‘కళా’వెళ..!
‘కళా’వెళ..!
Published Sun, Apr 6 2014 3:54 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా టీడీపీపై పట్టు సాధించాలన్న పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు ఆశలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అడియాసలు చేశారు. అధినేతే మాట తప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కళా కూరుకుపోయారు. ఎర్రన్నాయుడు హఠాన్మర ణం.. తమ్మినేని సీతారాం రాజీనామాతో జిల్లా టీడీపీకి పెద్దదిక్కు లేకుండాపోయింది. దాంతో కళా వెంకట్రావును జిల్లా పార్టీ పెద్దరికం అప్పగించాలని చంద్రబాబు భావించారు. తద్వారా పార్టీలో 15 ఏళ్లుగా ప్రాధాన్యానికి నోచుకోని కాపు సామాజికవర్గాన్ని గుర్తించినట్లవుతుందని కూడా ఆయన చెప్పకొచ్చారు. కానీ కింజరాపు కుటుంబం మోకాలడ్డింది. ఈ ప్రతిపాదనకు ససేమిరా అంది. అసలు తాము కళా వెంకట్రావును సీనియర్ నేతగానే గుర్తించమనే రీతిలో వ్యవహరించింది. అక్కడితో ఆగకుండా ఆయన పోటీ చేయనున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే ప్రతిబంధకాలు సష్టించింది. తమ సన్నిహితుడైన ఎచ్చెర్ల మండలానికి చెందిన పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీని దీనికి ఆయుధంగా వాడుకుంది. కళా ఎచ్చెర్ల దాటి వెళ్లలేని పరిస్థితి కల్పించింది. కళాకు ఏమాత్రం ప్రాధాన్యమిచ్చినా తాము సహా యనిరాకరణ చేస్తామని కింజ రాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌లు చంద్రబాబుకు తేల్చిచెప్పారు. దాంతో చంద్రబాబు పూర్తిగా వెనక్కి తగ్గారు. ఇటీవల నిర్వహించిన ప్రజాగర్జన సభలో కనీసం కళా పేరును కూడా ప్రస్తావించడానికి సాహసించలేకపోయారు. ఈ పరిణామాలతో కళా వెంకట్రావు పూర్తిగా నీరుగారిపోయారు.
జెడ్పీ అభ్యర్థిత్వానికి మోకాలడ్డు
జెడ్పీ చైర్‌పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ఆ పదవిపై కళా వర్గం కన్నేసింది. ఆయన తన మరదలు, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ మణాళినిని మరోసారి ఆ కీలక పదవికి పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయాలని భావించారు. కిమిడి గణపతి కూడా తన భార్య మణాళినికి అవకాశం ఇస్తే తమ కుటుంబంతోపాటు తూర్పుకాపు సామాజికవర్గాన్ని పార్టీకి అనుకూలంగా కూడగడతానని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. కానీ కింజరాపు వర్గం దీనికి ససేమిరా అంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు ఏమాత్రం లేవని తెలిసినా మణాళిని పేరును చైర్‌పర్సన్ పదవి కోసం పరిశీలించడానికి కూడా అంగీకరించలేదు. ఈసారి కూడా అచ్చెన్నాయుడు తమ తరపున చౌదరి బాబ్జీనే ప్రయోగించారు. బాబ్జీ కుమార్తె చైతన్యను జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఈ మేరకు అధినేత చంద్రబాబుపై తమదైన శైలిలో ఒత్తిడి తెచ్చారు. దాంతో మరోసారి చంద్రబాబు కింజరాపు కుటుంబ ఒత్తిడికి తలొగ్గారు. కళాను కనీసం సముదాయించేం దుకు కూడా ప్రయత్నించలేదు. మణాళిని అభ్యర్థిత్వానికి ఆమోదం లభించలేదు.. సరికదా చంద్రబాబు కనీసం తమను పిలిచి మాట్లాడకపోవడంతో కళా తీవ్ర నిస్పహలో కూరుకుపోయారు. దాంతో జి.సిగడాం జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మణాళిని గత్యంతరం లేని పరిస్థితుల్లో తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
రగిలిపోతున్న సామాజికవర్గం
చంద్రబాబు వైఖరితో జిల్లా టీడీపీలోని తూర్పుకాపు సామాజిక వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమకు పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదన్న ఆవేదన వారిలో కట్టలు తెంచుకుంటోంది. జిల్లాలో పాలకొండ, రాజాం, ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాల్లో తూర్పుకాపు సామాజికవర్గం అత్యధికంగా ఉంది. కానీ రాజాం, పాలకొండ నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. దాంతో ఎచ్చెర్ల, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలే మిగిలాయి. వాటిలో కూడా పాతపట్నం నియోజకవర్గానికి క్షత్రియ వర్గానికి చెందిన శత్రుచర్ల విజయరామరాజును చంద్రబాబు అభ్యర్థిగా నిర్ణయించారు. ఈ పరిణామం తూర్పుకాపు సామాజికవర్గానికి తీవ్ర అసంతప్తి కలిగించింది. కనీసం జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్ అభ్యర్థిత్వానికి తమ వర్గానికి చెందిన నేత పేరును పరిశీలిస్తారని భావించారు. కానీ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు ఆ ప్రతిపాదనను కూడా అడ్డుకున్నారు. దాంతో టీడీపీలోని తూర్పుకాపు వర్గీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామరావు హయంలో పార్టీపై తూర్పుకాపు వర్గమే ఆధిపత్యం చెలాయించింది. కానీ చంద్రబాబు ఆ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. 1995 నుంచి ఇంతవరకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నా కూడా చంద్రబాబు ఆదే వైఖరి కొనసాగిస్తున్నారు. దాంతో ఆ వర్గీయులు మండిపడుతున్నారు. ‘ఇక లాభంలేదు... మా తడాఖా చూపిస్తాం’అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో మరి!
Advertisement