మించారు. ఎయిర్‌పోర్టు నుంచి వారణాసి మధ్య 18 కి.మీ. మేర నాలుగు లైన్ల రహదారి నిర్మించారు. ఈరెండూ వారణాసిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించగలిగాయి. ఇక్కడ జల రవాణా టెర్మినల్ కూడా ప్రారంభించారు. ఇంకా చాలా అభివృద్ధి జరిగింది.. జరుగుతుంది కూడా..’అని విశ్వాసం వ్యక్తంచేశారు. విశ్వనాథుడి మందిరం దారిలో పూవులు అమ్మే మహిళను పలుకరించగా ‘మోదీ వచ్చాక వీధుల్లో మార్పులు కనిపించాయి. వీధుల్లో మహిళల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.. వీధుల్లో వ్యాపారం చేసుకునే వారికి కొంత అండగా నిలవాల్సిన అవసరం ఉంది..’అని పేర్కొన్నారు.
చాలా ఆశలు పెట్టుకున్నా...
మోదీ నుంచి మీరు ఆశించి జరగనిదేంటి? అని అంకిత అనే యువతిని ప్రశ్నించగా ‘ఎక్కువ భాగం పర్యాటకం మీద ఆధారపడడమే. కొత్తగా ఉద్యోగాలేం రాలేదు. చిన్న చిన్న పరిశ్రమలు వస్తే బాగుంటుంది..’అని పేర్కొంది. 50 ఏళ్ల దీపక్ త్రిపాఠిని ఇదే అంశంమై ప్రశ్నించగా ‘ప్రధాన మంత్రి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ అవన్నీ వాస్తవరూపం దాల్చలేదు. కొంత ప్రగతి కనిపిస్తున్నప్పటికీ అంతకుమించి ఆశించి భంగపడడంతో కొంత అసంతృప్తి ఉన్న మాట నిజమే. తాగునీటి సమస్య కూడా ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు..’అని పేర్కొన్నారు. పడవ నడిపే దినేష్‌ను కదిలించగా ‘మోదీ ఘాట్‌లను ప్రక్షాళన చేస్తారని వింటున్నాం.
అంటే ఇదంతా ప్రయివేటు వాళ్ల చేతుల్లోకి వెళ్తుందట. అప్పుడు మేం పడవలు నడుపుకొనే పరిస్థితి ఉండదు.. నేనైతే ఈసారి ఓటే వేయదలుచుకోలేదు..’అని వ్యాఖ్యానించారు. విశ్వనాథుడి ఆలయం వెళ్లే దారిలో వినోద్ శుక్లా అనే వ్యక్తిని పలుకరించగా ‘మోదీ తెస్తున్న విశ్వనాథ కారిడార్ ప్రాజెక్టు కారణంగా మా జీవనోపాధి పోయే ప్రమాదం వచ్చి పడింది. చుట్టూ ఉన్న కట్టడాలు కూల్చి వాటి యజమానులకు నష్టపరిహారం ఇస్తున్నారు. కానీ మేం ఇక్కడ అద్దెకు తీసుకుని చిరు వ్యాపారాలు చేస్తున్నాం. మా ఉపాధి ప్రశ్నార్థకమైంది..’అని ఆవేదన వ్యక్తంచేశారు. దీపాన్షు అనే వ్యక్తిని కదిలించగా ‘ఇంకా 70 నాలాలు గంగలో కలుస్తున్నాయి.. ఎక్కడ పరిశుభ్రంగా మారింది? ఇంకా చేయాల్సింది చాలా ఉంది..’అని పేర్కొన్నారు.
ఐదేళ్లలో అభివృద్ధి ఇలా..
గడిచిన ఐదేళ్లలో వారణాసి క్షేత్రంలో దాదాపు రూ. 30వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. రహదారుల నిర్మాణం, గంగా ప్రక్షాళన, విద్యుత్తు సరఫరా వ్యవస్థ, మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం, హస్తకళల వాణిజ్య కేంద్ర నిర్మాణం తదితర వసతులపై భారీగా ఖర్చు చేశారని తెలిపారు. రూ. 600 కోట్ల వ్యయంతో కాశీ విశ్వనాథ టెంపుల్ కారిడార్ నిర్మించడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోనున్నారని, తద్వారా ఉపాధి మరింత విస్తృతమవుతుందని చెప్పారు. పండిట్ మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ సెంటర్ నిర్మాణంలో ఉందని, గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం, తదితర ప్రతిపాదనలు అమలులో ఉన్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment