‘కొత్త’ పెత్తనమేమిటి?
- టీడీపీలో పాత నేతల మండిపాటు
- ఇరు పక్షాల మధ్య కుదరని సమన్వయం
- డబ్బు పంపిణీపై అజమాయిషీ కోసం రెండు వర్గాల పోరు
- తలలు పట్టుకుంటున్న అభ్యర్థులు
అమలాపురం, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో కొందరు ధనబలంతో ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని చాలా నమ్మకంతో ఉన్నారు. కానీ ఇప్పుడు అదే ధనం వారి కొంప ముంచనుంది. అభ్యర్థులు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్న సొమ్ములో కొంత వెనకేసుకునే ఉద్దేశంతో.. టీడీపీ నాయకులు గ్రామ, మండల స్థాయిలో దాని పంపకాన్ని చేజిక్కించుకొనేందుకు తహతహలాడుతున్నారు. ఈ వ్యవహారం ఆ పార్టీలో పాత, కొత్త నాయకుల మధ్య ఆధిపత్య పోరుకు తెర లేపింది. ఇప్పటికే వారి మధ్య సమన్వయం లేకపోవడం.. మరోపక్క డబ్బుపై పెత్తనం కోసం కొత్త పోరు తలెత్తడంతో.. ఈ పరిస్థితి తమ పుట్టి ముంచుతుందని టీడీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయ్యింది. ఆ పార్టీని వీడినవారిలో బలమైన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కొందరు వైఎస్సార్‌సీపీలో, మరికొందరు టీడీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో చేరిన వారికి, ఇప్పటికే ఉన్నవారికి మధ్య సమన్వయం కుదర్చడంలో ఆ పార్టీ అభ్యర్థులు సఫలీకృతులయ్యారు.
టీడీపీలో ఆ పరిస్థితి మచ్చుకైనా కానరావడంలేదు. ఇప్పటివరకూ పార్టీలో ఉన్నవారికి, కొత్తగా చేరినవారికి మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. అభ్యర్థులను దిగుమతి చేసుకున్నచోట, అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చినచోట ఈ పోరు ఎక్కువగా ఉంది.
రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం, పెద్దాపురం, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు కాకినాడ, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థుల వద్ద కొత్త, పాత పోరు జోరుగా సాగుతోంది. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నకొద్దీ పార్టీలో పెత్తనం కోసం.. ముఖ్యంగా ఆర్థిక పెత్తనం కోసం ఇరు వర్గాల నేతలు ముఖాముఖి తలపడుతున్నారు.
ప.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలంలో గత ఎన్నికల ముందు టీడీపీని వీడి ఇటీవల తిరిగి చేరిన ఓ మండల స్థాయి నాయకుడు, అతని అనుచరులు కలిసి పార్టీ ప్రచారం, ఆర్థిక విషయాల్లో ఎక్కువగా పెత్తనం చేస్తున్నారంటూ పాత క్యాడర్ మండిపడుతున్నారు. దీనిపై పార్టీ అభ్యర్థి పులపర్తి నారాయణమూర్తికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తొలి నుంచీ పార్టీని నమ్ముకుని ఉన్న మరో మండల స్థాయి నాయకుడు, ఆయన వర్గం ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కొత్తగా చేరిన ఓ యువనాయకుని వ్యవహార శైలిపై కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. అయినవిల్లి మండలంలో పాతవారు అవకాశం ఇవ్వకపోవడంతో పార్టీలోకి కొత్తగా వచ్చినవారు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.
అమలాపురం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, పార్టీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావుల సొంత మండలం ఉప్పలగుప్తం. ఇక్కడ కూడా పెత్తనం కోసం పార్టీ నాయకులు వీధిన పడ్డారు. పాత నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ పదవి కోసం ఇద్దరు మండల స్థాయి పార్టీ ప్రముఖులు ఒకరి ఓటమికి మరొకరు పని చేశారు. ఇప్పుడు వారే పార్టీలో పెత్తనం కోసం కాలు దువ్వడంతో అభ్యర్థి ఆనందరావు తలపట్టుకుంటున్నారు. అమలాపురం రూరల్ మండలంలో ఇటీవల పోటీ చేసిన అభ్యర్థుల వర్గానికి, పార్టీలో చాలాకాలం నుంచి ఉన్నవారికి మధ్య విబేధాలు నెలకొన్నాయి.
రాజోలు నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక నుంచీ ఆధిపత్య పోరు మొదలైంది. స్థానికుడైన బత్తుల రామును కాదని పార్లమెంటు టికెట్టు ఆశించిన గొల్లపల్లి సూర్యారావును అభ్యర్థిగా నిలపడంతోనే పాత, కొత్తవారి మధ్య పోరు మొదలైంది. అమలాపురం నియోజకవర్గం నుంచి రాజోలు చేరుకున్న గొల్లపల్లి అనుచరులు ఇక్కడ పెత్తనం చేయడంపై, రాము వర్గీయులు మండిపడుతున్నారు. ఈ కారణంగా చాలామంది టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలోకి వస్తుండగా మరికొంతమంది స్తబ్దుగా ఉండిపోయారు.
కాంగ్రెస్ నుంచి వచ్చీరాగానే కొత్తపేట టిక్కెట్ పొందిన సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వర్గానికి, ఎన్నికల వరకూ పార్టీని తీసుకువచ్చిన రెడ్డి సుబ్రహ్మణ్యం వర్గానికి మధ్య సమన్వయం అంతంతమాత్రంగానే ఉంది.
రామచంద్రపురంలో టీడీపీ పాత నాయకులకు, అభ్యర్థి తోట త్రిమూర్తుల వర్గీయులకు పొసగడం లేదు. పిఠాపురం, పెద్దాపురాల్లో పార్టీ అభ్యర్థులు పోతుల విశ్వం, నిమ్మకాయల చినరాజప్ప వర్గీయులు, స్థానికుల నాయకుల మధ్య సమన్వయం ఇప్పటికీ కుదరలేదు. దీంతో ఇక్కడ కూడా అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు.