సార్వత్రిక సమరానికి తెర, కాశీపైనే అందరి దృష్టి
సార్వత్రిక సమరానికి తెర, కాశీపైనే అందరి దృష్టి
Published Tue, May 13 2014 2:16 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
సార్వత్రిక సమరం ముగిసింది. ఏప్రిల్ 7న ప్రారంభమై దేశవ్యాప్తంగా 9 విడతల్లో జరిగిన 2014 లోక్‌సభ ఎన్నికల యుద్ధం సోమవారం (మే12)తో పరిసమాప్తమైంది. భారతదేశ లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక పోలింగ్ నమోదైన ఎన్నికలుగా ఇవి నిలిచాయి. ఈ ఎన్నికల్లో 66.38% పోలింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్‌లలోని 41 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరిగింది.
న్యూఢిల్లీ: సార్వత్రిక సమరం ముగిసింది. ఏప్రిల్ 7న ప్రారంభమై దేశవ్యాప్తంగా 9 విడతల్లో జరిగిన 2014 లోక్‌సభ ఎన్నికల యుద్ధం సోమవారం(మే 12)తో పరిసమాప్తమైంది. ఫలితాలు మే 16న వెల్లడి కానున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్‌లలోని 41 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరిగింది. గత విడతల మాదిరిగానే 9వ దశలోనూ భారీ పోలింగ్ చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా 80%, బీహార్‌లో 58%, యూపీలో 55% పోలింగ్ నమోదైంది. అయితే, పూర్తి వివరాలు అందలేదని, తుది గణాంకాలను త్వరలో వెల్లడి చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
పోలింగ్ శాతంలో 2014 లోక్‌సభ ఎన్నికలు రికార్డు సృష్టించాయి. భారతదేశ లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక పోలింగ్ నమోదైన ఎన్నికలుగా నిలిచాయి. ఈ ఎన్నికల్లో 66.38% పోలింగ్ నమోదు చేసి.. మాజీప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన 1984 నాటి లోక్‌సభ ఎన్నికల రికార్డు(64.01%)ను చెరిపేశాయి. 2009 నాటి ఎన్నికల్లో పోలింగ్ శాతం 55.29 మాత్రమే కావడం గమనార్హం. సోమవారం పశ్చిమబెంగాల్‌లోని 24 ఉత్తర పరగణ జిల్లాలో జరిగిన ఒక హింసాత్మక ఘటనలో 13 మంది గాయాల పాలయ్యారు. అది మినహా 9వ విడత ప్రశాంతంగా ముగిసింది.
పశ్చిమబెంగాల్‌లో పోలింగ్ జరిగిన 17 స్థానాల్లో.. 2009 ఎన్నికల్లో గెలుచుకున్న 14 స్థానాలను నిలబెట్టుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ కృషి చేసింది. 2009 ఎన్నికలతో పోలిస్తే పశ్చిమబెంగాల్‌లో పోలింగ్ 2% తగ్గడం విశేషం. గత ఎన్నికల్లో ఇక్కడ 82.07% పోలింగ్ నమోదయింది. బీహార్‌లో సోమవారం పోలింగ్ జరిగిన ఆరుస్థానాల్లో భారీ పోలింగ్ నమోదయింది. 2009 ఎన్నికల కన్నా బీహార్‌లో 12%, యూపీలో 10% ఎక్కువ నమోదు కావడం గమనార్హం.
కాశీపైనే అందరి దృష్టి
9వ దశ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పోటీపడిన యూపీలోని వారణాసి స్థానంపైనే అందరి దృష్టి ఉంది. అక్కడ 55.34% పోలింగ్ నమోదయింది. మండే ఎండలను కూడా లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. మైనారిటీ వర్గాలకు చెందిన ఓటర్లు కూడా భారీగాఓటుహక్కును వినియోగించుకోవడం కనిపించింది. వారణాసిలో 2009లో 43.34% పోలింగ్ మాత్రమే నమోదు కావడం గమనార్హం. నియోజకవర్గంలో దాదాపు 1,200 పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 45 వేల మందికి పైగా భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తించారు. ఇక్కడ పోటీ తనకు, మోడీకి మధ్యనేనని, కాంగ్రెస్ అభ్యర్థి తమకు పోటీదారు కాదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అర్థబలానికి, అంగబలానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు వారణాసి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు.
కేంద్రంలో అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీకి సోమవారం పోలింగ్ జరిగిన తూర్పు యూపీలోని 18 స్థానాలు చాలా కీలకం. ఇక్కడ అత్యధిక సీట్లు గెలుచుకుంటామన్న నమ్మకంతో బీజేపీ ఉంది. 2009 ఎన్నికల్లో ఈ స్థానాల్లో ఎస్పీ 6, బీఎస్పీ 5, బీజేపీ 4, కాంగ్రెస్ 3 గెలుచుకున్నాయి. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ బరిలో ఉన్న అజాంగఢ్ స్థానంలో 52.3% పోలింగ్ నమోదైంది.
Advertisement
Advertisement