సోనియా వారి నత్త సవారీ | Sonia riding their snail | Sakshi
Sakshi News home page

సోనియా వారి నత్త సవారీ

Published Sun, Apr 20 2014 1:33 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సోనియా వారి నత్త సవారీ - Sakshi

సోనియా వారి నత్త సవారీ

యూపీఏ-2 ప్రోగ్రెస్ రిపోర్‌‌ట
 
 యూపీఏ... వైఫల్యాల పుట్ట సెకండ్ ఇన్నింగ్స్ అట్టర్ ఫ్లాప్ పూర్తికాలం కొనసాగడమే ఏకైక విజయం పరువు తీసిన వరుస కుంభకోణాలు అధఃపాతాళంలోకి అభివృద్ధి సూచీలు  ప్రధానిగా మన్మోహన్ నిష్క్రియాపరత్వం ఆయన సారథ్యంలో దిష్టిబొమ్మ ప్రభుత్వం బాధ్యతలేని అధికారం చలాయించిన సోనియా
 

 67.7  2013 ఆగస్టు 29న డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా రూ.67.7కి పడిపోవడం యూపీఏ ఆర్థిక విధానాల వైఫల్యానికి పరాకాష్ట
 
 33 రూపాయలు  రోజుకు 33 రూపాయల ఆదాయమున్న వారెవరూ పేదలే కాదు పొమ్మంటూ
 ప్రణాళికా సంఘం క్రూర పరిహాసం చేసింది
 
 1.46 లక్షలు 2004-2012 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 1.46 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు
 చేసుకున్నారు!  94 అత్యంత అవినీతికరమైన 176 దేశాల్లో 2012లో భారత్ 94వ స్థానంలో ఉంది
 
 స్వాతి
 ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం. అంతర్గత భద్రత నేతి బీర. మహిళల రక్షణ గాల్లో దీపం. దేశ రక్షణకు అసలే దిక్కు లేదు. ఆగని రైతు ఆత్మహత్యలు. వెరసి... సామాన్యుని పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి. యూపీఏ పాలనను వైఫల్యాల పుట్ట అన్నా చాలదేమో. రెండు ప్రధాన భాగస్వాములు రాంరాం చెప్పడంతో మైనారిటీలో పడినా ఎలాగోలా పూర్తికాలం నెట్టుకురావడం ఒక్కటే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ-2 వెలగబెట్టిన ఘనత. అది మినహా, ఐదేళ్ల పాలనలో ఎటు నుంచి ఎటు చూసినా అన్నీ వైఫల్యాలే, వరుస కుంభకోణాలే. సామాన్యుడి గోడు ఏమాత్రమూ పట్టని పాలనతో స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత ప్రభావశూన్యమైన ప్రభుత్వంగా యూపీఏ-2 అంతులేని అపకీర్తి మూటగట్టుకున్న వైనంపై ఫోకస్...
 
  1. ఐరాస మానవాభివృద్ధి సూచిక-2013 ప్రకారం ప్రపంచంలోని
     186 దేశాలలో భారత్ స్థానం 136
2.  2012-13లో పారిశ్రామిక వృద్ధిరేటు 2.1 మాత్రమే. 2013-14లో అయితే అది ఏకంగా సున్నాకు చేరింది
3.    జీడీపీలో స్థూల ద్రవ్య లోటు 2011-12లో 5.7 శాతం. 2012-13లో
     5.2 శాతం. ఈ దెబ్బకు ప్రణాళికా వ్యయాన్ని ఏకంగా రూ.90,000 కోట్ల మేరకు కుదించాల్సి వచ్చింది. 2013-14లోనూ ద్రవ్యలోటు 4.6 శాతం. దాన్ని పూడ్చేందుకు ప్రణాళిక వ్యయానికి రూ.79,790 కోట్ల మేరకు కోత పెట్టారు.
5.    2013-14లో బాండ్లపై కేంద్రం చెల్లించాల్సిన వడ్డీ మొత్తమే రూ.3.81 లక్షల కోట్లు! మెచ్యూరైన బాండ్లకు చెల్లించాల్సిన అసలు రూ.1.6 లక్షల కోట్లు. అంతా కలిపి రూ.5.44 లక్షల కోట్లు. అంటే అప్పుల చెల్లింపుల కోసమే అప్పులు చేసే దుస్థితికి దేశాన్ని యూపీఏ దిగజార్చింది.
6.   2004-05లో 3.9 శాతమున్న ద్రవ్యోల్బణం 2012-13లో 8 శాతానికి చేరింది. 2009-10లోనైతే ఏకంగా 13 శాతానికి పెరిగి సామాన్యుని బతుకును అత్యంత దుర్భరంగా మార్చేసింది.
7.    ఉల్లిగడ్డల ధర యూపీఏ హయాంలో 278 శాతం పెరిగింది. కిలో ఉల్లి ఒక దశలో వంద రూపాయలు పలికింది
8.  2003లో రూ.36 ఉన్న పెట్రోల్ ధర 2014 జనవరిలో రూ.80 దాటింది
9.  15-29 ఏళ్ల వయసున్న పట్టభద్రుల్లో నిరుద్యోగిత 13.3 శాతం
10.    {పభుత్వ గణాంకాల మేరకే దేశంలో సగటున ప్రతి 22 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోంది. 2012లోనే దేశవ్యాప్తంగా ఏకంగా 24,923 అత్యాచార ఘటనలు జరిగాయి
11.    2002-2011 మధ్యకాలంలో రూ.21 లక్షల కోట్ల నల్లధనం దేశం దాటిపోయిందని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ వెల్లడించింది
12.    జిహాదీ ఉగ్రవాదం వల్ల 2005 నుంచి నేటి వరకు దేశంలో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు
13.  యూపీఏ సర్కారు పారదర్శకతను కోల్పోవడంతో ఒక దశలో న్యాయస్థానాలే పాలన పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకునేందుకు పూనుకోవాల్సి వచ్చింది!
 
 యూపీఏ సెకండ్ ఇన్నింగ్స్ అట్టర్ ఫ్లాప్  2009-14  పూర్తికాలం కొనసాగడమే ఏకైక విజయం
 
 వైఫల్యాల జాబితా చాలా పెద్దది గనుక ముందుగా యూపీఏ-2 ప్రభుత్వం సాధించిన ఒకే ఒక్క విజయాన్ని గురించి చెప్పుకుని తీరాలి. రెండు ప్రధాన భాగస్వామ్యపక్షాలు వీడిపోయి ప్రభుత్వం మైనారిటీలో పడినప్పటికీ అధికారంలో పూర్తికాలం కొనసాగడం ఒక్కటే యూపీఏ-2 సాధించిన సాఫల్యం. కదలిక లేకుండా కడ దాకా నిస్తేజంగా సాగిన ఈ ప్రభుత్వం స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత ప్రభావశూన్యమైనదైనప్పటికీ... రాజకీయ ఆటుపోట్లన్నింటినీ తట్టుకుని నిలవగలిగింది. నిష్క్రియాపరత్వంతో నిండి అవినీతిలో నిండా మునిగి తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, మధ్యలోనే కుప్పకూలకుండా ఇలా 2014 సార్వత్రిక ఎన్నికల దాకా నెట్టుకురాగలిగిందంటే... ప్రతిపక్షాల అనైక్యత, సంకీర్ణ రాజకీయాల్లోని సంక్లిష్టత, సీబీఐ చేయూత... ఇలా చాలా కారణాలే ఉన్నాయి.
 
 వెన్నాడిన పాపాలు
 
 గత ఐదేళ్లలో ప్రతిపక్షాలు పార్లమెంటును పనిచేయనీయకుండా స్తంభింపజేశాయన్నది యూపీఏ-2 వైఫల్యాలకు ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చే ఏకైక సంజాయిషీ. కానీ నిజానికి ప్రధాని పదవికి పూచిక పుల్లెత్తు విలువ కూడా లేకుండా చేసింది యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కుటుంబం. జవాబుదారీ తనం లేకుండా నిర్నిరోధమైన అధికారాన్ని అనుభవించింది. యాదృచ్ఛిక ప్రధానిగా మన్మోహన్ అందర్లోనూ పలుచనయ్యేందుకు కారణమైంది. గ్రామ సర్పంచులుగా కూడా గెలువలేనివారు, జనసామాన్యంతో సంబంధం లేనివారు, ప్రజల నాడి ఏ మాత్రమూ ఎరగని వారే యూపీఏ ఏలుబడిలో పెత్తనం సాగించారు. ప్రధానే ప్రజలకు నేరుగా ప్రాతినిధ్యం వహించలేకపోవడం, రాజ్యసభ మార్గం ఎంచుకోవడం యూపీఏ ప్రభుత్వ బలహీనతకు నిదర్శనం. మొత్తంమీద యూపీఏ-2 అన్నింటా నష్టాలనే మిగిల్చి కేవలం దిష్టిబొమ్మగా మిగిలిపోయింది. సామాన్యుల గోడును ఏమాత్రమూ పట్టించుకోక అది ప్రజాదరణను పూర్తిగా కోల్పోయిందని ఇటీవలి పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తేటతెల్లమైంది. అయినా యూపీఏ మేల్కోలేదు. ఎన్డీఏ ప్రభుత్వం మాదిరిగానే ‘భారత్ నిర్మాణ్’ పేరుతో రూ.180 కోట్లతో భారీ ప్రచార పటాటోపానికి తెరతీసింది.
 
 ప్రధాని పదవికి పరాభవం
 
 ఇక ప్రధానిగా మన్మోహన్ పూర్తిగా విఫలమయ్యారంటే అందుకు కారకులు సోనియా, ఆమె తనయుడు రాహుల్ గాంధీయే. ప్రధాని కార్యాలయ విధుల్లో సోనియా తదితరుల జోక్యం గురించి ప్రధాని మీడియా వ్యవహారాల మాజీ సలహాదారు సంజయ్ బారు ఇటీవల వెలువరించిన పుస్తకం  పలు విస్మయకరమైన అంశాలను వెల్లడించింది. అణు ఒప్పంద వివాద సమయంలో సోనియా తీరుపై మన్మోహనే తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం వంటివి ఇప్పుడు వెలుగు చూశాయి. నేర చరితుల ఆర్డినెన్స్ వ్యవహారంపై రాహుల్ వ్యవహరించిన తీరు ప్రధాని పదవినే గాక కేబినెట్‌ను కూడా కించపరిచింది. అప్పుడు కూడా మన్మోహన్ సింగ్ కిమ్మనకుండా రాజీ పడిపోవడం అందరినీ నివ్వెరపరిచింది. ఆయన సాగిలపాటు ధోరణి వల్లే సోనియా, రాహుల్ సూపర్ పీఎంలుగా జవాబుదారీతనం లేని అధికారం అనుభవించారు.మన్మోహన్‌ను అసమర్థుడిగా చిత్రిస్తూ ‘ది అండర్ అచీవర్’ శీర్షికతో  టైమ్ మేగజీన్ 2012లో కవర్ పేజీ వ్యాసమే ప్రచురించింది!
 
 అంతులేని అవినీతి
 
 అంతులేని అవినీతికి యూపీఏ చిరునామాగా మారింది. దాని హయాంలో జరిగిన టెలికాం, బొగ్గు తదితర భారీ కుంభకోణాలు ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయడమే కాక ప్రపంచ దేశాల్లో భారతప్రతిష్టను మసకబార్చాయి. బొగ్గు కుంభకోణంలో ఖజానాకు రూ.1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ బయటపెట్టింది. ఈ బొగ్గు కుంభకోణంపై నేరుగా సుప్రీంకోర్టు నిర్దేశాల మేరకు సీబీఐ దర్యాప్తు సాగుతుండగానే పలు కీలక ఫైళ్లు మాయమయ్యాయి. దర్యాప్తు నివేదికలో 20 శాతాన్ని కేంద్రం మార్చిందంటూ సుప్రీంకే సీబీఐ విన్నవించుకుంది. దర్యాప్తును ప్రభావితం చేయబోయి చివరికి కేంద్ర న్యాయ మంత్రి అశ్వినీకుమార్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కేంద్రం పంజరంలో చిలుకలా సీబీఐ మారిందని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  రైల్వేబోర్డు పదవులను అమ్ముకున్న కుంభకోణంలో రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ కూడా రాజీనామా చేశారు. ఢిల్లీలో 4,800 ఎకరాల విమానాశ్రయ భూములను 58 ఏళ్ల పాటు జీఎంఆర్‌కు కారుచౌకగా కట్టబెట్టారు. తద్వారా ఆ కంపెనీకి కలిగే లబ్ధి ఏకంగా రూ.88,337 కోట్లు! మధ్యప్రదేశ్ సాసన్ విద్యుత్కేంద్రం కోసం కేటాయించిన గనుల తాలూకు బొగ్గును మరో లాభదాయక ప్లాంటుకు తరలించేందుకు రిలయన్స్‌కు కేంద్రం ఇచ్చిన అనుమతి వల్ల దానికి రూ.29,003 కోట్ల మేరకు లబ్ధి కలుగుతుంది. ఇక టట్రా మిలటరీ ట్రక్ స్కామ్‌ను స్వయంగా ఆర్మీ చీఫ్ వీ కే సింగ్ బయటపెట్టారు. కామన్‌వెల్త్ గేమ్స్ స్కాంలో కాంగ్రెస్ నేత సురేశ్ కల్మాడీ జైలుకు వెళ్లారు. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ముడుపుల కుంభకోణంలో సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పాత్ర ఉందంటూ ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు అక్కడి కోర్టులో నోట్ సమర్పించడం సంచలనం కలిగించింది. అగస్టా స్కాంలో ముడుపుల బాగోతం నిజమేనని 2013 లో రక్షణ మంత్రి ఏ కే ఆంటోనీ ధ్రువీకరించారు. చివరికి అగస్టా డీల్ రద్దు చేయాల్సి వచ్చింది.
 
 మహిళలకు రక్షణ కరువు
 
 యూపీఏ పాలనలో మహిళలకు కనీస రక్షణ కరువైంది. ఢిల్లీలో 2012 డిసెంబర్‌లో వైద్య విద్యార్థినిని బస్సులో తిప్పుతూ ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన హేయమైన ఘటన అందరినీ నిశ్చేష్టులను చేసింది. అత్యాచారాలను అరికట్టలేని కేంద్రం, దానిపై వెల్లువెత్తిన జనాగ్రహంపై మాత్రం విరుచు కుపడింది. దేశంలో 2012లోనే 24,923 అత్యాచార ఘటనలు జరిగాయి. సగటున ప్రతి 22 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోంది. కేంద్రం కొలువుదీరి ఉండే ఢిల్లీలోనే అత్యధికంగా ప్రతి 18 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు ఘోషిస్తున్నాయి.
 
 ఆర్థికం... అస్తవ్యస్తం
 
 యూపీఏ-1 హయాంలో జరిగిన కుంభకోణాలు యూపీఏ-2ను కూడా వెంటాడాయి. వరుస కుంభకోణాలు ప్రభుత్వం పరువు తీశాయి. అవినీతి లక్షల కోట్లకు విస్తరించింది. దేశ చరిత్రలోనే సత్వర వృద్ధి రేటు (7.5) నమోదైన దశాబ్దమిది. అంతేకాదు, అంకెల గారడీని కాసేపు పక్కన బెడితే ప్రభుత్వం లెక్కల ప్రకారం పేదరికంలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. 2004-05లో టెండూల్కర్ నిర్వచనం ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాభా 37 శాతం కాగా, 2011-12లో ఇది 22 శాతానికి తగ్గింది. ఇంత అనుకూలత కూడా యూపీఏ-2 దెబ్బకు ఎందుకూ పనికిరాకుండా పోయింది. గొప్ప ఆర్థికవేత్తగా పేరున్న మన్మోహన్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ మున్నెన్నడూ లేనంతగా మందగించింది. ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిక- 2013 ప్రకారం ప్రపంచంలోని 186 దేశాల్లో భారత్ స్థానం 136. ఇక జీడీపీలో  స్థూల ద్రవ్య లోటు 2011-12లో 5.7 శాతం. 2012-13లో 5.2 శాతం. దీన్ని పూడ్చుకునేందుకు ఏకంగా రూ. 90,000 కోట్ల మేరకు ప్రణాళికా వ్యయాన్ని కుదించాల్సిన పరిస్థితి. జీడీపీలో కరెంటు ఖాతాల లోటు 2012-13లో -4.8 శాతం. ఏ దేశమైనా బాండ్లను విక్రయించడం ద్వారా రుణాలను సేకరిస్తుం ది. భారతదేశంలో మెచ్యూర్ అయిన బాండ్లకు  అసలుతో పాటు వడ్డీ చెల్లించాలంటే ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. దీంతో సదరు బాండ్లకు జరిపే చెల్లింపుల కోసం తిరిగి కొత్త బాండ్లను విడుదల చేసే స్థితికి దాపురించింది. 2013- 2014 ఆర్థిక సంవత్సరానికి బాండ్లపై ప్రభుత్వం చెల్లించవలసిన వడ్డీ మొత్తం  రూ. 3,80,067 కోట్లు. మెచ్యూర్ అయిన బాండ్లకు ప్రభుత్వం చెల్లించవలసిన అసలు రూ. 1,63,200 కోట్లు. అంతా కలిపి రూ. 5,43,267 కోట్లు!
 
 పేదల లెక్కలపై క్రూర పరిహాసం

 
 బతుకుదెరువు కరువై పేదలు ఒకవైపు అల్లాడుతుంటే రోజుకు రూ.33 కంటే తక్కువ సంపాదన ఉన్నవారు మాత్రమే పేదలంటూ ప్రణాళికా సంఘం (2013 జూలై) క్రూరపరిహాసం చేసింది. అంతకు మించి సంపాదించే వారంతా సంపన్నులేనన్నమాట. సబ్సిడీలకు కత్తెర వేసేందుకు ఇలాంటి నిస్సిగ్గు నిర్వచనాలను ప్రచారంలోకి తెచ్చారు. మన రాష్ట్రంలోనైతే కరెంటు చార్జీల పేరుతో రూ.30 వేల కోట్లకు పైగా ప్రజలపై పెను భారం మోపారు. బస్సు చార్జీలు వరుసగా పెంచుతూ పోయారు. రైలు చార్జీలనూ 22 శాతం పెంచేశారు.
 
 అల్లుడి గిల్లుడు
 
 ఎల్‌ఐసీ హౌసింగ్ లోన్ స్కామ్, ఎయిరిండియా స్కామ్, కేజీ బేసిన్ చమురు కుంభకోణం, సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం, రక్షణ భూ కుంభకోణం, అక్రమ రుణ మాఫీ... ఇలా చెబుతూ పోతే యూపీఏ హయాం తాలూకు కుంభకోణాల చిట్టా ముగిసేది కాదు.
 
 యూపీఏ-2 వైఫల్యాల దెబ్బకు దాదాపుగా అన్ని రంగాలూ నిస్తేజమయ్యాయి. తెలంగాణ  ఏర్పాటు వంటి ముఖ్యమైన అంశాల్లో సైతం చిట్టచివరి దాకా సాగదీసి సత్వర నిర్ణయాలు తీసుకోలేని అసమర్థతకు తార్కాణంగా మిగిలిపోయింది. వెరసి రాజకీయంగాను, పాలనాపరంగా కూడా దేశానికి తీరని నిర్వేదాన్నే మిగిల్చింది యూపీఏ. ప్రస్తుతం మన దేశం చేస్తున్న అప్పు సగటును గంటకు రూ.68 కోట్లు. అంటే రోజుకు రూ.1,632 కోట్లు. ఇందులో రూ.1,169 కోట్లు వడ్డీ చెల్లింపులకే చెల్లిపోతోంది
 
 అదుపు తప్పిన ద్రవ్యోల్బణం

 అదుపు లేని ధరలు యూపీఏ హయాంలో సామాన్యుడికి చుక్కలు చూపాయి. 2004-05లో వినియోగదారీ ధరల సూచిలో 3.9 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 2012-13లో 8 శాతానికి చేరింది. 2009-10లోనైతే ఏకంగా 13 శాతానికి పెరిగి బతుకును దుర్భరం చేసింది. చట్టబద్ధమే కాని ఆధార్ కార్డు పేరుతో జనాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. సబ్సిడీ సిలిండర్లకు ఆధార్‌కు ముడి పెట్టారు. కోర్టులు కూడా ఆధార్‌పై ప్రభుత్వం తీరును తప్పుబట్టాయి.
 
 రైతు ఆత్మహత్యలు

 
 అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2004-12 మధ్య దేశవ్యాప్తంగా 1.46 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సగటున ఏటా 16,264 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల సగటున రోజుకు 44 మంది అన్నదాతలు ఉసురు తీసుకుంటున్నారు. రైతు ఆత్మ హత్యల రేటు (ఎఫ్‌ఎస్‌ఆర్) ప్రకారం ప్రతి లక్ష మంది రైతుల్లో 16.3 శాతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు 2011లో వెల్లడైంది. ఇక ఉపాధి కల్పనైతే నిజంగానే ‘కల్పన’గా మారింది. నిరుద్యోగం ఏటేటా పెరుగుతూ పోయింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాల ప్రకారం భారత్‌లో 2011లో నిరుద్యోగం 3.5 శాతం. 2012లో 3.6 శాతం. 2013లో 3.7 శాతం. 2014లో 3.8 శాతానికి చేరుతుందని అంచనా. 15-29 ఏళ్ల వయసున్న పట్టభద్రుల్లో నిరుద్యోగిత 13.3 శాతం! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ మేన్ పవర్ రీసెర్చ్ ప్రకారం 2009-10లో 20.76 లక్షల ఉపాధి అవకాశాలు మాత్రమే దొరికాయి. జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం 2004 నుంచి 2012 దాకా అదనంగా కల్పించిన ఉద్యోగాలు కేవలం 1.54 కోట్లు మాత్రమే.
 
 దేశ రక్షణలోనూ సాచివేతే
 
 రక్షణ రంగంలో కూడా యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పాకిస్థాన్ సైన్యం 2013 జనవరిలో నియంత్రణ రేఖ దాటివచ్చి మన సైనికులను చంపి తలలు నరికి కవ్వించినా సరిగా స్పందించలేదు. చైనా సైనికులు 19 కిలోమీటర్లు లోనికి చొచ్చుకొచ్చి లడఖ్‌లోని డెప్సాంగ్ లోయలో టెంట్లు వేసుకుని దేశ సార్వభౌమత్వానికి సవాలు విసిరినా దీటుగా బదులివ్వలేకపోయింది. అలాగే 2005 నుంచి దేశంలో ఉగ్రవాదం వల్ల వెయ్యి మందికి పైగా మరణించారు. 2009-2013 మధ్య దేశంలో 21 ఉగ్రవాద దాడులు జరిగాయి. మావోల దాడులూ పెరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో 75 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు బలయ్యారు. 2009-13 మధ్య మావోల దాడుల్లో 2,500 మంది మరణించారు. వారి అణచివేతపై కేంద్రానికే దృఢసంకల్పం లేకపోవడంతో అధికారులూ అంటీముట్టనట్టు వ్యవహరించారు. కేంద్ర బలగాలలో కీలక స్థానాలెన్నో ఖాళీగా ఉండిపోయాయి. గత నాలుగేళ్లలో 16,000 మంది జవాన్లు సీఆర్‌పీఎఫ్‌ను వీడారంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement