మత పెద్దలతో మంతనాలు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్:ఆమదాలవలస నియోజకవర్గంలో ఏమాత్రం పట్టు సాధించిలేకపోతున్న టీడీపీ పక్కదారులు వెతుకుతోంది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ఆ నియోజకవర్గ పరిధిలోని పొందూరు మండలంలో ఒక మతస్తులు గణనీయ సంఖ్యలో ఉండటంతో వారిని ఎలాగైనా మచ్చిక చేసుకునేందుకు పన్నాగం పన్నింది. అందులో భాగంగా టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ ఆ మత పెద్దలతో మంతనాలకు శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గ పరిధిలో అయితే అందరికీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో పక్కనే ఉన్న శ్రీకాకుళం పట్టణంలో వారితో భేటీ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకొని సమాచార సేకరణకు వెళ్లిన ‘న్యూస్‌లైన్’ విలేకరిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడమే కాకుండా వెంట తరిమారు. శ్రీకాకుళం డీసీసీబీ కాలనీలో ఉన్న వికాస్ జూనియర్ కళాశాల పై అంతస్తులో మంగళవారం ఉదయం ఒక మతానికి చెందిన పెద్దలతో కూన రవికుమార్ సమావేశం నిర్వహించారు.
సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. అనంతరం ఆల్పాహార విందు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కొంత డబ్బు కూడా ముట్టజెప్పినట్లు తెలిసింది. ప్రార్ధనల కోసం వచ్చే ఆ మతానికి చెందిన ఓటర్లను తమ పార్టీకే ఓటు వేసేలా మద్దతు కూడగట్టాలని టీడీపీ అభ్యర్థి వారిని కోరినట్టు సమాచారం. కాగా సమావేశం విషయం బయట ప్రపంచానికి తెలియకుండా, ఇతరులెవరూ ఆ లోనికి రాకుండా భవనం చుట్టూ కూన అనుచరులతో గట్టి కాపలా ఏర్పాటు చేశారు. వచ్చిన వారి వివరాలు ఆరా తీసి.. అన్ని నిర్దారించుకున్న తర్వాతే లోనికి అనుమతించారు. సమావేశం జరుగుతున్న విషయం తెలుసుకున్న ‘న్యూస్‌లైన్’ ప్రతినిధి అక్కడకు వెళ్లగా లోనికి అనుమతించలేదు. దాంతో సమీపంలో ఉన్న భవనం పై నుంచి ఫోటోలు తీస్తుండగా గమనించిన కొందరు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. రైతుబజారు వరకు వెంబడించారు. ఈ సమావేశంలో ఆమదాలవలస టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌తో పాటు ఆ పార్టీ నాయకులు కిల్లి రామ్మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.