సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైన పోలీసులు | Surveillance on the movements of the Maoists | Sakshi
Sakshi News home page

సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైన పోలీసులు

Published Sat, Apr 19 2014 12:55 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Surveillance on the movements of the Maoists

ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : సార్వత్రిక సమరానికి పోలీసుశాఖ సిద్ధమైంది. మున్సిపల్, స్థానిక ఎన్నికలు కొద్దిపాటి ఘటనలు మినహా ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతుండడంతో పోలీసులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పోలీసులు గస్తీ తిరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల్లో అరాచకాలు సృష్టించే వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. పాత నేరస్థులను గుర్తించి బైండోవర్ చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

 అతి సమస్యాత్మక కేంద్రాల్లో నిఘా
 జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 9,400 మంది సిబ్బంది ఎన్నికల్లో విధులు నిర్వర్తించనున్నారు. జిల్లాలోని 2,318 పోలింగ్ కేంద్రాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేయనుంది. 2,318 పోలింగ్ కేంద్రాల్లో 301 అతి సమస్యాత్మకమైనవిగా, 292 సమస్యాత్మకం, 93 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. స్థానిక పోలీసులు, నిఘా వ్యవస్థ అధికారులు తయారు చేసిన ప్రత్యేక రిపోర్టు ఆధారంగా ఈ కేంద్రాలను గుర్తించారు. రోజు ఈ ప్రాంతాల్లో పోలీసు ప్లాగ్‌మార్చ్‌లు నిర్వహించనున్నారు.

 ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చేసే వ్యక్తులను ముందస్తుగా బైండోవర్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 45 చెక్‌పోస్టులో డీఎస్పీలు రోజు తనిఖీలు చేసేలా ప్రత్యేక ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు ఏర్పాటు చేసుకోనున్నారు. జిల్లా పోలీసులతోపాటు కేంద్ర బలగాలు ఎన్నికల విధులకు రానున్నాయి. కాగా, పోలీసు బలగాలు ఇలా ఉన్నాయి. ఎస్పీ ఒక్కరు, ఏఎస్పీలు నలుగురు, డీఎస్పీలు 16, సీఐలు 60, ఎస్సైలు 240, ఏఎస్సైలు 180, హెడ్‌కానిస్టేబుళ్లు 800, కానిస్టేబుళ్లు 5 వేలు, మహిళ పోలీసులు 150, హోంగార్డులు 800, ఫారెస్టు, ఎక్సైజ్ సిబ్బంది 350, ఏపీఎస్పీ బలగాలు 600, సీఆర్‌పీఎఫ్ 400, ఐటీబీపీ ఫోర్స్ 400, సీఏపీఎప్ ఫోర్స్ 400 బలగాలు ఉన్నాయి.

 జిల్లాకు కర్నూల్ పోలీసులు
 తెలంగాణలో ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికలు మొదటి విడతగా నిర్వహిస్తుండడంతో ఇక్కడికి సీమాంధ్ర పోలీసు బలగాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు కర్నూల్ నుంచి 2,900 మంది పోలీసులు బందోబస్తుకు రానున్నాయి. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు విడతలుగా నిర్వహించడంతో ఇక్కడి పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు పోలీసు బందోబస్తు కొరత ఉండడంతో కర్నూల్ జిల్లా నుంచి పోలీసు బలగాలను రప్పిస్తున్నారు.

వీరిలో ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్సైలు, మిగతా వారు పోలీసు కానిస్టేబుళ్లు ఉన్నారు. మొత్తం 9,400 మంది సిబ్బందిలో కేంద్ర బలగాలు, ఇండోటిబెట్ బార్డర్ పోలీసు ఫోర్సు బలగాలు ఉన్నాయి. ఇప్పటికే ఎక్సైజ్, ఫారెస్టు శాఖల సిబ్బందిని బందోబస్తుకు వినియోగించుకుంటున్న పోలీసుశాఖ వీరితోపాటు అదనంగా 2వేల మంది ఎన్‌సీసీ కేడెట్లను బందోబస్తుకు ఇవ్వాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

 సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్..
 జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలతో కూంబింగ్  నిర్వహిస్తున్నారు. జిల్లాలో మావోయిస్టు యాక్షన్ టీం కదలికలు ఉండే అవకాశాలు ఉన్నందున మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావం ఉన్న జిల్లాలో ఆదిలాబాద్ కూడా ఉన్నట్లు రాష్ట్ర పోలీసు అధికారులు నిర్ధారించారు. ఎన్నికలకు మరో పది రోజులు సమయం ఉండడంతో సరిహద్దు ప్రాంతాలను పోలీసులు జల్లేడ పడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న నాయకుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారు.

 రాజకీయ నాయకులు ప్రచార సమయంలో పోలీసులకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నిలబడ్డ అభ్యర్థులు ప్రచారానికి వెళితే ఏం జరుగుతోందోని ఆందోళన వీరిలో ఉంది. అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లే రాజకీయ నాయకులకు భద్రత కల్పించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్థానిక పోలీసులకు ఉన్నత అధికారులు  సూచిస్తున్నారు. ప్రజలు సైతం నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో సంచరిస్తున్నారు. ఏదేమైన జరిగిన రెండు ఎన్నికలు ఒక ఎత్తై ఈ సార్వత్రిక ఎన్నికలు పోలీసులకు సవాలుగా మారింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement