ajay rai
-
రాహుల్ గాంధీ విషయంలో ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారు..
లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మళ్ళీ అమేధీ లోక్ సభ స్థానం నుంచే పోటీ చేస్తారని కరాఖండిగా చెబుతున్నారు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్. అమేధీ ప్రజలు గత ఎన్నికల్లో ఆయనను ఓడించి తాము చేసిన తప్పును సరిచేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బ్రీజ్ లాల్ ఖబ్రీ స్థానంలో నియమితులైన అజయ్ రాయ్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే కీలక ప్రకటన చేసి సంచలనానికి తెర తీశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమేధీ నుంచే పోటీ చేస్తారని ప్రకటన చేశారు. మొదట కచ్చితంగా పోటీ చేస్తారని చెప్పిన ఆయన తర్వాత విలేఖరులు నొక్కి మరీ ప్రశ్నించడంతో కాస్త తటపటాయించి.. క్లాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అమేధీ ప్రజలు కూడా గత ఎన్నికల్లో తాము చేసిన పొరపాటుని సరిచేసుకుని ఈసారి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదే పార్లమెంటు స్థానంలో గెలిచిన స్మృతి ఇరానీ కిలో పంచదార కేవలం రూ.15 కే అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ పంచదార ఎటు పోయిందంటూ ప్రశ్నించారు. గత రెండు పర్యాయాల్లో వారణాసి నుండి ప్రధాని నరేంద్ర మోదీపై పొటీ చేసిన అజయ్ రాయ్ ఈసారి ప్రియాంక గాంధీ ఇక్కడ నుండి పోటీ చేస్తానంటే తనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. . గత సార్వత్రిక ఎన్నికల్లో అమేధీ నుండి పోటీ చేసిన రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడించారు. 2004 నుండి ఇదే పార్లమెంటు స్థానం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన రాహుల్ గాంధీ గత పర్యాయం 2019లో మాత్రం ఓటమిని చవిచూశారు. అయినా కూడా ఆయన కేరళలోని వాయనాడ్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి చట్టసభలో అడుగుపెట్టారు. ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీలు -
‘మోదీ.. ఓ నయా ఔరంగజేబు’
లక్నో : కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని నయా ఔరంగజేబుగా వర్ణించారు. వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సంజయ్ నిరుపమ్. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘వారణాసి ప్రజలు ఎన్నుకున్న నరేంద్ర మోదీని చూస్తే.. నాకు నయా ఔరంగబేబులా కనిపిస్తున్నారు. నేను ఆయనను చాలా తీవ్రంగా విమర్శిస్తున్నాను. ఔరంగజేబు కూడా చేయని ఎన్నో అకృత్యాలను మోదీ చేస్తున్నార’ని మండిపడ్డారు. అంతేకాక కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌లో భాగంగా వారణాసిలోని అనేక ఆలయాలను కూలదోశారని సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. మోదీ సూచనల మేరకే వాటిని కూలదోశారని ఆయన పేర్కొన్నారు. మోదీ తీసుకొచ్చిన నియమాల వల్లే కాశీ విశ్వనాథుని ఆశీర్వాదం కోసం జనాలు రూ. 550 చెల్లించుకోవాల్సి వస్తుందని విమర్శించారు. 17వ శతాబ్దానికి చెందిన ఔరంగజేబు ఎన్నో హిందూ ఆలయాలను కూల్చి చరిత్రపుటల్లో హిందూ వ్యతిరేకిగా మిగిలాడు. అలాంటి వ్యక్తితో.. నరేంద్ర మోదీని పోల్చడంతో.. బీజేపీ నాయకులు సంజయ్ నిరుపమ్ మీద మండిపడుతున్నారు. -
అజయ్ రాయ్ రాయని డైరీ
నామినేషన్‌కి రేపు చివర్రోజు. ఏరివేతలకు ఎల్లుండి ఆఖర్రోజు. ఏదైనా మిరకిల్ జరిగి, చెల్లని నోటును డిపాజిట్ మిషన్ విసిరి కొట్టినట్టుగా ఎలక్షన్ కమిషన్ నా నామినేషన్‌ని విసిరికొట్టేస్తే బావుణ్ణు. ఇప్పటికే ఒకసారి మోదీజీ మీద ఓడి పోయాను. మళ్లొకసారి మోదీజీ గెలుపును నా చేతుల్లో పెట్టి ‘‘మీదే బాధ్యత’’ అని వెళ్లి పోయాడు రాహుల్! ‘రాహుల్‌బాబూ.. నాకెప్పుడూ ఒక సందేహం వస్తుంటుంది’’ అన్నాను.. రాహుల్ నా చేతుల్లో పెట్టదలచుకున్నది పెట్టి వెళ్లిపోతున్నప్పుడు. ‘ఎప్పుడూ వచ్చే సందేహమే అయితే ఇప్పటికీ దానిని ఒక సందేహంగానే ఉండనిచ్చినందుకు ఎప్పటికైనా దానిని నివృత్తి చేసుకోవలసిన బాధ్యత మీదే అవుతుంది అజయ్. కొత్తగా వచ్చిన సందేహమైతేనే మీరు నన్ను అడగండి’ అన్నాడు! ‘‘కానీ.. నా సందేహం కొత్తదేమీ కాదు రాహుల్‌బాబూ..’’ అన్నాను. రాహుల్ నవ్వాడు. ‘‘ ఓ! నాకు అర్థమైంది అజయ్. నా ప్రియ సోదరిని వారణాసిలో మోదీపై పోటీగా నిలబెడతానని దేశమంతా అనుకున్నట్లే మీరూ అనుకున్నారు. ఇప్పుడు ఆమెకు బదులుగా మిమ్మల్ని నిలబెట్టేసరికి మీకూ, దేశానికీ.. అనుకోడానికి ఏమీ లేకుండా పోయింది. ఇలా ఎవ్రీ టైమ్ దేశ ప్రజల్ని, పార్టీ అభ్యర్థుల్ని నేనెలా నివ్వెర పాటుకు గురి చేయగలుగుతున్నాననే కదా మీ సందేహం’ అన్నాడు. ‘‘అది కాదు నా సందేహం రాహుల్‌బాబూ. మోదీపై ఎవరు ఎవర్ని నిలబెట్టినా అది ఎవరికైనా నివ్వెరపాటే. మీరు నన్ను నిలబెట్టారు. అఖిలేశ్.. షాలినిని నిలబెట్టాడు. షాలిని ఎవరో వారణాసిలో ఎవరికీ తెలీదు. నేనెవరో తెలియనివాళ్లు వారణాసిలోనే లేరు. మోదీపై నిలబడ్డాం కనుక ఇప్పుడు ఇద్దరం ఒకటే. ఎవరికీ తెలియని షాలిని అందరికీ తెలిశారు. అందరికీ తెలిసిన నేను ఈసారి కూడా మోదీపై ఓడిపోతే ఎవరికీ తెలియకుండా పోతాను’’ అన్నాను. రాహుల్ అసహనంగా చూశాడు. ‘‘మీ సందేహం ఏమిటో చెప్పకుండా, మీ సందేహం ఏమిటోనన్న సందేహంలోకి నన్ను నెట్టేస్తున్నారు’’ అన్నాడు. వెళ్లే తొందరలో ఉన్నాడని నాకు అర్థమైంది. ‘‘రాహుల్‌బాబూ.. మీ ప్రియ సోదరి మీకు అక్క అవుతారా, లేక మీకు చెల్లి అవుతారా? ఎప్పుడూ నాకిదొక సందేహం’’ అన్నాను. ఇదేనా మీ సందేహం అన్నట్లు చూశాడు రాహుల్. ‘‘పోలింగ్‌కి గట్టిగా ఇరవై రోజులైనా లేకుండానే మీకిలాంటి సందేహాలు వస్తున్నాయంటే, పోలింగ్ ఫలితాలపై మీకెలాంటి సందేహాలూ లేనట్లు అర్థమౌతోంది అజయ్’’ అనేసి వెళ్లిపోయాడు! రాహుల్ వెళ్లిపోగానే మనోజ్ కుమార్‌కి ఫోన్ చేశాను. ‘‘ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌కి మీరిలా నేరుగా ఫోన్ చెయ్యకూడదు’’ అన్నాడు మనోజ్. ‘‘పార్టీ అభ్యర్థిగా కాదు, ఒక పౌరుడిగా చేశాను’’ అన్నాను. ‘‘చెప్పండి’’ అన్నాడు. ‘‘పదహారు క్రిమినల్ కేసులు ఉండి, గూండా యాక్ట్ కింద అరెస్ట్ అయి, పోలీసుల్ని తన్ని, పోలీస్ వాహనాల్ని తగలేసి, ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేసి, ప్రైవేట్ ఆర్మీని నడిపి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద బుక్ అయిన ఒక వ్యక్తి నామినేషన్‌ని తిరస్కరించడానికి వీలువుతుందా?’’ అని అడిగాను. ‘‘టు మై నాలెడ్జ్.. వీలు కాకపోవచ్చు’’ అన్నాడు కమిషనర్. ‘‘పోనీ.. అఫిడవిట్లో ఐదొందల నోటు చూపి, జేబులో రెండువేల నోటు పెట్టుకుని తిరుగుతున్నాడని ఎవరైనా కంప్లయింట్ చేస్తే, అప్పుడైనా నామినేషన్‌ని తిరస్కరిస్తారా?’’ అని అడిగాను. ‘‘సారీ.. ఇవన్నీ చెప్పడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం’’ అని ఫోన్ పెట్టేశాడు కమిషనర్. మాధవ్ శింగరాజు -
హైకోర్టులో ప్రధాని మోదీకి ఊరట
అలహాబాద్: ప్రధాని నరేంద్ర మోదీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మోదీ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. విచారణకు జరపాల్సిన ప్రతాలేవి పిటిషనర్ సమర్పించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కక్షిదారు పూర్తి వివరాలు ఇవ్వలేదని అన్నారు. మీడియా కథనాల ఆధారంగా అరకొర సమచారంతో పిటిషన్ వేశారని అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో మోదీ నామినేషన్ పత్రాల్లో అవాస్తవాలు ఉన్నాయనీ, ప్రజలకు డబ్బులు పంచడంతోపాటు మతపరమైన మనోభావాలను అడ్డం పెట్టుకుని ప్రచారం చేసి గెలిచారు కాబట్టి ఆయన ఎన్నిక చెల్లదని తీర్పునివ్వాలంటూ మోదీపై కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన అజయ్‌రాయ్ ఈ వ్యాజ్యం వేశారు. -
15న ‘మోదీ ఎన్నిక చెల్లదు’ పిటిషన్‌పై విచారణ
అలహాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు నవంబరు 15న విచారించనుంది. ఎన్నిక ఎందుకు చెల్లదో వివరిస్తూ పిటిషనర్ అసంబద్ధ కారణాలు పేర్కొన్నారని, ఈ ఆరోపణలు ప్రజా ప్రతినిధుల చట్టం కిందకు రావనీ, అసలు ఇది విచారణార్హం కాదని మోదీ తరఫు న్యాయవాదులు వాదించారు. అయినా కోర్టు పిటిషన్‌ను విచారణకు తీసుకుంది. ఆ ఎన్నికల్లో మోదీపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అజయ్ రాయ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. మోదీ చిత్రాలున్న పోస్టర్లు, టీ షర్టులను జనాలకు పంచిపెట్టారనీ, ఒక విధంగా ఓటర్లకు లంచం ఇవ్వడం వంటిదని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. -
జైల్లో ఘర్షణ, అధికారికి తీవ్ర గాయాలు
లక్నో: ఉత్తర ప్రదేశ్ వారణాసి జిల్లా కారాగారంలో ఖైదీలకు, పోలీసులకు మధ్య శనివారం ఉదయం తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో జైలు ఉన్నతాధికారి తీవ్రంగా గాయడ్డారు. ఖైదీలకు, జైలు పోలీసులకు మధ్య జరిగిన అల్లర్లు రణరంగాన్ని తలపించింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నత అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శనివారం ఉదయం ఇద్దరు ఖైదీలను జైలు గార్డులు చితకబాదడంతో పాటుగా, తమకు అందించే ఆహారంలో నాణ్యత సహా అనేక సమస్యలపై అసంతృప్తితో రగిలిపోతున్న ఖైదీలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీంతో ఆగ్రహించిన జైలు అధికారులు ఖైదీలపై విరుచుకుపడ్డారు. దీంతో వివాదం మొదలైంది. పోలీసులపై తిరగబడిన ఖైదీలు రాళ్లు రువ్వడంతో జైలు ఆవరణంతా రాళ్లతో నిండిపోయింది. ఈ ఘర్షణలో డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ అజయ్ రాయ్ తలకి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది జైలు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న సీనియర్ అధికారులు గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు. జైలు చుట్టూ పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఆఫ్ దళాలు సహా అదనపు బలగాలను మోహరించినట్లు ఉన్నతాధికారి రాజ్ మణి యాదవ్ తెలిపారు. మరోవైపు ఘర్షణకు దిగిన ఖైదీలతో చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
వారణాసిలో పోటెత్తిన ఓటర్డు, రికార్డు స్థాయి పోలింగ్!
వారణాసి: వారణాసి ఓటర్లు తీవ్ర స్థాయిలో ఉన్న ఎండ వేడి పక్కన పెట్టి భారీ సంఖ్యలో ఓటేశారు. వారణాసిలో సోమవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా రికార్టు స్థాయిలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్ రాయ్ ల మధ్య పోటీ దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. సోమవారం జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల వరకు 56 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పోలింగ్ నమోదైందని, పెద్ద సంఖ్యలో మైనారిటీ ఓటర్లు ఓటింగ్ బార్లు తీరి ఉండటం స్పష్టంగా కనిపించింది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఈసీ అధికారుల తెలిపారు. 2009 ఎన్నికల్లో వారణాసిలో పోలింగ్ శాతం 43 శాతం మాత్రమేనని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని ధరించి కాంగ్రెస్ అభ్యర్ధి ఆజయ్ రాయ్ పోలింగ్ బూత్ లోకి వెళ్లడం వివాదంగా మారింది. -
వారణాసిలో జోరుగా పోలింగ్
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారణాసి పార్లమెంటరీ స్థానంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ కేవలం 42 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా, ఈసారి మధ్యాహ్నం మూడు గంటల వరకే దాదాపు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇంకా మూడు గంటల పాటు పోలింగ్ జరగాల్సి ఉండటంతో ఇది మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ, ఆయనను ఢీకొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ సహా.. అనేక మంది అభ్యర్థులు ఇక్కడ రంగంలో ఉన్నారు. దాంతో ఈ పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉన్న మారుమూల ప్రాంతాలతో పాటు నదేసర్, రాం నగర్, బేణీబాగ్, బెనారస్ హిందూ యూనివర్సిటీ క్యాంపస్ లాంటి పట్టణ ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున ఓటర్లు తరలి వచ్చారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ భారీగా ఓటర్లు బారులు తీరి ఉండటం కనిపించింది. వారణాసిలో మొత్తం 16 లక్షల మంది ఓటర్లుండగా వారిలో 3 లక్షల మంది ముస్లింలే. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ అత్యుత్సాహంతో తమ పార్టీ గుర్తును తన కుర్తా మీద ధరించి ఓటు వేయడానికి వెళ్లడంతో.. ఎన్నికల నిబంధనలను అతిక్రమించారంటూ ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఆయనమీద ఎఫ్ఐఆర్ దాఖలైంది. సిగ్రా పోలీసు స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, తాను కావాలని అలా చేయలేదని, బూత్‌లో ఉన్న అధికారులు తనకు ఆ విషయం చెప్పి ఉండాల్సిందని అజయ్ రాయ్ వాదించారు.