సుజనా చౌదరిని అరెస్టు చేయాలి: గట్టు | sujana chowdary should be arrested | Sakshi
Sakshi News home page

సుజనా చౌదరిని అరెస్టు చేయాలి: గట్టు

Published Sun, Apr 20 2014 3:58 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

సుజనా చౌదరిని అరెస్టు చేయాలి: గట్టు - Sakshi

సుజనా చౌదరిని అరెస్టు చేయాలి: గట్టు

సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బినామీ అయిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి అవినీతి బాగోతాలు స్పష్టంగా బయటపడినందున ఆయనను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. సుజనా చౌదరిని ఇంటరాగేషన్ చేస్తే చంద్రబాబు అవినీతికి సంబంధించి విస్తుపోయే నిజాలు వెల్లడవుతాయన్నారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ... సుజనా చౌదరి మారిషస్‌లోని కమర్షియల్ బ్యాంక్‌కు రూ.120 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన వైనాన్ని వివరించారు.
 
సుజనా చౌదరి అక్రమాల నేపథ్యంలో ఆయన బ్యాంక్ ఖాతాలతోపాటు, ఆఫీసు ఫర్నీచర్‌ను సైతం జప్తు చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్‌కోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని గట్టు గుర్తుచేశారు. ‘‘సుజనా చౌదరిపై కేసు వేసింది మన దేశంలోని వ్యక్తులు కాదు. మారిషస్ వ్యక్తి వచ్చి హైదరాబాద్‌లో కేసు వేస్తే... న్యాయస్థానం ఏకంగా ఆయన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. అంటే మారిషస్‌లోని కోర్టులు ఈ పాటికి ఉత్తర్వులు జారీ చేసుంటాయి. కాబట్టే ఇక్కడి న్యాయస్థానాలు కూడా సీరియస్‌గా తీసుకున్నాయి’’ అని చెప్పారు. చంద్రబాబు అనే అవినీతి విషవృక్షం ప్రపంచవ్యాప్తంగా వేళ్లూనుకుందని దుయ్యబట్టారు. బ్యాంక్‌లను మోసం చేయడం, నల్లడబ్బును విదేశాలకు తరలించడంలో చంద్రబాబు దిట్ట అని, ఆయన బినామీలైన సీఎం రమేష్, సుజనాచౌదరి నిత్యం ఇవే పనులపై నిమగ్నమై ఉంటారని ఆరోపించారు.
 
బాబు హయాంలో 65 ప్రభుత్వ సంస్థలను తెగనమ్మడంతోపాటు రహేజా, ఐఎంజీ భారత్ వంటి సంస్థలకు వందలాది ఎకరాల భూములు కేటాయించి, కమిషన్‌ల రూపంలో వేలాది కోట్లు విదేశాలకు తరలించారని విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడగానే వాటిని హవాలా రూపంలో దేశంలోకి తీసుకొచ్చి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారన్నారు. హసన్‌ఆలీ అనే హవాలా వ్యాపారి స్వయంగా చంద్రబాబు పేరును చెప్పకనే చెప్పారని గుర్తుచేశారు. సుజనాచౌదరి తోక పట్టి లాగితే చంద్రబాబు అవినీతి విషవృక్షం బయటపడుతుందన్నారు. ఓట్లు, సీట్లతో పాటు పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకున్న చిరంజీవి కూడా నీతులు వల్లిస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని గట్టు ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement