సొంత గూటిలో సెగలు
Published Tue, Apr 8 2014 1:36 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు తయారైంది జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీల పరిస్థితి. అసలే నియోజకవర్గంలో అంతంత మాత్రంగా ఉన్న వారి రాజకీయ పలుకుబడిని ప్రాదేశిక ఎన్నికలు మరింత దిగజారుస్తున్నాయి. నియోజకవర్గం సంగతి అటుంచితే.. సొంత మండలాల్లోనే పట్టు లేదన్న వాస్తవం బట్టబయలవుతోంది. ఒకప్పడు కంచుకోటలుగా ఉన్న సొంత మండలాలే బీటలు వారుతున్నాయన్న గుబులు కొందరిదైతే.. సొంత మండలంలోనే నిలదొక్కుకోలేక బిక్కచచ్చిపోతున్నవారు ఇంకొందరు... వెరసి ఈ నెల 11న జరగనున్న రెండో దశ ప్రాదేశిక ఎన్నికల సమరం జిల్లాలో కనీసం నలుగురు టీడీపీ ఇన్‌చార్జీలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.
కింజరాపు కోటకు బీటలు
కింజరాపు కుటుంబానికి ఇంతకాలం దన్నుగా ఉన్న కోటబొమ్మాళి మండలంలో టీడీపీ ప్రాభవం గత చరిత్రగా మిగిలిపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నా యి. టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి రామ్మోహన్‌నాయుడులు సొంత మండలంలోనే గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. టెక్కలి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఈ మండలంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయన రూపొందించిన పక్కా కార్యాచరణతో ప్రచారంలో పార్టీ దూసుకెళ్తోంది. పల్లెల్లో వైఎస్సార్‌సీపీ పట్ల సహజంగానే ఉన్న ఆదరణకు తోడు పకడ్బందీ వ్యూహం జతకాడటంతో మండలంలో సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి బడాన ముర ళీ టీడీపీ అభ్యర్థి నంబాళ్ల పద్మజ కంటే ముందంజలో ఉన్నారు. మండలంలోని 21 ఎమ్పీటీసీ స్థానాల్లోనూ 13 నుంచి 15 వరకు వైఎస్సార్‌సీపీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కింజరాపు కుటుంబంలో ఆందోళన పెరుగుతోంది.
కునుకు కరువైన కూన
ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కూన రవికుమార్ పరిస్థితీ ఇలాగే ఉంది. సొంత మండలమైన పొందూరులోనే ఆయన చాపకిందకు నీళ్లు చేరాయి. ఆయన అసెంబ్లీ స్థానంపై కన్నేస్తే వైఎస్‌ఆర్‌సీపీ పొందూరులోనే పొగబెడుతుండటం ఆయనకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. రవిని సొంతింట్లోనే దెబ్బతీయాలన్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం వ్యూహం సత్ఫలితా లు ఇస్తోంది. పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి మజ్జి రాధారాణి టీడీపీ అభ్యర్థి లోలుగు శ్రీరాములునాయుడుకంటే ముందంజలో ఉన్నారు.మండలంలోని ఎమ్పీటీసీ స్థానాల్లో కూడా వైఎస్సార్ సీపీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 21 ఎమ్పీటీసీల్లో కనీసం 14 వరకు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో కూన రవి ఆత్మరక్షణలో పడిపోయారు. ఇతర మండలాల కంటే ముందు సొంత మండలాన్ని కాపాడుకునేదెలా అని మథనపడుతున్నారు.
వీరఘట్టంలో ఫ్యాన్ జోరు నిమ్మకకు సన్నగిల్లుతున్న నమ్మకం
పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అసలే అనుభవం లేదు.. సరైన మార్గనిర్దేశం చేసేవారూ లేరు.. దీనికితోడు సొంత మండలమైన వీరఘట్టంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజ నం.. జయకృష్ణను హడలగొడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం, సమన్వయకర్త వి.కళావతిల సొంత మండలం కూడా ఇదే కావడంతో వారిద్దరూ ఈ మండలంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దాంతో ఆ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి దమలపాటి భారతి భారీ ఆధిక్యంతో విజయం సాధించడం దాదాపు ఖాయమని స్పష్టమైంది. టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కందాపు జ్యోతి ఏమాత్రం పోటీ ఇచ్చే స్థితిలో లేరు. మొత్తం 19 ఎమ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ కనీసం 12 స్థానాలు గెలుచుకోవచ్చని స్పష్టమవుతోంది. మరోవైపు టీడీపీలో అంతర్గత కుమ్మకులాటలతోనే ఆ పార్టీ ఇన్‌చార్జి జయకృష్ణకు సరిపోతోంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన నేతలు పార్టీపై పెత్తనం చెలాయిస్తుండటంతో విభేదాలు భగ్గుమన్నాయి. వీటిని పరిష్కరించే అనుభవంగానీ, లౌక్యంగానీ జయకృష్ణకు లేవు. దాంతో ప్రాదేశిక ఎన్నికల్లో టీడీపీ చతికిలపడనుందని స్పష్టమవుతోంది.
కవిటిలో అశోక్‌కు కష్టమే
ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి బెందాళం అశోక్‌కు సొంత మండలం కవిటి కొరుకుడుపడటం లేదు. అనుభవ లేమి... ఆర్థిక ఇబ్బందులతో ఆశోక్ ప్రాదేశిక ఎన్నికల్లో చతికిలపడుతున్నారు. ‘మేం సీనియర్లం...నువ్వు మాకు చెప్పేదేమిటి’ అనే రీతిలో పార్టీ నేతలు ఎదురు తిరుగుతున్నారు. మరోవైపు సొంతింటి ప్రత్యర్థి గౌతు శివాజీ పెడుతున్న ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. దాంతో కవిటి మండలంలో ప్రాదేశిక సమరం నెగ్గుకురావడం అశోక్‌కు కత్తిమీద సాము లా మారింది. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నర్తు రామారావు సొంత మండలం కూడా ఇదే కావడం కూడా అశోక్‌కు ప్రతికూలంగా పరిణమించింది. రామారావు జోరును ఆయన తట్టుకోలేకపోతున్నారు. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి సనపల శశికల విజయం దాదాపు ఖాయమనే సంకేతాలు ప్రస్పుటమవుతున్నాయి. మండలంలోని 22 ఎమ్పీటీసీల్లో వైఎస్సార్‌సీపీ కనీసం 14 నుంచి 16 స్థానాలు గెలుచుకోవచ్చని స్పష్టమవుతోంది. సొంత మండలంలోనే చతికిలపడుతున్న అశోక్ అసెంబ్లీ ఎన్నికలను గట్టెక్కడం దాదాపు అసాధ్యమని టీడీపీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు.
Advertisement
Advertisement