విద్యుత్ శాఖకు టీడీపీ షాక్!
టెక్కలి, న్యూస్‌లైన్ : టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆగడాలు ప్రత్యర్థి పార్టీలకే పరిమితం కావటం లేదు. బాధితుల జాబితా లో ప్రభుత్వ శాఖలూ చేరుతున్నాయి. తాజాగా ఆ పార్టీ నేతల వైఖరితో ట్రాన్స్‌కో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గ నేత దౌర్జన్య పూరిత వైఖరికి భయపడి కొద్దిపాటి చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు. దీనిపై సామాన్య జనం మండిపడుతున్నారు. కేవలం వంద.. రెండు వందల రూపాయల బిల్లు చెల్లించటంలో జాప్యం జరిగితే ఇంటిమీద పడి విద్యుత్ కనెక్షన్ తొలగించే అధికారులు వేలాది రూపాయల బిల్లు కట్టకుండా తిప్పిస్తున్న టీడీపీ వారిపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని నిలదీస్తున్నారు.
ఇదీ సంగతి..
పార్టీ నియోజకవర్గ కార్యాలయం కోసం టీడీపీ నేతలు పట్టణంలోని రోటరీ నగర్‌లో ఒక ఇంటిని దాదాపు రెండేళ్ల కిందట అద్దెకు తీసుకున్నారు. దీనికి 3933 సర్వీస్ నంబర్‌తో విద్యుత్ కనెక్షన్ ఉంది. గత ఏడాది అక్టోబర్ నెల నుంచి ఈ సర్వీస్ విద్యుత్ బిల్లును టీడీపీ నేతలు చెల్లించటం లేదు. బకాయి మొత్తం 25,174 రూపాయలకు చేరినా కిమ్మనటంలేదు. దీంతో ఇటీవల కార్యాలయానికి వెళ్లిన ట్రాన్స్‌కో అధికారులు అక్కడి కనెక్షన్ కేటగిరి-1 లో కొనసాగుతున్నట్టు గుర్తించి కంగుతిన్నారు. వాస్తవానికి ఇది కేటగిరి-2లో ఉండాలి. ఈ నేపథ్యంలో థెఫ్టింగ్ మాల్ ప్రాక్టీస్(టీఎంపీ) కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. కఠిన చర్యలు తీసుకోవటానికి వెనకడుగు వేస్తున్నారు. నియోజకవర్గ నేత తీరుకు భయపడే వారిలా వ్యవహరిస్తున్నారని సమాచారం. మరోవైపు.. ఎలాగోలా సర్దుబాటు చేసి బకాయి మొత్తం తగ్గించాలని ఆ నేత ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన స్థానికులు ట్రాన్స్‌కో అధికారుల తీరుపై మండిపడుతున్నారు. సాధారణ జనం సకాలంలో బిల్లు కట్టకపోతే వెంటనే కనెక్షన్ కట్ చేసే అధికారులు టీడీపీ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
నోటీసులిచ్చినా స్పందించలేదు..
రోటరీనగర్‌లోని 3933 సర్వీసు నంబర్ కనెక్షన్‌కు సంబంధించి రూ.25,174 బకాయి ఉంది. టీడీపీ కార్యాలయం ఉన్న ఆ ఇంటికి గతంలో కేటగిరి-1 కింద విద్యుత్ సరఫరా జరిగేది. అధికారుల తనిఖీల్లో ఈ విషయం తెలియడంతో కేటగిరి-2కు మార్చాం. బకాయి ఎక్కువగా ఉండటంతో టీఎమ్‌పీ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశాం. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. విషయాన్ని డీఈ దృష్టికి తీసుకువెళ్లాం.
-ఎ.వెంకటరమణ, విద్యుత్ శాఖ ఏఈ, టెక్కలి.