ఎవరికీ పట్టని లోక్‌సత్తా !
* నిర్వేదంలో జేపీ
సాక్షి, హైదరాబాద్: జెండా, ఎజెండా పక్కనబెట్టినా లోక్‌సత్తా పార్టీకి ఫలితం దక్కలేదు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో కలిసి ఎన్నికల బరిలో దిగాలని కలలుగన్న లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణకు భంగపాటు ఎదురైంది. ఈసారి ఎలాగైనా టీడీపీ, బీజేపీలతో కలిసి మహాకూటమిగా జట్టుకట్టి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన భావించారు. అందుకనుగుణంగా కొంతకాలంగా ముమ్మర ప్రయత్నాలు చేశారు.
బీజేపీని మచ్చిక చేసుకోవాలని అవకాశం వచ్చినప్పుడల్లా ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ఆకాశానికెత్తారు. అయినా కమలదళం నుంచి పిలుపు రాలేదు సరికదా, లోక్‌సత్తా నేతలే ఆ పార్టీ తలుపు తట్టినా పట్టించుకోలేదట. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబును సంప్రతించడం కోసం వారి సామాజిక వర్గానికి చెందిన బడాబాబులతో విశ్వప్రయత్నాలు చేయించారు.
చివరికి ఒక పత్రికాధినేత స్వయంగా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం నెరిపారు. అయితే, చంద్రబాబు చెప్పిన అభిప్రాయం విని మధ్యవర్తులు సహా జేపీ కూడా కంగుతిన్నట్టు తెలిసింది. ‘ఇప్పటికే బీజేపీతో పొత్తుతో తలబొప్పి కడుతోంది. మధ్యలో మీరు దూరితే ఇంకేమైనా ఉందా’ అని చంద్రబాబు అనడంతో జేపీ నివ్వెరపోయినట్టు సమాచారం.