ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత సాధించింది. ఏకైక ఎంపీ స్థానం విజయనగరంతో పాటు మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరుచోట్ల విజయాలు సొంతం చేసుకుంది. విజయనగరం లోక్సభ స్థానంలో టీడీపీ సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు నెగ్గారు.
కురుపాంలో టీడీపీ అభ్యర్థి జనార్థన్ థాట్రాజ్పై వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని పాముల పుష్పశ్రీవాణి గెలిచారు.
సాలూరులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాజన్నదొర ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి భంజదేవ్పై ఆయన 7044 ఓట్ల ఆధిక్యం సాధించారు.
బొబ్బిలి ఎన్నిక ఏకపక్షంగా సాగింది. బొబ్బిలి రాజా రావు సుజయ్ కృష్ణ రంగారావు 7044 ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి తెంటు లక్ష్మీనాయుడు మీద విజయం సాధించారు.
పార్వతీపురంలో టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు 5861 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ నామమాత్రంగా కూడా పోటీలో లేకుండా పోయింది.
గజపతినగరం నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకుడు కొండపల్లి అప్పలనాయుడు 19421 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
జిల్లా కేంద్రం విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామిపై టీడీపీ అభ్యర్థి మీసాల గీతకు 15404 ఓట్ల మెజారిటీ లభించింది.
ప్రతిష్ఠాత్మకమైన చీపురుపల్లి నియోజకవర్గంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని 20812 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. బొత్స కుటుంబం మీద స్వతహాగా ఉన్న వ్యతిరేకతతో పాటు సమైక్య ఉద్యమ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలే సత్తిబాబు ఓటమికి కారణమయ్యాయని అంటున్నారు.
నెల్లిమర్ల నియోజకవర్గంలో జిల్లా వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు కుమారుడు డాక్టర్ పి.సురేష్ స్వల్పతేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడ హోరాహోరీ పోరు జరిగింది. సీనియర్ నాయకుడు పతివాడ నారాయణస్వామి నాయుడు 6669 ఓట్ల తేడాతో గెలిచారు.
శృంగవరపుకోట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి 28572 ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జగన్నాథంపై గెలిచారు. ఒకే సామాజికవర్గం మధ్య ఓట్ల చీలికతో పాటు ఇతర కారణాలు ఆమె విజయానికి కారణమయ్యాయి.
విజయనగరం కోటలో దేశం పాగా
Published Fri, May 16 2014 6:57 PM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement
Advertisement