టీడీపీకి ఎన్నికల భయం పట్టుకుంది. ఒకవైపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మరోవైపు విశాఖలో పరిపాలన రాజధాని ప్రకటన నేపథ్యంలో ప్రజా వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరవుతున్న టీడీపీ ఎలాగైనా స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని పడరాని పాట్లు పడింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లి అడ్డుకుంది. ఎన్నికలే జరగకుండా మరికొన్ని సాకులతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కానీ ప్రభుత్వం ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలని పట్టుదలతో ముందుకెళ్లింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కాకపోతే మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరగకుండా కొన్నేళ్లుగా కుట్రలు చేస్తున్న టీడీపీ నేటికీ వెనక్కి తగ్గకపోవడంతో కోర్టు అడ్డంకుల దృష్ట్యా శ్రీకాకుళం కార్పొరేషన్, రాజాం, ఆమదాలవలస మున్సిపాల్టీలు ప్రస్తుతానికి ఎన్నికలకు దూరమయ్యాయి. వీటి అభివృద్ధికి టీడీపీ విఘాతంగా నిలిచింది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులొస్తాయి. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికలకు వెళితే ఓడిపోతామన్న భయంతో జాప్యం చేస్తూ వచ్చింది. ఈలోగా సార్వత్రిక ఎన్నికలు జరగడం, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మొదటి నుంచి ఆలోచిస్తూ వచ్చింది. కోర్టు చిక్కులను అధిగమించి ఎట్టకేలకు ఎన్నికలకు ముందుకెళ్లింది.
అయితే ఇప్పుడున్న సమయంలో ఎన్నికలకు వెళితే తప్పనిసరిగా ఓడిపోతామన్న భయం, ఇప్పుడున్న ప్రభుత్వానికి కేంద్రం నుంచి నిధులొచ్చేస్తే ఎక్కడ అభివృద్ధి జరిగిపోతుందోనన్న అభద్రతాభావంతో టీడీపీ రకరకాల అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసింది. న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి కుట్రలు పన్నింది. వీటిని అధిగమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లడంతో ఎన్నికలకు లైన్‌క్లియర్ అయింది. అయినప్పటికీ జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్, రాజాం, ఆమదాలవలస మున్సిపాల్టీలకు టీడీపీ మోకాలడ్డింది. రకరకాల కారణాలు చూíపించి, కోర్టులో పిటిషన్లు వేసి మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరగకుండా అడ్డుకుంది. చదవండి: 144 ఏళ్ల ఒంగోలు చరిత్రలో అరుదైన గౌరవం
కార్పొరేషన్‌కు విలీన అడ్డంకులు
శ్రీకాకుళం కార్పొరేషన్‌లో ఏడు పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించగా టీడీపీకి చెందిన కొందరు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సాంకేతికపరమైన లోపాలను ఉద్దేశపూర్వకంగా ఎత్తిచూపుతూ ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. నగర అభివృద్ధి కోరుకున్నవాళ్లు అడ్డంకులు సృష్టించకుండా ఎన్నికలను స్వాగతిస్తారు. కానీ టీడీపీ నేతలు ఆ పని చేయకుండా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. శ్రీకాకుళం నగరపాలకసంస్థకు 2010 తరువాత ఎన్నికలు లేకుండా పోయాయి. కార్పొరేషన్‌లో విలీనం, పంచాయతీల హోదాను రద్దు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వును కూడా రద్దు చేయాలని కోరుతూ కొందరు టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ పరిస్థితి వచ్చింది.
రాజాంకు టీడీపీ నేతల చిక్కులు
టీడీపీ నేతల చిక్కులతో రాజాం మున్సిపాల్టీ గతి మారడం లేదు. కేసులతో రాజాం ప్రగతిని అడ్డుకుంటున్నారు. ఎన్నికలు జరిగే వాతావరణానికి అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారు. రాజాం నగర పంచాయతీని 2005లో ఏర్పాటు చేశారు. అప్పట్లో రాజాం, సారధి, కొత్తవలస, కొండంపేట, పొనుగుటివలస పంచాయతీలను నగరపంచాయతీలో విలీనం చేసి రాజాం నగర పంచాయతీగా ఏర్పాటు చేశారు. అప్పటికీ ఒక ఏడాది తమకు పంచాయతీ పరిపాలన హక్కులు ఉన్నాయని కొండంపేట, పొనుగుటివలస, కొత్తవలస పంచాయతీలుకు చెందిన మాజీ సర్పంచ్‌లు కలిశెట్టి దాసు, శాపపు కేశవనాయుడు, శిమ్మ జగన్నాథంలు కోర్టులో కేసు వేశారు. వీరంతా టీడీపీ మద్దతుదారులు.
దీంతో నగరపంచాయతీ ఏర్పడినప్పటికీ ఎన్నికల జరుగకుండా వాయిదా పడుతూ వచ్చింది. ఏడాది క్రితం వరకూ ఇదే పరిస్థితి రాజాంలో కనిపించింది. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తరువాత నగర పంచాయతీపై ఉన్న కేసు కొలిక్కి తీసుకొచ్చింది. మళ్లీ ఈ ఐదు పంచాయతీల విలీనానికి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ తంతు ప్రస్తుతం పూర్తికాకపోవడంతో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో రాజాం నగర పంచాయతీ ఎన్నికలకు అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ ఎన్నికలు జరుగకుండా టీడీపీ నేతలు అడ్డుకున్న కారణంగా పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
టీడీపీ ఎత్తులకు ఆమదాలవలస చిత్తు
ఆమదాలవలస మున్సిపాలిటీ గతంలో తృతీయ శ్రేణిలో ఉండేది. దాన్ని ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించి ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ జనాభా పెరగడంతో గతంలో 23 వార్డులున్న మున్సిపాలిటీని 27 వార్డులుగా పునర్విభజన చేశారు. ఈ పునర్విభజన ప్రక్రియలో అధికారులు తగు చర్యలను సక్రమంగా చేపట్టలేదని, లోపభూయిష్టమైన విధానం అనుసరించారని, విభజనతో ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని, సక్రమంగా పునర్విభజన చేయాలని కోరుతూ ఆమదాలవలస మున్సిపాలిటీలోగల 7వ వార్డు చింతాడ గ్రామానికి చెందిన మాజీ కౌన్సిలర్ బోర గోవిందరావు గత నెల 27న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్ ఈ నెల 26న విచారణకు రాగా ఆరోజు సాయంత్రం హైకోర్టు జడ్జి నుంచి ఓరల్‌గా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. దీంతో మున్సిపాలిటీలో జరగాల్సిన ఎన్నికలు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని శనివారం రాత్రి 11.30 గంటలకు డీఎం కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్‌కు లెటర్ వచ్చిందని తెలిపారు. మంగళవారం దీనికి సంబంధించి కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ కానున్నాయని, ఆ రోజు కోర్టు వాయిదా ఉందని కమిషనర్ తెలిపారు. ఇదిలావుండగా ఆమదాలవలస మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు. ఎన్నిక జరిగితే ఈ మేరకు రిజర్వేషన్ అమలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment