సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
అంబేద్కర్‌కు నివాళులర్పించి జాబితా విడుదల చేసిన జగన్
170 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు వెల్లడి
మహిళలు సహా అన్ని సామాజిక వర్గాలకూ సముచిత స్థానం
కాపు, బలిజ వర్గాలకు ప్రాధాన్యం.. 25 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు
వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు కలిపి 32 శాతం సీట్లు
బీసీల్లో అన్ని సామాజిక వర్గాల వారికీ జాబితాలో ప్రాతినిధ్యం
26 ఎస్సీ అసెంబ్లీ స్థానాల్లో మాలలకు 18, మాదిగలకు 8 సీట్లు
{పకటించిన 24 లోక్‌సభ స్థానాల్లో 5 చోట్ల మహిళలకు టికెట్లు
శాసనసభ నియోజకవర్గాల్లో 11 చోట్ల మహిళలకు అవకాశం
త్తం 170 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ సీట్లు సహా
103 చోట్ల ఎస్సీ, బీసీ, కాపు, బలిజ, మైనారిటీలకు టికెట్లు
పార్టీ ఆవిర్భావం నుంచీ వెన్నంటి ఉన్నవారికి ప్రాధాన్యం
పదవులను వదులుకుని వచ్చిన వారికీ టికెట్ల కేటాయింపు
‘అవిశ్వాస తీర్మానం’లో అనర్హతకు గురైన వారందరికీ చోటు
పులివెందుల నుంచి శాసనసభకు జగన్‌మోహన్‌రెడ్డి,
విశాఖపట్నం నుంచి లోక్‌సభకు విజయమ్మ పోటీ
బాపట్ల లోక్‌సభ, ఐదు అసెంబ్లీ స్థానాలు పెండింగ్
హైదరాబాద్: అన్ని వర్గాల వారికీ తగిన ప్రాధాన్యం కల్పిస్తూ.. సామాజిక సమతూకం పాటిస్తూ సీమాంధ్ర ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 175 శాసనసభ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో.. కేవలం 6 స్థానాలకు మినహా మిగతా స్థానాలన్నిటికీ ఒకేసారి అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. సోమవారం డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజున పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన తర్వాత.. మొత్తం 170 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఈసారి విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. మహిళలు, వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలతో సహా అన్ని సామాజిక వర్గాలకూ ఈ జాబితాలో సముచిత ప్రాతినిధ్యం కల్పించింది. పార్టీ ఏర్పాటు నుంచి కొనసాగుతున్న నేతలకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చినట్టు స్పష్టమౌతోంది.
అన్ని వర్గాలకూ సముచిత ప్రాధాన్యం...
ఆయా ప్రాంతాల్లో ఆయా వర్గాల ప్రాబల్యాన్ని బట్టి ఎవరినీ విస్మరించకుండా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఎంపికలో సమతౌల్యం పాటించినట్టు కనిపిస్తోంది. జాబితాలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కింది. కాపు, బలిజ సామాజిక వర్గానికి అత్యధికంగా 25 శాసనసభ, 5 లోక్‌సభ స్థానాలను కేటాయించటం విశేషం. వెనుకబడిన తరగతులు (బీసీ), మైనారిటీలకు కలిపి మొత్తం 32 శాతం అసెంబ్లీ టికెట్లిచ్చారు. అభ్యర్థులను ప్రకటించిన 170 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 39 స్థానాలు, 24 లోక్‌సభ నియోజకవర్గాల్లో 3 స్థానాలు బీసీలకు కేటాయించారు. బీసీల్లో అన్ని సామాజిక వర్గాలకూ ప్రాధాన్యం కల్పించారు. కాలింగ, వెలమ, తూర్పుకాపు, యాదవ, మత్స్యకార, గవర, శెట్టిబలిజ, పద్మశాలి, గౌడ, బోయ, కురువ, వన్యకాపు తదితర సామాజిక వర్గాలకు చోటు దక్కింది. ముస్లిం మైనారిటీలకు నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఇచ్చారు. ఇప్పటి వరకూ ప్రకటించిన 26 ఎస్సీ రిజర్వుడ్ శాసనసభ స్థానాల్లో 18 చోట్ల మాల సామాజికవర్గానికి, 8 నియోజకవర్గాల్లో మాదిగ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించారు.
ప్రకటించిన మూడు ఎస్సీ రిజర్వుడ్ లోక్‌సభ స్థానాల్లో రెండు చోట్ల మాల వర్గానికి, ఒక చోట మాదిగ వర్గానికి అవకాశం కల్పించారు. ఎస్టీలకు ఒక లోక్‌సభ స్థానం, 7 అసెంబ్లీ స్థానాలు రిజర్వుడ్ సీట్లు ఉన్నాయి. ఇక ప్రకటించిన 24 లోక్‌సభ స్థానాల్లో 5 సీట్లు మహిళలకు కేటాయించడం విశేషం. శాసనభ స్థానాల్లో 11 చోట్ల మహిళలకు టికెట్లు కేటాయించారు. ఈ జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి 52 అసెంబ్లీ, 9 లోక్‌సభ సీట్లు ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి 11 శాసనసభ, 2 లోక్‌సభ టికెట్లు ఇచ్చారు. అలాగే బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ సామాజిక వర్గాలకు కూడా సీట్లు కేటాయించారు. మొత్తం 170 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వుడ్ స్థానాలతో సహా 103 చోట్ల ఎస్సీ, బీసీ, కాపు, బలిజ, మైనారిటీ వర్గాలకు టికెట్లు కేటాయించినట్లయింది.
పార్టీ వెన్నంటి ఉన్న వారికి పెద్దపీట...
మహానేత, తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించే వరకూ ప్రాతినిధ్యం వహించిన పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి తాను ఎన్నికల బరిలోకి దిగాలని జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. పులివెందుల నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈసారి విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచీ వెన్నంటి ఉన్న వారి విజయావకాశాలను పరిగణనలోకి తీసుకుని జగన్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసినట్టు జాబితాలో చోటుచేసుకున్న పేర్లను బట్టి తెలుస్తోంది. అలాగే పార్టీ కోసం అధికారపక్షం నుంచి పదవులను వదులుకుని వచ్చిన వారికి కూడా టికెట్ల కేటాయింపులో సముచిత ప్రాధాన్యం లభించింది. పార్టీలో క్రియాశీలంగా ఉన్న సీనియర్లు, కొత్త రక్తంతో ముందుకు వచ్చిన యువతకు సాధ్యమైనంత మేరకు జగన్ ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండుసార్లు అవిశ్వాస తీర్మానం వచ్చినపుడు పార్టీ నిర్ణయానుసారం ప్రజల పక్షాన నిలబడి వ్యతిరేకంగా ఓట్లు వేసి అనర్హతకు గురైన ఎమ్మెల్యేలందరికీ జగన్ పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాలి రాజేశ్‌కుమార్ మాత్రం తాము స్వచ్ఛందంగా తప్పుకుని తమ కుటుంబీకులకు అవకాశం కల్పించారు.
సామాజిక సమతూకం
Published Tue, Apr 15 2014 3:11 AM | Last Updated on Mon, Oct 22 2018 7:26 PM
Advertisement
Advertisement