
సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి, అసమర్థత, పాలనతో గత నాలుగు సంవత్సరాలు నుంచి ఆంధ్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి తీవ్రంగా మడిపడ్డారు. ఆయన గురువవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... శుక్రవారం రోజు బ్లాక్ డేగా గంట స్తంభం వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
ఆంధ్ర ప్రజల ఆంకాంక్ష మేరకు ప్రత్యేకహాదా కోసమే వైఎస్సార్ సీసీ ఎంపీలు ఒక సంవత్సరం పదవి కాలం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల శ్రేయసు కోసం తమ పదవులకు రాజీనామా చేశారని అన్నారు. తమ ఎంపీలు రాజీనామాలు స్పీకర్ ఆమోదించిన తర్వాత కూడా ఉప ఎన్నికలు రావని చంద్రబాబు అనడంలోనే ఎన్నికలు అంటేనే చంద్రబాబు భయపడుతున్నారని అర్థం అవుతోందన్నారు. తమ పార్టీ ఎంపీల మాదిరిగానే టీడీపీకి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే తప్పకుండా కేంద్రం దిగి వస్తుందని అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు వందల హామీలలో పది శాతం కూడా టీడీపీ అమలు చేయలేదని కోలగట్ల ధ్వజమెత్తారు.