టీడీపీ ఆరో జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: పార్టీ నేతల తీవ్రస్థాయి నిరసనలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాలుగు స్థానాల్లో చివరి నిమిషంలో పార్టీ అభ్యర్థులను మార్చారు. స్థానికేతరులకు టికెట్లివ్వడంతో స్థానిక నేతల నుంచి నిరసనలు తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థులను మార్చక తప్పలేదు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం అభ్యర్థిగా బోనబోయిన శ్రీనివాసయాదవ్, మంగళగిరి నియోజకవర్గానికి తులసీ రామచంద్రప్రభు పేర్లు తొలుత ప్రకటించారు. వారిద్దరూ స్థానికేతరులు కావటంతో నిరసన వ్యక్తమైంది. దీంతో మాచర్ల నుంచి కొమ్మారెడ్డి చలమారెడ్డి, మంగళగిరి నుంచి జి. చిరంజీవిని అభ్యర్థులుగా ప్రకటించారు.
ఇక విశాఖపట్నం జిల్లా అరకు స్థానానికి ఇటీవలే పార్టీలో చేరిన కుంభా రవిబాబు పేరు ప్రకటించారు. ఆయన్ను తప్పించి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే సివిరి సోమ (చంద్రమ్మ)కు కేటాయించారు. అనంతపురం జిల్లా శింగనమల సీటుకు తొలుత బండా రవికుమార్ పేరును ప్రకటించారు. అయితే ఆయనకు బదులు ఎమ్మెల్సీ శమంతకమణి కుమార్తె పామిడి యామినిబాలను బరిలో దించారు. ఇదిలా ఉంటే పార్టీ అభ్యర్థుల ఆరో జాబితాను శుక్రవారం విడుదల చేశారు. గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు పులపర్తి రామాంజనేయులుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సీటును కేటాయించారు.
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి నెల్లూరు జిల్లా సర్వేపల్లి, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పకు పెద్దాపురం, పోతుల విశ్వంకు పిఠాపురం, ప్రభాకరచౌదరికి అనంతపురం సీట్లను కేటాయించారు. దీంతో 160 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. బీజేపీ నుంచి వెనక్కి తీసుకున్న ఇచ్ఛాపురం నుంచి బెందాళం అశోక్ పోటీచేస్తారు. రాజమండ్రి రూరల్, అర్బన్ స్థానాల నుంచి నామినేషన్ దాఖలు చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
నాలుగు స్థానాల్లో అభ్యర్థుల మార్పు
Published Sun, Apr 20 2014 3:53 AM | Last Updated on Mon, Oct 22 2018 8:50 PM
Advertisement