భయోత్పాతమే లక్ష్యంగా.. కె-గ్యాంగ్!
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: జిల్లాను రౌడీరాజ్యం చేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో మొసలి కన్నీరు కార్చిన టీడీపీయే వాస్తవానికి రౌడీ రాజ్యానికి ప్రాణం పోసింది. జిల్లా పార్టీపై పెత్తనం చెలాయిస్తున్న ఒక కుటుంబమే కె-గ్యాంగ్ పేరుతో కొన్ని బృందాలను ఏర్పాటు చేసి.. జిల్లా ప్రజలపైకి, ప్రత్యర్థి పార్టీల పైకి ఉసిగొల్పింది. ఓటర్లలో భయోత్పాతం సృష్టించి.. ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా ఈ గ్యాంగ్ స్థానిక ఎన్నికల నాటి నుంచే జిల్లాలో ‘మూడు దాడులు.. ఆరు బెదిరింపులు’ అన్న రీతిలో విశృంఖలంగా వ్యవహరి స్తోంది. పార్టీ సిద్ధాంతాలు.. ప్రజలకు ఏం చేస్తామన్న అంశాలను గాలికొదిలేసి.. కేవలం అరాచకంతోనే అందలం ఎక్కాలని ఆరాటపడుతోంది. ఇందుకోసం కొందరు టీడీపీ నేతలు గూండా తండాలకు కార్యకర్తల ముసుగు తొడిగి ఊళ్లపైకి వదులుతున్నారు. పార్టీకి ప్రతికూలంగా ఉన్న ప్రాంతాలు, ఎదురుతిరిగిన వ్యక్తులపై భౌతిక దాడులకు పురిగొల్పుతున్నారు. సుమారు రెండు దశాబ్దాలపాటు టీడీపీకి కంచుకోటగా మార్చి, ఆదరించిన జిల్లా ప్రజలపైనే రౌడీ అస్త్రం ప్రయోగిస్తున్నారు.
స్థానిక ఎన్నికలతోనే మొదలు
జిల్లాలో టీడీపీకి జనాదరణ తగ్గిపోతుండటంతో ఆ పార్టీ నేతల్లో నెలకొన్న నిరాశ.. క్రమంగా అక్కసుగా మారింది. దాంతో దండ ప్రయోగమే శరణ్యమన్న నిర్ణయానికి వచ్చారు. దివంగతుడైన ఓ అగ్రనేత తమ్ముడు, ఆయన పుత్రరత్నం ఆలోచనల నుంచి ఈ ‘ కె-గ్యాంగ్’ పురుడు పోసుకుంది. స్థానిక ఎన్నికల నుంచి మొదలుకొని ప్రతి ఎన్నికల్లోనూ ఎలాగైనా పట్టు నిలుపుకునేందుకు ఈ గ్యాంగ్ దాడులు, బెదిరింపుల పర్వానికి తెర తీసింది. ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట, రాజాం, పాలకొండ తదితర నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలపైనా.. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్లపైనా విరుచుకుపడటం ప్రారంభించింది.
ప్రత్యేక శిక్షణతో రంగంలోకి..
ప్రత్యేకమైన విధులు, శిక్షణతో కె-గ్యాంగ్‌ను తీర్చిదిద్దారు. టీడీపీ కార్యకర్తల ముసుగులో దాడులు చేయడమే వీరి ప్రధాన విధి. టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్నాయుడు, టెక్కలి అభ్యర్థి కె.అచ్చెన్నాయుడులతోపాటు వారి కోటరీలో ఉన్న పార్టీ అభ్యర్థులకు ప్రతికూలంగా ఉన్న ప్రాంతాల కు ప్రచారం పేరుతో వెళ్లడం.. ఓటర్లను ప్రలోభపరచడం, అడ్డుతగిలిన వారిని బెదిరించడం.. అప్పటికీ లొంగకపోతే భౌతిక దాడులకు పాల్పడటం వీరి బాధ్యతలు. అందుకోసం కె-గ్యాంగ్ సభ్యులను ప్రత్యేక ప్యాకేజీలతో నియమించినట్లు తెలుస్తోంది.
విషయమై ఓ టీడీపీ నేత వద్ద ప్రస్తావించగా.. అయ్యా మాకు ఆ గ్యాంగులకు ఎటువంటి సంబంధం లేదు. బాబాయ్- అబ్బాయ్‌ల పర్యవేక్షణలోనే అవి పని చేస్తున్నాయి.. అని చెప్పారు. ప్రధానంగా టెక్కలి, శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, నరసన్నపేట, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో ఓటర్లను నయానో.. భయానో.. తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ఇవి పని చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, సామాన్య ఓటర్లు, చివరికి సాక్షి విలేకరులను బెదిరింపులకు, దాడులకు గురి చేస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే ఇంతటి దారుణాలకు ఒడిగడుతున్న టీడీపీ నేతలు.. ఇక ఎన్నికై ప్రజాప్రతినిధుల అవతారమెత్తితే.. ఇంకెన్ని ఆగడాలకు, అరాచకాలకు పాల్పడతారో.. ప్రజలను ఎన్ని అగచాట్లకు గురి చేస్తారో తలచుకుంటేనే భయమేస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ దాడుల పరంపర
ఏప్రిల్ 6న ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా సంతకవిటి మండలంలో రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు, బెదిరింపులకు దిగారు. వాసుదేవపట్నం, కొండగూడెం, గరికిపాడు తదితర గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగారు. ఏప్రిల్ 7న సారవకోట మండలం అలుదు గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుల ప్రచారాలను అడ్డుకొని దాడులకు పాల్పడ్డారు. అదే రోజు గారలో కింజరాపు రామ్మోహన్‌నాయుడు వర్గీయులు మండల వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు దిగారు. ఏప్రిల్ 11న పొందూరు మండలం నందివాడలో ప్రాదేశిక పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేశాయి.
అదే రోజు టెక్కలిలో పోలింగ్ కేంద్రం వద్ద అచ్చెన్నాయుడు వర్గీయులు రిగ్గింగ్‌కు ప్రయత్నించారు. అడ్డుకున్న వారిపై దాడికి యత్నించారు. ఏప్రిల్ 20న నందిగాం మండలంలో సాక్షి విలేకరి తిరుపతిరావును టెక్కలి టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు అనుచరులు బెదిరించారు. దాడికి ప్రయత్నించారు. అదే రోజు టెక్కలి నియోజకవర్గం అయోధ్యపురం గ్రామానికి చెందిన బగాది హరి అనే యువకుడిపై ముగ్గురు టీడీపీ కార్యకర్తలు, అచ్చెన్నాయుడు అనుచరులు హత్యాయత్నం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న వీరఘట్టం సాక్షి విలేకరి సింహాచలాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా బెదిరించారు. ఆయనపై దాడికి ప్రయత్నించారు.
ఏప్రిల్ 29న పొందూరు మండలం దల్లిపేటలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం రోడ్డుషో నిర్వహిస్తుండగా కాన్వాయ్‌లో ఉన్న సర్పంచ్ మజ్జి గోపాలకృష్ణ వాహనంపై కె-గ్యాంగ్ సభ్యులు దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. డ్రైవర్‌పై చేయి చేసుకున్నారు. సర్పంచ్ అంతు చూస్తామని బెదిరించారు. మే 1న సంతబొమ్మాళి మండలం ఆకాశ లక్కవరం, సీరపువానిపేట గ్రామాల్లో కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన బృందం ప్రచారానికి వెళ్లగా అడ్డుకున్న థర్మల్ ప్రభావిత గ్రామాల మహిళలపై దారుణంగా భౌతిక దాడులకు దిగారు. మహిళలను బైకులతో ఢీకొట్టించి, ఈడ్చిపారేసి మరీ ప్రచారానికి తరలివెళ్లారు.