సిరిసిల్ల పాట.. గెలుపు బాట | sirsilla song...path to victory | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల పాట.. గెలుపు బాట

Published Thu, Apr 3 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM

sirsilla song...path to victory

మా పల్లె పొద్దుపొడుపు తుమ్మెదాలో.. మచ్చలేని చంద్రుడే తుమ్మెదాలో..., నారుమడిలో నాటేసే ఓమాయక్క.. మన ఊరి మంచి నాయకుడెవరే చెప్పక్క.. పేదోళ్ల పెన్నిధి.. బడుగోళ్ల బంధువు.... ఎవరున్నారే మాయక్క...., నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో.. అంటూ సాగే పల్లవిలతో పాటలు ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారంలో మార్మోగుతున్నాయి. ఎన్నికల వేళ సిరిసిల్లకు చెందిన గాయకులు పాటలు కైగట్టి పాడుతున్నారు. అభ్యర్థులెవరైనా.. పార్టీ ఏదైనా సరే.. ఆ ప్రాంతానికి అనుగుణంగా పల్లె పదాలను జోడించి పాటలు రాస్తూ ఆలపిస్తున్నారు. సినిమా పాటలతోపాటు తెలంగాణ ఉద్యమగీతాల బాణీల్లో పాటలు రాస్తూ స్వరాలు అందిస్తున్నారు. సిరిసిల్ల పాటల రికార్డింగ్‌కు కేంద్రమైంది. తెలంగాణలోని పదిజిల్లాలతోపాటు వైజాగ్, రాజమండ్రి నుంచి కూడా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పాటలతో ప్రచారం చేసేందుకు పోటీపడుతున్నారు. ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు ఇస్తూ పాటల సీడీలను రికార్డింగ్ చేయిస్తున్నారు.          
- న్యూస్‌లైన్, సిరిసిల్ల
 
 సంగీతం.. సాహిత్యం..
 పాటకు అనుగుణంగా సంగీతాన్ని అందించడంలో సిరిసిల్లకు చెందిన జీఎల్ నాందేవ్ దిట్ట. సాహిత్యపరంగా జడల రమేశ్ అద్భుతమైన రచనలతో పాటలు ఉరకలెత్తిస్తున్నారు. ఒక్కో పాట రికార్డింగ్‌కు రూ.పదివేల వరకు ఖర్చవుతుండగా.. ఆడ, మగ గొంతులతో పాటలు పాడుతూ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు సైతం పాటలతో ప్రచారం చేయించుకోవడానికి ఆరాటపడుతూ ఖర్చులకు వెనుకాడడంలేదు. మొత్తం పాట సదరు పోటీలో ఉన్న అభ్యర్థి పేరు, పార్టీ, గుర్తు, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలను జోడిస్తూ పాటల్లో స్థానం కల్పిస్తున్నారు. శ్రావ్యమైన గొంతుకలతో ఆకట్టుకుంటున్నారు. సిరిసిల్ల కేంద్రంగా రెండు పాటల రికార్డింగ్ స్టూడియోలు ఉండగా.. రెండింటిల్లోనూ గాయకులు పాటలు పాడుతూ రికార్డింగ్‌లో బిజీగా ఉన్నారు. క్షణం తీరికలేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఆర్డర్లతో పాటల పల్లకీలో విహరిస్తున్నారు.
 
 ఉపాధి బాగుంది..
 ఇరవై ఏళ్లుగా గాయకుడిగా ఉన్నాను. ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో ఉపాధి బాగుంది. తలాపున పారుతుంది గోదారి.. అంటూ పాడిన పాట మంచి గుర్తింపు తెచ్చింది. లాయ్‌లాయ్ లబ్బర్‌బొమ్మ ఆల్బమ్‌తో మంచిపేరు వచ్చింది. పాటల రికార్డింగ్‌లో బిజీగా ఉన్నాం.
 - ఆకునూరి దేవయ్య, గాయకుడు
 
 ఎనిమిదేళ్లుగా పాటలు పాడుతున్న. ఈసారి మాత్రం ఎన్నికలు ఒకేసారి రావడంతో చాలా బిజీగా ఉన్న. అంతకుముందు ప్రైవేటు ఆల్బమ్స్, క్లాసికల్ మ్యూజిక్ పాడా. ప్రొఫెషనల్స్ ఆల్బమ్స్ చేశాం. ఒక్కో పాటకు రూ.వెయ్యి నుంచి రూ.పదిహేను వందలు ఇస్తున్నారు. మా వారి ప్రోత్సాహంతో పాడుతున్నా.
 - ఎస్.లలితాప్రసాద్, గాయకురాలు
 
 రాష్ట్రమంతటికీ పాటలు రికార్డ్‌చేస్తున్నాం. టెక్నాలజీ పెరిగింది. పాటలు
 ఒకసారి.. కోరస్ మరోసారి రికార్డ్‌చేస్తాం. పదిహేడేళ్లుగా సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నా. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 120 పాటలు రికార్డ్ చేశా.
 వైజాగ్, రాజమండ్రితోపాటు చాలా ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.
 పాటల రికార్డింగ్ చేస్తున్నాం.
 - జీఎల్ నాందేవ్, గాయకుడు, సంగీత దర్శకుడు
 
 వందల పాటలు రాశా.. పాడా..
 ఇప్పటికే వందల పాటలు రాశాను. వాటిని గాయకులతో పాడించాను. చాలా సందర్భాల్లో నేను కూడా పాడాను. ఎన్నికలు ఒకేసారి రావడం కాస్త ఇబ్బందిగా ఉంది. ఆర్డర్ల మీద ఆర్డర్లొస్తున్నాయి. టైమ్‌కు అందించడం కష్టంగా ఉంది. రికార్డింగ్‌కు చాలా టైం తీసుకుంటోంది. ప్రచార గడువులోగా అందరికీ అందించడం ఇబ్బందే..
 - జడల రమేశ్, గాయకుడు, రచయిత
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement