డబ్బులెవరిచ్చినా తీసుకోండి... ఓట్లు మాత్రం టీడీపీకి వేయండి
ఓటర్లకు పవన్ కల్యాణ్ ఉపదేశం
టెక్కలి/విజయనగరం, : ‘‘ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది నాకు అనవసరం.. తెలుగు ప్రజల కోసం నేను ఆరాటపడుతున్నాను..’’ అని సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. టీడీపీకి మద్దతుగా శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి, విజయనగరంలో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి.. ఓట్లు మాత్రం టీడీపీకి వేయండని ప్రజలకు ఉపదేశించారు. అభ్యర్థుల వద్ద ఎక్కువ డబ్బులున్నాయని.. ఓటుకు వారిస్తానన్న నాలుగు వేలు కాకుండా ఏడెనిమిది వేలు అడగాలన్నారు. మీరు నేను చెప్పిన మాటలు పట్టించుకోకుంటే సినిమాలు మానేస్తానని అభిమానులను బెదిరించారు. పదవులు, డబ్బులు ఆశించి తాను టీడీపీ-బీజేపీ కూటమికి ప్రచారం చేయడంలేదన్నారు. దివంగత వైఎస్‌ఆర్ పాలన బాగుందని చెప్పిన ఆయన.. అదే నోటితో వైఎస్ పైనా, వైఎస్‌ఆర్‌సీపీపైనే విమర్శలు చేయడం ప్రజలను విస్మయానికి గురిచేసింది.
నాకు మోడీతోనే సంబంధం: తనకు రాజకీయాలు తెలియవని, ప్రజల సమస్యలు, ఇబ్బందులు మాత్రం తెలుసునని పవన్ అన్నారు. ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పాలన్నారు. నాకు టీడీపీతోగానీ, బీజేపీతోగానీ సంబంధంలేదని, కేవలం మోడీతోనే ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్పారు. ఓటుకు డబ్బులు తీసుకోండని అన్న పవన్ వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందడంతో ప్రసంగాన్ని విని చర్యలు తీసుకోనున్నట్టు మోడల్ కోడ్ అధికారులు తెలిపారు.