మంత్రి సోమిరెడ్డిని నిలదీసిన తెలుగు తమ్ముళ్లు.. | Controversy Between Telugu Desam Party Brothers And Somareddy | Sakshi
Sakshi News home page

మంత్రి సోమిరెడ్డిని నిలదీసిన తెలుగు తమ్ముళ్లు..

Published Fri, Apr 20 2018 8:20 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

Controversy Between Telugu Desam Party Brothers And Somareddy - Sakshi

సమన్వయకమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి సోమిరెడ్డి తదితరులు

కడప రూరల్‌ : స్ధానిక ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో గురువారం జిల్లా ఇన్‌ చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా మరోమారు విబేధాలు బయట పడ్డాయి. సమాచారం మేరకు   ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపడుతున్న ధర్మ పోరాట దీక్ష, అనంతరం 15 రోజుల పాటు చేపట్టే సైకిల్, పాదయాత్రలు తదితర అంశాల గురించి సమావేశంలో చర్చించారు. కాగా ఇటీవల కాలంలో టీడీపీలో ఆధిపత్యం, వర్గ పోరు ఎక్కువైంది. ప్రతి నియోజక వర్గంలో రెండు, మూడు గ్రూపులు ఉన్నాయి. ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమాలను గ్రూపుల వారీగా నిర్వహించి అందరినీ విస్తుపోవయేలా చేశారు.

ఈ పరిణామాలు అధిష్టానానికి  తల నొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశంతో ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నారు. హోదా అంశంపై తమ ఉనికిని చాటు కోవడానికి తాపత్రయ పడుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో ‘ధర్మ పోరాట దీక్ష’ను చేపడుతున్నారు. ఈ తరుణంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి కొన్ని అంశాలను తీసుకెళ్లారు. దీనిపై మంత్రి  స్పందించారు. శుక్రవారం చేపట్టే దీక్షలను పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జిలు, ఇతర నాయకులు అందరూ ఐకమత్యంగా నిర్వహించాలన్నారు. ఒకే దీక్షా శిబిరం ఉండాలన్నారు. జమ్మలమడుగు, కమలాపురం, బద్వేలు తదితర నియోజక వర్గాల్లో ఒకే దీక్షా శిబిరంలో నేతలంతా పాల్గొంటారని తెలిపారు.

అందుకు కొంతమంది తమ్ముళ్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐకమత్యం ఇప్పుడే గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు. ప్రధానంగా రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు తనయుడు ప్రసాద్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో తాము కష్టించి పనిచేశాం. గడిచిన నాలుగేళ్లుగా తమను ఎవ్వరూ పట్టించుకోలేదు అని నిలదీశారు.  మాకు ఎలాంటి గుర్తింపు లేదు. ఇప్పుడేమో ఐకమత్యంగా పనిచేయమంటున్నారు. ప్రత్యేక శిబిరాలు పెట్టవద్దని అంటున్నారు. అది ఎంతమాత్రం కదరదు. ప్రత్యేక శిబిరం పెట్టి తీరుతామని తెగేసి చెప్పారు. దీంతో మంత్రి సోమిరెడ్డి నిశ్చేఘ్టడయ్యారు. కాసేపటికి తేరుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని చెప్పారు.

మరికొంతమంది తమ్ముళ్లు తమ నియోజక వర్గాల్లోని సమస్యలను ఏకరువు పెట్టారు.కొంతమంది నాయకులు అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేసేలా చూడాలని, లేదంటే వ్యతిరేకత వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, నాయకులు లింగారెడ్డి, వరదరాజులరెడ్డి, పుత్తా నరసింహరెడ్డి, రమేష్‌రెడ్డి, విజయజ్యోతి, ఆరీఫుల్లా, హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రం పాలిట బీజేపీ  శత్రువుగా మారింది
ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన మాటను విస్మరించి రాష్ట్రం పాలిట భారతీయ జనతా పార్టీ  శత్రువుగా మారిందని  మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి తీరని ద్రోహం చేశారన్నారు. బీజేపీకీ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement