
పచ్చధనం పరవళ్లు
* కోట్లు కుమ్మరిస్తున్న టీడీపీ అభ్యర్థులు
* ఓటుకు రూ.1000 చొప్పున పంపిణీ
* మిక్సీలు, కుక్కర్లు, గోల్డ్ కాయిన్లూ ఎర
* ఏరులై పారుతున్న సారా, మద్యం
* ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి బృందాల రాక!
సాక్షి, కాకినాడ : ఎంతలా ప్రచారం చేసినా తెలుగుదేశాన్ని ప్రజలు నమ్మడం లేదు. పొర్లుదండాలు పెట్టినా విశ్వసించడం లేదు. దాంతో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమిని తప్పించుకోవడానికి చివరకు నోట్ల కట్టలను నమ్ముకుంటున్నారు. గంపగుత్తగా ఓట్లు కొనేందుకు కోట్లు వెదజల్లుతున్నారు. ఓపక్క మద్యం, నాటుసారా ఏరులై పారిస్తూ, మరోపక్క వివిధ వర్గాలకు గృహోపకరణాలు పంపిణీ చేస్తున్నారు. వన్‌గ్రామ్ గోల్డ్ కాయిన్లు, వెండి ఆభరణాల పంపిణీ కూడా చేస్తున్నారు. పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా వారి ప్రలోభాల పర్వం కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
ప్రజాబలంతో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను ఎదుర్కొనే సత్తా లేక టీడీపీ అభ్యర్థులు పోలింగ్ తేదీకి వారం రోజుల ముందు నుంచే ప్రలోభాలకు తెరతీశారు. ఓటుకు రూ.500 నుంచి రూ.2000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. నోట్ల పంపిణీని పర్యవేక్షించేందుకు జిల్లాకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ప్రత్యేక బృందాలు సైతం రంగంలోకి దిగాయి. శుక్రవారం ఈ బృందాలు మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో నాయకులతో సమావేశమైనట్టు సమాచారం. కాగా ఇంటింటికీ తిరిగి కరపత్రాలతో పాటు ఇంట్లో ఉండే సభ్యులను బట్టి సొమ్ము పంపిణీ చేస్తున్నారు. డబ్బులు తీసుకుంటే విధిగా ఓట్లు వేస్తారన్న గురి ఉన్న వర్గాలకే పంపిణీ చేస్తున్నా.. నమ్మకం చాలక ‘మీ ఇంట్లో ఓట్లన్నీ మాకే వేయించా’లంటూ హారతిపై వాగ్దానాలు చేయిస్తున్నారు.
పూటకో క్వార్టర్..
ఇక రాత్రుళ్లయితే మద్యంతో పాటు నాటుసారాను విచ్చలవిడిగా పోయిస్తున్నారు. నాయకుల చుట్టూ తిరిగే కార్యకర్తలు, అనుచరులకు రోజూ ఉదయం ఒక క్వార్టర్, సాయంత్రం మరో క్వార్టర్ అందిస్తున్నారు. యువకులకైతే కొన్ని ఎంపిక చేసిన బంక్‌లలో ఎన్నికలయ్యే వరకు పెట్రోల్ ఉచితంగా పోయిస్తున్నారు. మండపేటలో ఇటీవలే పీఎంపీలు, ఆర్‌ఎంపీలతో సమావేశమైన టీడీపీ నేతలు వారితో తమ పార్టీకే ఓటు వేసేలా వాగ్దానం చేయించుకొని వన్‌గ్రామ్ గోల్డ్ కాయిన్లు పంచిపెట్టారు. ముమ్మిడివరంలో డ్వాక్రా సంఘాల యానిమేటర్లు, ఉపాధి మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు హాట్‌బాక్సులు, మిక్సీలు పంపిణీ చేస్తున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఇంటింటికీ చంద్రబాబు, అభ్యర్థుల చిత్రాలు ముద్రించిన విసనకర్రలు పంపిణీ చేస్తున్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకొని బొట్టుబిళ్లలు, చీరలు పంపిణీ చేస్తున్నారు.
రామచంద్రపురంలో ఆ పార్టీ అభ్యర్థి కోట్లు కుమ్మరిస్తూ మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. పిఠాపురంలో ఆ పార్టీ అభ్యర్థి ఇంజనీరింగ్ విద్యార్థులను బలవంతంగా ప్రచారంలోకి దింపి, ఇంటింటికీ తిప్పిస్తున్నారు. ఎవరికీ అనుమానం కలగకుండా వారితోనే డబ్బులు, మద్యం పంపిణీ చేయిస్తున్నారని తెలిసింది. పెద్దాపురంలోనూ ఆ పార్టీ అభ్యర్థి ఈ తరహా దిగజారుడు వ్యవహారాలనే నమ్ముకున్నారు. ఇక రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఎంపీ అభ్యర్థులు కోట్లు కుమ్మరిస్తూ ఓటర్లను గంపగుత్తగా కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.500 చొప్పున, మరికొన్ని చోట్ల రూ.1000 నుంచి రూ.2000 చొప్పున పంచుతున్నారు. టీడీపీ ఇలా కోట్లు కుమ్మరిస్తున్నా ఎన్నికల అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఏదో మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పాయకరావుపేట వద్ద అనుమతి లేకుండా ప్రచార సామగ్రిని తరలిస్తున్న టీడీపీ వాహనాన్ని, డమ్మీ ఈవీఎంలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కె..గంగవరం మండలం ఉండూరులో టీడపీ నాయకుల నుంచి 33 మద్యం కేసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.