టీడీపీ లీడర్లు... చికెన్ కర్రీలు | TDP leaders attract voters with chicken curry recipe due to elections in Srikakulam District | Sakshi
Sakshi News home page

టీడీపీ లీడర్లు... చికెన్ కర్రీలు

Published Sat, Apr 19 2014 9:21 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

టీడీపీ లీడర్లు... చికెన్ కర్రీలు - Sakshi

టీడీపీ లీడర్లు... చికెన్ కర్రీలు

మొన్న పెళ్లి విందు పేరుతో చికెన్ భోజనాలు
నేడు బర్త్‌డే వేడుక పేరుతో చికెన్‌తో టిఫిన్
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తున్న టీడీపీ అభ్యర్థులు
అడ్డంగా దొరికిపోతున్నా నిర్లజ్జగా అదే తంతు
ఓటమి భయంతోనే ఓటర్లకు ప్రలోభాలు

 

మొన్న పెళ్లి విందు పేరుతో చికెన్ మీల్స్.. ఈరోజు పుట్టినరోజు వేడుక సాకుతో చికెన్‌తో కూడిన అల్పాహారం.. మామూలు రోజుల్లో అయితే ఇంత పసందైన విందు.. అదీ సామాన్య జనాలకు రోజూ ఇంత ఉదారంగా పెట్టడాన్ని ఊహించగలమా!.. టీడీపీ నేతలు మాత్రం నిజం.. నమ్మండి బాబూ! అని ఎన్నికల అధికారుల వద్దే బొంకేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి.. ఓటర్లను ప్రలోభాల విందులతో సంతృప్తిపరిచేందుకు తెగ తాపత్రయపడుతున్న శ్రీకాకుళం లోక్‌సభ, అసెంబ్లీ టీడీపీ అభ్యర్థులు అధికారులకు అడ్డంగా దొరికిపోయినా.. నిర్లజ్జగా పెళ్లి, పుట్టిన రోజు సాకులతో తప్పించుకోజూస్తున్నారు.
 
శ్రీకాకుళం: ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి టీడీపీ నేతలు రోజుకో జిమ్మిక్కు చేస్తున్నా రు. పెళ్లి, పుట్టినరోజు వేడుకల పేరుతో వివిధ ప్రాం తాల ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల కోడ్‌కు పూర్తి విరుద్ధంగా చేపడుతున్న ఈ తంతు వల్ల అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నా.. ఏమాత్రం వెరవడం లేదు. శుక్రవారం శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్‌భవన్ ఎదురుగా ఉన్న ఓ అపార్ట్‌మెంటులో జరిగిన అల్పాహార విందు కార్యక్రమం టీడీపీ ప్రలోభాల పర్వాన్ని మరోమారు బట్టబయలు చేసింది.

శ్రీకాకుళం అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు గుండ లక్ష్మీదేవి, కింజరాపు రామ్మోహన్‌నాయుడు పార్టీ తరఫున ప్రచారం చేసిన వారికి, ఆ ప్రాంత ప్రజలకు చికెన్‌తో కూడిన అల్పాహారం భారీగా పెట్టించారు. రెండురోజుల క్రితం నామినేషన్ దాఖలు కార్యక్రమం సందర్భంగా వచ్చిన జనాలకు అరసవల్లి తోటలో పెళ్లి విందు పేరుతో చికెన్ మీల్స్ పెట్టించారు. దీన్ని గుర్తించిన ఎన్నికల పరిశీలకులు కేసు నమోదు చేసి, అభ్యర్థి ఖాతాలో ఆ ఖర్చులను జమ చేసిన విష యం తెలిసిందే. అయినా వెనుకంజ వేయని టీడీపీ అభ్యర్థులు శుక్రవారం ఉదయం ఒప్పంగి, అరసవల్లి, తదితర ప్రాంతాల్లో ప్రచారం చేసిన అనంతరం ఇంది రావిజ్ఞాన్ భవన్ ఎదురుగా ఉన్న ఓ అపార్టుమెంట్ ఆవరణలో చికెన్ కూర, పూరీలు పెటిచారు.

ఈ తతంగానికి పుట్టిన రోజు వేడుకలని నామకరణం చేశారు. పార్టీ అభ్యర్థులు స్వయంగా ఈ విందులో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న ఎన్నికల పరిశీలకులు అక్కడికి రావడంతో కార్యకర్తలు తమ అభ్యర్థులను దాచేందుకు ప్రయత్నించారు. దీన్ని గమనించిన అధికారులు పుట్టిన రోజు వేడుకలే అయితే ఇటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తూ కేసు నమోదు చేసి అభ్యర్థుల ఖాతాలో కొంత మొత్తాలను జమ చేయాలని నిర్ణయించారు. ఒకపక్క ప్రచారానికి తీసుకొచ్చిన కార్యకర్తలు, ప్రజలకు ఇటువంటి ఆఫర్లతో పాటు నగదు పంపిణీ చేస్తూనే ఇంకోపక్క ఓటర్లను సైతం ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

గురువారం టీడీపీకే చెందిన మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం తన ఇంట్లో పింఛన్లు పంపిణీ చేయిస్తూ ‘న్యూస్‌లైన్’కు చిక్కిన విషయం తెలిసిందే. మరోవైపు శుక్రవారం ఒప్పంగి సమీపంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి రామ్మోహన్‌నాయుడు, లక్ష్మీదేవిలు వారినుద్దేశించి ప్రసంగించారు. ప్రచారం చేశారు. ఇది ఎన్నికల కోడ్‌కు పూర్తి విరుద్ధం. అక్కడ కూడా వేతనదారులను ప్రలోభాలకు గురి చేశారు. దీనిపైన కూడా ఎన్నికల పరిశీలకులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ వీడియో క్లిప్పింగులను శుక్రవారం రాత్రి అధికారులు పరిశీలించారు.  ఓటర్లు టీడీపీని తిరస్కరిస్తున్నారని గమనించిన అభ్యర్థులు ఇటువంటి ప్రలోభాలకు పాల్పడుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement