భారత్ ను అర్థం చేసుకోని మోడీ
తుది ప్రచారసభల్లో రాహుల్ విమర్శనాస్త్రాలు
వారణాసిలో రోడ్‌షోకు పోటెత్తిన జనం
వారణాసి/చందౌలి (యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, చందౌలి నియోజకవర్గాల్లో శనివారం నిర్వహించిన తుది ప్రచార సభలలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆద్యంతం బీజేపీపైన, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపైన విమర్శనాస్త్రాలు కురిపించారు.భారత్‌ను, భారత ప్రజల శక్తిని మోడీ సరిగా అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ క్రోధపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ‘స్నూప్‌గేట్’ వ్యవహారంపైనా, అదానీతో మోడీకి గల సంబంధాలపైనా రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘మేం (కాంగ్రెస్) మీ కలలను నెరవేర్చాలని భావిస్తున్నాం. ఆయన (మోడీ) అదానీకి కలలు చూపిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల కిందట ఢిల్లీలో మోడీ ప్రచార పోస్టర్ ఒకటి చూశానని, అందులో ‘మహిళావోంకో మై శక్తి దూంగా’ (మహిళలకు నేను శక్తినిస్తాను) అని ఉందని చెబుతూ, అందులో మనం కాదు నేను... నేను అని మాత్రమే ఉందంటూ దెప్పిపొడిచారు. ‘ఆయన మీ వద్దకు వచ్చి మీరేమీ చేయలేదంటున్నారు. గత అరవయ్యేళ్లలో భారత్‌లో ఏమీ జరగలేదంటున్నారు. మీరేం చేశారంటూ రైతులను, కార్మికులను అడుగుతున్నారు. భారత్ నిద్రిస్తోందని అంటున్నారు’ అని అన్నారు. భారత్ అభివృద్ధి చెందిందని అమెరికా అధ్యక్షుడు సైతం గుర్తించారని, రైతులు, కార్మికులు, వర్తకులు, పారిశ్రామికవేత్తలు భారత్‌ను వృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయారని అన్నారు. భారత్ పులిలా ఎదిగితే, మోడీ వచ్చి తనను చౌకీదారుగా ఎన్నుకోమని ఓటర్లను కోరుతున్నారన్నారు.
మోడీకి భారత్ గురించి ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు. భారత మహిళలకు ఎవరూ శక్తినివ్వాల్సిన అవసరం లేదని, వారికి చాలా శక్తి ఉందని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అడ్డుపడటం వల్లనే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందలేకపోయిందన్నారు.పోటెత్తిన జనసందోహం: వారణాసిలో రాహుల్ రోడ్‌షోకు భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. రాహుల్ పోటీలో ఉన్న అమేథీ నియోజకవర్గంలో గతవారం మోడీ ప్రచారం నిర్వహిం చిన నేపథ్యంలో, మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో రాహుల్ ప్రచారానికి ప్రాధాన్యం ఏర్పడింది. వారణాసిలో ముస్లింల ప్రాబల్యం గల గోల్‌గద్దా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌తో కలసి రాహుల్ రోడ్ షో ప్రారంభించారు. 12 కి.మీ. సాగిన రోడ్‌షోలో జనం ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారణాసి బరిలో ఉన్న మోడీ, అరవింద్ కేజ్రీవాల్‌ల కంటే రాహుల్ ఎక్కువ దూరం తిరిగి ప్రచారం చేయడం విశేషం. రోడ్‌షోలో బిస్మిల్లా ఖాన్ కుటుంబ సభ్యులు: ‘షెహనాయ్’ దిగ్గజం బిస్మిల్లా ఖాన్ కుటుంబ సభ్యులు వారణాసిలో రాహుల్ రోడ్ షోలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీకి ప్రీతిపాత్రమైన ‘రఘుపతి రాఘవ రాజారాం’ భజనగీతాన్ని వారు షెహనాయ్‌పై వినిపించారు. మోడీ నామినేషన్‌కు ప్రతి పాదకులుగా ఉండాలన్న విజ్ఞప్తిని సున్నితంగా తోసిపుచ్చిన బిస్మిల్లా కుటుంబ సభ్యులు ఈషోలో షెహనాయ్ ఆలపించడం విశేషం.