జైల్లో ఘర్షణ, అధికారికి తీవ్ర గాయాలు
లక్నో: ఉత్తర ప్రదేశ్ వారణాసి జిల్లా కారాగారంలో ఖైదీలకు, పోలీసులకు మధ్య శనివారం ఉదయం తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో జైలు ఉన్నతాధికారి తీవ్రంగా గాయడ్డారు. ఖైదీలకు, జైలు పోలీసులకు మధ్య జరిగిన అల్లర్లు రణరంగాన్ని తలపించింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నత అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
శనివారం ఉదయం ఇద్దరు ఖైదీలను జైలు గార్డులు చితకబాదడంతో పాటుగా, తమకు అందించే ఆహారంలో నాణ్యత సహా అనేక సమస్యలపై అసంతృప్తితో రగిలిపోతున్న ఖైదీలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీంతో ఆగ్రహించిన జైలు అధికారులు ఖైదీలపై విరుచుకుపడ్డారు. దీంతో వివాదం మొదలైంది.
పోలీసులపై తిరగబడిన ఖైదీలు రాళ్లు రువ్వడంతో జైలు ఆవరణంతా రాళ్లతో నిండిపోయింది. ఈ ఘర్షణలో డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ అజయ్ రాయ్ తలకి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది జైలు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న సీనియర్ అధికారులు గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు. జైలు చుట్టూ పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఆఫ్ దళాలు సహా అదనపు బలగాలను మోహరించినట్లు ఉన్నతాధికారి రాజ్ మణి యాదవ్ తెలిపారు. మరోవైపు ఘర్షణకు దిగిన ఖైదీలతో చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.