వారణాసిలో జోరుగా పోలింగ్
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారణాసి పార్లమెంటరీ స్థానంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో అక్కడ కేవలం 42 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా, ఈసారి మధ్యాహ్నం మూడు గంటల వరకే దాదాపు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇంకా మూడు గంటల పాటు పోలింగ్ జరగాల్సి ఉండటంతో ఇది మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ, ఆయనను ఢీకొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ సహా.. అనేక మంది అభ్యర్థులు ఇక్కడ రంగంలో ఉన్నారు. దాంతో ఈ పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉన్న మారుమూల ప్రాంతాలతో పాటు నదేసర్, రాం నగర్, బేణీబాగ్, బెనారస్ హిందూ యూనివర్సిటీ క్యాంపస్ లాంటి పట్టణ ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున ఓటర్లు తరలి వచ్చారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ భారీగా ఓటర్లు బారులు తీరి ఉండటం కనిపించింది. వారణాసిలో మొత్తం 16 లక్షల మంది ఓటర్లుండగా వారిలో 3 లక్షల మంది ముస్లింలే.
కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ అత్యుత్సాహంతో తమ పార్టీ గుర్తును తన కుర్తా మీద ధరించి ఓటు వేయడానికి వెళ్లడంతో.. ఎన్నికల నిబంధనలను అతిక్రమించారంటూ ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఆయనమీద ఎఫ్ఐఆర్ దాఖలైంది. సిగ్రా పోలీసు స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, తాను కావాలని అలా చేయలేదని, బూత్లో ఉన్న అధికారులు తనకు ఆ విషయం చెప్పి ఉండాల్సిందని అజయ్ రాయ్ వాదించారు.