ఆత్మగౌరవం నిద్రాణం | TDP turns as congress party to make corporatism | Sakshi
Sakshi News home page

ఆత్మగౌరవం నిద్రాణం

Published Fri, Apr 4 2014 2:32 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

TDP turns as congress party to make corporatism

* కాలరేఖపై కరిగిపోయి సూడో కాంగ్రెస్‌గా మారిన టీడీపీ
* కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పడ్డ పార్టీలో ఇప్పుడు అన్నీ కాంగ్రెస్ ముఖాలే
* ఎన్టీఆర్ హయాంలో కార్యకర్తలకు పెద్దపీట.. ఇప్పుడు కార్పొరేట్లకు రెడ్‌కార్పెట్
* నాడు సంక్షేమం.. నేడు సంక్షోభం..

కె.సుధాకర్‌రెడ్డి:
పార్టీ ప్రస్థానం- తెలుగుదేశం                                                                                                                                     అప్పుడు..  తెలుగుదేశం ప్రారంభించిన కొత్తలో..  ఎన్‌టీఆర్ ఇంటివద్ద ప్రతి రోజూ ఉదయం  నాలుగు గంటల నుంచే తన కోసం వచ్చే సందర్శకులను కలిసేవారు. ఎవరొచ్చినా ఒక్కొక్కరు వరుసలో వస్తూ కలిసివెళ్లే వారు. ఆ సమయంలో దేశంలో పేరెన్నికగన్న పారిశ్రామిక వేత్తలు సూటు బూటు వేసు కుని చేతిలో చిన్న సైజు సూట్‌కేసుతో వచ్చారు. పరిచయాలయ్యాక  ఒక చెక్ బుక్ తీసి కోట్లలో అంకె వేసి పార్టీ ఖర్చుల కోసం మా తరఫున ఓ చిన్న కానుక అని ఎన్టీఆర్ చేతిలో పెట్టారు. అది చూసిన ఎన్టీఆర్ మండి పడ్డారు. మీరు మమ్మల్ని కొనడానికి ప్రయత్నిస్తున్నారా? ఏమిటిదంతా..! అంటూ నిలదీశారు. ఇంకోసారి ఇలాంటివి చేయకండి బ్రదర్  అంటూ కోపంగా చెక్కును వెనక్కిచ్చేశారు.
 
 ఇప్పుడు...
 ఎన్టీఆర్‌ను గద్దెదింపి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు ఇంటివద్ద సందర్శకులకు అనుమతి లేదు. ఆ పరిసరాల్లో కార్యకర్తల జాడే కనిపించదు. కొంత హడావిడి మాత్రం కనిపిస్తూ ఉంటుంది. సూటు బూటు వేసుకున్న కొందరు అక్కడ ఏవేవో పనుల్లో నిమగ్నమవుతూ హడావిడి చేస్తుంటారు. వారి అనుమతి లేకుండా పార్టీ నేతలు సైతం గేటుదాటి లోనికి వెళ్లే పరిస్థితి ఉండదు. ఎవరైనా సూటు బూటు వేసుకుని నల్లటి సూట్‌కేసులతో వస్తే వారికి జరగాల్సిన సపర్యలన్నీ జరిగిపోతాయి. వారు నేరుగా ఇంట్లోకెళ్లి వెయిటింగ్ హాల్లో ఆసీనులవుతారు. వారెందుకొచ్చారో ఆ పరిసరాల్లో తచ్చాడే నేతలకు కూడా తెలియదు. వారు నాయకుడితో మాట్లాడి వెళ్లిపోయిన తర్వాతే నేతలెవరైనా కలవాలంటే కలుసుకోవచ్చు. అది కూడా ఓ మోస్తరు స్థాయున్న వారికైతేనే ప్రవేశం. కార్యకర్తలెవరైనా కలవాలనుకుంటే ఎన్టీఆర్ పేరుతో నిర్మించిన ట్రస్టుభవన్‌కే రావాలి. అక్కడే గంటల తరబడి నిరీక్షించాలి. నాయకుడెప్పుడొస్తారో కూడా చెప్పే వారుండరు. వచ్చాక ఎప్పుడు కలుస్తారో  తెలియదు.
 
 ఎన్టీఆర్‌పై చెప్పులేయించిన ఘనత
 ఆగస్టు సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తన శిబిరంలో చేరుతున్నట్లుగా చంద్రబాబు ప్రచా రం చేయించారు. ఆగస్టు నెలంతా ఇలాంటి డ్రామా నడిపి ఎమ్మెల్యేలపై మైండ్ గేమ్ ఆడి వారందరినీ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేలను తిరిగి ఆహ్వానించడానికి ఎన్టీఆర్ వైస్రాయ్ హోటర్‌కు బయలుదేరగా టాంక్‌బండ్‌పై ఆయన వాహనంపై చెప్పులేయించారు. ఎమ్మెల్యేలను హోటల్ గదుల్లో బంధించి ప్రతిరోజూ రాత్రి వారిని రకరకాల ప్రలోభాలకు గురిచేశారు.
 
19822014..  రెండు దశలు.. రెండు పార్శ్వాలు!
 పార్టీ స్థాపించిన తొలినాళ్లలో ఎన్టీఆర్‌ను చూస్తే కార్యకర్తలకు జోష్...! కార్యకర్తల జోష్ చూస్తుంటే ఎన్టీఆర్ అంతకన్నా హుషారుగా నా తమ్ముళ్లారా...! అంటూ మరింత ఉత్సాహం కలిగించేవారు. ఇదంతా తొలినాళ్లలో ఉన్న కోలాహలం...! ఇప్పుడు పార్టీలో ఆ పరిస్థితి లేదు. ముప్పయి ఏళ్లలోనే వృద్ధాప్యం ఆవరించింది. పార్టీ పరంగా చూస్తే టీడీపీలో 1982 నుంచి 1995 వరకు ఒక దశ. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన 1995 నుంచి 2014 వరకు రెండో దశ. ఈ రెండు దశల్లోనూ పార్టీలోని రెండు పార్శ్వాలు ఆవిష్కృతమయ్యాయి.
 
రెండు కుట్రలు
ఎన్టీఆర్‌ను గద్దె దింపడమే ధ్యేయంగా రెండు కుట్రలు జరిగాయి. ఒకటి 1984లో నాదెండ్ల భాస్కరరావు చేశారు. రెండోది సొంత అల్లుడు చంద్రబాబు చేశారు. దానికి ప్రజాస్వామ్య పరిరక్షణ అని పేరుపెట్టి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కారు. టీడీపీ ఏర్పా టు సమయంలో కాంగ్రెస్‌లో ఉన్న చంద్రబాబు.. సొంత మామ ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానని సవాలు చేశారు. ఆయనపై పోటీ చేయనప్పటికీ తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే కుటుం బ సభ్యులతో రకరకాలుగా ఒత్తిళ్లు చేయించి టీడీపీలో చేరారు. మొదట్లో చంద్రబాబు చేరికను ఎన్టీఆర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కుటుంబ సభ్యుల ఒత్తిళ్లతో కాదనలేకపోయారు. అప్పటి నుంచే పార్టీలో చంద్రబాబు ముద్ర పడింది. టీడీపీ దారి తప్పింది.
 
 జామాతా దశమ గ్రహ..
 ఓటమన్నది లేని ఎన్టీఆర్‌కు తన జీవితంలో అత్యంత దారుణమైన ఓటమి ఎదురైంది చంద్రబాబుతోనే. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కి ఏడాది కూడా గడవకముందే 1995 ఆగస్టులో అత్యంత నాటకీయంగా, కుట్ర పూరితంగా ఎన్టీఆర్‌ను గద్దెదించిన చంద్రబాబు అప్పటి నుంచి మళ్లీ పార్టీలో ఎన్టీఆర్ కుటుంబీకుల ప్రభావం లేకుండా జాగ్రత్తపడ్డారు. ఎన్టీఆర్‌ను దింపడానికి ఆయన కుటుంబ సభ్యులనే పావులుగా ఉపయోగించుకున్న బాబు అధికారం చేపట్టగానే ఒక్కొక్కరినీ దూరం పెట్టారు. హరికృష్ణకు పార్టీలో ప్రాధాన్యతను క్రమంగా తగ్గించడం, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును పార్టీకి దూరం చేయడం అందులో భాగమే. చంద్రబాబు కుటిల నీతికి, దుర్మార్గానికి ఎన్టీఆర్ ఎలా బలయ్యారో.. ఎంత వేదన అనుభవించారో చంద్రబాబును ‘జామాతా దశమ గ్రహ’ అంటూ ఎన్టీఆర్ చేసిన ప్రసంగమే ప్రత్యక్ష నిదర్శనం.
 
సంక్షేమాన్ని మింగి..
 రెండు రూపాయలకే కిలో బియ్యం, 50 రూపాయలకే హార్స్‌పవర్ విద్యుత్, జనతా వస్త్రాలు... ఇలా సంక్షేమ ఎజెం డాతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తే.. చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత సంక్షేమ కార్యక్రమాలకు పుల్‌స్టాప్ పెట్టేశారు. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇవ్వలేనని దాన్ని మొదట 3.50 రూపాయలు పెంచారు. ఆతర్వాత 5.25 రూపాయలకు పెంచారు. జనతా వస్త్రాలను ఎత్తేశారు. ఎన్టీఆర్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తే దాన్ని ఎత్తివేయడమే కాకుండా ఊరూరా బెల్ట్ షాపులను తెరిపించారు.
 
గ్రామంలో వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వారెవరైనా ఉంటే వారు మరణిస్తేనే మరొకరికి మంజూరు చేశారు. ఉద్యోగ నియామకాలను పట్టించుకోలేదు. సమ్మెకు దిగుతామన్నందుకు కార్మిక సంఘాలనే నిషేధిస్తానన్నారు. కరెంట్ ఛార్జీలు తగ్గించమన్న పాపానికి జనంపై (బషీర్‌బాగ్‌లో) ఏకంగా కాల్పులు జరిపించారు. డ్రాక్రా మహిళలపై ఇందిరాపార్క్ వద్ద వాటర్ కేనన్లు ప్రయోగించి గుర్రాలతో తొక్కించారు. ఇలాంటివి చంద్రబాబు పాలనలోని లెక్కలేనన్ని ఉన్నాయి. ఆయన పాలనపై ‘చంద్రబాబు జమానా అవినీతి ఖజానా’ అని సీపీఎం ఒక పుస్తకాన్నే ప్రచురించింది.
 
 బాబు నాయకత్వంలో చతికిలపడిన టీడీపీ
 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ అగ్రనేత వాజ్‌పేయి ప్రభంజనం, కార్గిల్ యుద్ధ ప్రభావం కారణంగా మళ్లీ అధికారంలోకి రాగలిగారు. చంద్రబాబు జీవితంలో అది కూడా బీజేపీ అండతో ఒ ఒక్కసారి మాత్రమే అధికారంలోకి రాగలిగారు. 2004 నుంచి 2014 దశాబ్దకాలంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. 2004 లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీతో పాటు అన్ని ఎన్నికలను ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో నాలుగు పార్టీలు కలిసి మహా కూటమిని ఏర్పాటు చేసుకున్నా గెలవలేకపోయారు. 2009 తర్వాత జరిగిన ఏ ఉపఎన్నికలోనూ చంద్రబాబు పార్టీని గెలిపించలేకపోయారు.
 
 ఎన్టీఆర్‌కే అన్యాయం జరిగింది. నువ్వెంత?
 పార్టీ 33 వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా రెండు రోజుల కిందట పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం జరిపారు. ఎలాంటి ఉత్సాహం లేకుండా చాలా సాదాసీదాగా ఆ కార్యక్రమం ముగిసింది. కార్యకర్తలందరినీ రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తనపై ఉందని ఆ సందర్భంగా చంద్రబాబు చెబుతూ, అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తానన్నారు. అయితే ఆయన అధికారంలోకి వస్తే ఎలాంటి న్యాయం చేస్తారనడానికి ఒక ఉదాహరణ ఇది. ఎన్టీఆర్‌ను గద్దె దింపి 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు ప్రతిరోజూ సచివాలయం నుంచి హైదర్‌గూడలోని పార్టీ కార్యాలయానికి వచ్చి అక్కడ కొద్దిసేపు గడిపి ఇంటికెళ్లేవారు. ఒకరోజు ఆయన పార్టీ కార్యాలయానికి రావడానికి ముందు పార్టీలో ఒక స్థాయి ఉన్న నాయకుడొకరు వచ్చి కార్యాలయం మెట్ల వద్ద నిలబడి పదవుల విషయంలో పార్టీ తనకు అన్యాయం చేసిందంటూ తన బాధను వ్యక్తం చేస్తున్నారు. ‘పార్టీలో మొదటి నుంచి జెండా మోస్తున్నా.. ఆస్తులు పోయాయి.. నాకు (ఒక కార్పొరేషన్‌లోని డెరైక్టర్) పదవి ఇవ్వకుండా అన్యాయం చేశార’ంటూ ఆ వ్యక్తి బిగ్గరగా అరుస్తున్నారు. అంతలో లోపలనుంచి పార్టీ ప్రధాన  కార్యదర్శి మాణిక్‌రెడ్డి బయటకొచ్చి.. ‘ఏంటయ్యా! అప్పటి నుంచి తెగ అరుస్తున్నవ్. పో..పోవయ్యా..! ఈ పార్టీలో ఎన్టీఆర్‌కే అన్యాయం జరిగింది. నిన్నడిగినోళ్లెవరు..! అంటూ గట్టిగా సమాధానమిచ్చారు. ఆ ఒక్క సమాధానంతో వచ్చిన వ్యక్తి మళ్లీ మాట్లాడలేదు. మరెప్పుడూ పార్టీ కార్యాలయం మెట్లెక్కలేదు.
 
 పార్టీలో ఇప్పుడన్నీ కాంగ్రెస్ ముఖాలే
 ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న చంద్రబాబు ఆ తర్వాత టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. పైగా తన శరీరంలో 30 శాతం కాంగ్రెస్ రక్తం ఉందని నిండు శాసనసభలో ప్రకటించారు. అధికారంలో ఉన్నంతకాలం కాంగ్రెస్‌ను దూరం పెట్టినా ఆ తర్వాత కాలంలో మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం చంద్రబాబు కాంగ్రెస్‌కు సన్నిహితమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు. రాష్ట్ర విభజన అంశంపై సీమాంధ్ర ప్రజలు ఆందోళనబాట పట్టినప్పుడు తాపీగా తన ఇంట్లో నుంచే రెండు కళ్లు, కొప్పరి చిప్పలు, తండ్రీకొడుకులు.. అంటూ రకరకాల థియరీలు చెబుతూ కాలక్షేపం చేశారు. ఆ తర్వాత పరిణామాల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లో చేరితే ఆ పార్టీలు బలపడుతాయని చెబుతూ కాంగ్రెస్ నేతలందరినీ టీడీపీలో చేర్పించుకుంటున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఇప్పుడన్నీ ‘గాంధీభవన్’లో చూసిన ముఖాలే కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement