అవార్డులు వద్దు.. ఓటింగే ముద్దు
ఎక్కడైనా అవార్డు ఫంక్షన్లు ఉంటే సినీ తారలు తప్పకుండా వాటికి హాజరవుతారు. తమకు అందులో అవార్డు వచ్చినా లేకపోయినా మాత్రం సందడి చేయాలని చూస్తుంటారు. అయితే.. అలనాటి అందాల తార షర్మిలా ఠాగూర్ కూతురు, నేటి తరం హీరోయిన్ సోహా అలీఖాన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. ఈ వారాంతంలో జరిగే అంతర్జాతీయ భారతీయ ఫిలిం అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమంతో పాటు ఈ నెలాఖరులో ఫ్లోరిడాలోని టాంపా బేలో జరిగే మరో కార్యక్రమానికి కూడా తాను వచ్చేది లేదని చెప్పేసింది. ఎందుకంటే.. ఈనెల 24న మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో ఆమె ఓటు వేయాల్సి ఉంది.
ఐఐఎఫ్ఏ కార్యక్రమం 23 నుంచి 26వ తేదీ వరకు జరుగుతుంది. ఇక టాంపా బేలో జరిగే కార్యక్రమానికి చాలామంది సెలబ్రిటీలు ఇప్పటినుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేయడం తన విధి అని, దానికోసం అవార్డుల కార్యక్రమాన్ని వదులుకోవడానికి సిద్ధమేనని సోహా అలీఖాన్ చెప్పింది. అవార్డులు వద్దు, ఓటే ముద్దు అని చెబుతోంది. మిగిలిన తారల గురించి తానేమీ వ్యాఖ్యనించదలచుకోలేదని, వీలైతే మాత్రం అందరినీ ఓట్లేయాలని ప్రోత్సహిస్తానని మాత్రం చెప్పింది.